గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 13, 2020 , 04:21:26

ప్రపంచ వాణిజ్యంలోభారత్‌ వాటా 5శాతానికి చేరుకోవాలి

ప్రపంచ వాణిజ్యంలోభారత్‌ వాటా 5శాతానికి చేరుకోవాలి

బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ : ప్రపంచ వాణిజ్యంలో 2%ఉన్న భారత్‌ వాటా రాబోయే మూడేండ్లలో 5శాతానికి చేరుకోవాలనే లక్ష్యంతో పారిశ్రామిక రంగం పని చేయాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ సూచించారు. ఇంజినీరింగ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌(ఈఈపీసీ) ఇండియా ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ పరిశ్రమలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన సంస్థలకు ప్రతియేటా ఇచ్చే ఎగుమతుల అవార్డుల ప్రదానోత్సవం బుధవారం బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌లో నిర్వహించారు. దేశ విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతులు చేస్తున్న దక్షిణాది రాష్ర్టాలకు చెందిన పలు ఇంజినీరింగ్‌ ఆధారిత పరిశ్రమలకు చెందిన సంస్థలకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ మాట్లాడుతూ..ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురవుతున్నా దేశీయ పరిశ్రమలు మంచి పనితీరును కనబరుస్తూ దేశ గౌరవాన్ని పెంచుతున్నాయన్నారు. రక్షణ రంగంతోపాటు అనేక రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారత్‌ ఎగుమతులు ఉన్నాయన్నారు. గతంలో వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అనేక వస్తువులను ప్రస్తుతం మన దేశం నుంచి ఎగుమతి చేస్తున్న పరిస్థితి వచ్చిందంటే ఆయా పరిశ్రమలకు చెందిన పట్టుదలే కారణమన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రపంచ వాణిజ్యంలో వాటాను 5 శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యానికి దోహదపడాలని సూచించారు. కార్యక్రమంలో ఈఈపీసీ వైస్‌ చైర్మన్‌ మహేశ్‌ కె.దేశాయ్‌, రీజినల్‌ చైర్మన్‌ కేఎస్‌.మణి తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>