బుధవారం 12 ఆగస్టు 2020
Hyderabad - Feb 14, 2020 , 04:19:30

ప్రకృతి పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలి

ప్రకృతి పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలి

అబిడ్స్‌: పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపడుతోందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. రాష్ట్రం గ్రీన్‌తెలంగాణగా మారేలా ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్‌ ముగింపు వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రకృతిని కాపాడేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్‌ నిర్వహించాలని 1938లో ఉస్మానియా యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లు నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో 100 స్టాళ్లతో నుమాయిష్‌ను ప్రారంభించగా ఎనభై సంవత్సరాల్లో ప్రపంచ ఖ్యాతి పొం దిందన్నారు. తెలంగాణలో వెనకబడిన ప్రాంతాల్లో 18 విద్యాసంస్థలను స్థాపించి ఆయా విద్యాసంస్థల ద్వారా విద్యార్థినులకు విద్యావ్యాప్తి చేస్తున్న సొసైటీ సేవలు ప్రశంసనీయమన్నారు. ఎగ్జిబిషన్‌ వ్యవస్థాపకులు గొప్ప ఆలోచనతో దేశంలోని వివిధ రాష్ర్టాల్లోని పరిశ్రమల ఉత్పత్తుల ప్రదర్శన చేయడంతోపాటు వాటి అమ్మకాలు చేసేందుకు వీలుగా అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఏర్పాటు చేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. గ్రీన్‌ తెలంగాణ దిశగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ గొప్ప ఆలోచనతో చేపడుతున్న నుమాయిష్‌ను మరింత విస్తరించి విద్యా వ్యాప్తికి కృషి చేయాలన్నారు. 


శతాబ్దికాలం నాటికి ఎగ్జిబిషన్‌కు మరింత ప్రాచూర్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సొసైటీ ప్రతినిధులు ఎంతో కష్టపడి పకడ్బందీగా భద్రతాచర్యలతో నుమాయిష్‌ను నిర్వహించ డం అభినందనీయమన్నారు. తనకు బిజీ షెడ్యూల్‌ ఉన్నప్పటికీ ఎగ్జిబిషన్‌ సొసైటీ వారు ఒక గొప్ప ఆలోచనతో చేపడుతున్న నుమాయిష్‌ ముగింపు సమావేశానికి హాజ రుకావాలని నిర్ణయించుకుని హాజరైనట్లు తెలిపారు. సరోజినినాయుడు జన్మదినం రోజున ఈ కార్యక్రమానికి హాజ రుకావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సరోజినినాయుడు ప్రకృతిని ప్రేమించేదని గుర్తు చేశారు.  అంతకు ముందు ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాద్యక్షుడు సురేందర్‌, కార్యదర్శి డాక్టర్‌ ప్రభాశంకర్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం సీపీ అంజనికుమార్‌, జాయింట్‌ కమిషనర్‌ విశ్వప్రసాద్‌, ఆర్‌డీఓ శ్రీనివాస్‌, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ వినయ్‌కపూర్‌లతోపా టు వివిధ శాఖల అధికారులను, సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తూ ఉత్త మ ఫలితాలను సాధించిన విద్యార్థులకు గోల్డ్‌ మెడళ్లను అందచేశారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్‌ సొసైటీ సంయుక్త కార్యదర్శి హనుమంతరావు, కోశాధికారి వినయ్‌కుమార్‌, సమావేశం కన్వీనర్‌ ఉషారాణిలతోపాటు సొసైటీ సభ్యు లు, స్టాల్‌ హోల్డర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 


మినీ ట్రైన్‌లో ఎగ్జిబిషన్‌ చుట్టూతిరిగిన గవర్నర్‌

అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మినీ ట్రైన్‌లో చుట్టు ముట్టారు. ముగింపు సమావేశానికి హాజరైన ఆమె మినీ ట్రైన్‌లో నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనికుమార్‌, ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు ఎన్‌.సురేందర్‌, కార్యదర్శి డాక్టర్‌ ప్రభాశంకర్‌, సంయుక్త కార్యదర్శి హనుమంతరావు, కోశాధికారి వినయ్‌కుమార్‌ తదితర అధికారులతో కలిసి మినీట్రైన్‌లో ప్రయాణం చేస్తూ ఎగ్జిబిషన్‌లోని స్టాళ్ల ను పరిశీలించారు.


logo