ఆదివారం 29 మార్చి 2020
Hyderabad - Feb 13, 2020 , 04:19:35

టీఆర్‌ఎస్‌ పాలనలోనే బోరబండ అభివృద్ధికి బాటలు

టీఆర్‌ఎస్‌ పాలనలోనే బోరబండ అభివృద్ధికి బాటలు

ఎర్రగడ్డ, నమస్తే తెలంగాణ: సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీడీపీలు బోరబండ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారు. ఆ ప్రభుత్వాలు బోరబండ ప్రాంతాన్ని అభివృద్ధి పర్చడంలో విఫలమయ్యారు. కనీస వసతులు లేక ఈ ప్రాంతవాసులు పడినకష్టాలు అన్నీఇన్నీ కాదు. ఎన్నికల సమయాల్లో ఓట్లను దండుకోవటం.. అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించటం.. ఈ విధంగా దశాబ్దాలపాటు బోరబండను నిరాదరణకు గురిచేశారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బోరబండ ప్రాంత అభివృద్ధికి బాటలు పడ్డాయి. బాబా ఫసియుద్దీన్‌ డిప్యూటీమేయర్‌ అయిన తర్వాత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సహకారంతో అభివృద్ధి విషయంలో స్పీడ్‌ పెరిగిందని చెప్పాలి. డిప్యూటీ మేయర్‌ పదవిని చేపట్టి నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన అభివృద్ధి గురించి బాబా ఫసియుద్దీన్‌ మాటల్లోనే..


నమస్తే తెలంగాణ: తెలంగాణ ఉద్యమకారుడిగా బోరబండ ప్రాంతం నుంచి చేతులు బిగించి నాడు కేసీఆర్‌ బాటలో నడిచారు. ప్రస్తుతం డిప్యూటీమేయర్‌ పదవిలో ఉన్నారు. బోరబండ అభివృద్ధికి ఏ విధంగా పునాది వేశారు?

డిప్యూటీ మేయర్‌: బోరబండలో పుట్టి పెరిగాను. నేను విద్యార్థి దశలో ఉన్న రోజుల్లో ఇక్కడి బస్తీలను చూస్తే చాలాజాలి వేసేది. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న బోరబండను గతంలో పట్టించుకునే నాథుడే లేడు. డిప్యూటీమేయర్‌ అయిన తర్వాత బోరబండను అభివృద్ధి చేశారు.

నమస్తే తెలంగాణ: అభివృద్ధి విషయంలో ప్రధానంగా ఏఏ అంశాలపై దృష్టి పెట్టారు?

డిప్యూటీ మేయర్‌: తొలి ఏడాదిలో మౌలిక వసతులైన రోడ్లు, తాగునీరు, సివరేజీ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాను. ఆ తర్వాత ప్రతి బస్తీకి కమ్యూనిటీహాల్‌, బస్తీలకు మెరుగైన విద్యుత్‌ సరఫరా వచ్చేలా చర్యలు తీసుకున్నాం.

నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ పరిధిలో ఇతర డివిజన్లకు భిన్నంగా బోరబండలో ఏదైనా జరిగిందా?

డిప్యూటీ మేయర్‌: గ్రేటర్‌లో ఎక్కడా లేనివిధంగా బోరబండలో జీహెచ్‌ఎంసీ ద్వారా పిల్లలకు ప్రత్యేకించి పార్కును ఏర్పాటు చేయటం జరిగింది. ఇక ప్రొఫెసర్‌ జయశంకర్‌, అమరవీరుడు తుర్రెబాజ్‌ఖాన్ల పేర్లను కమ్యూనిటీ హాళ్లకు పెట్టటం జరిగింది.

నమస్తే తెలంగాణ: ఈ నాలుగేండ్ల వ్యవధిలో ఎన్ని నిధులతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి?

డిప్యూటీ మేయర్‌: గడిచిన నాలుగేండ్ల వ్యవధిలో వివిధ అభివృద్ధి పనులకు గానూ మొత్తం రూ.52 కోట్లు వెచ్చించటం జరిగింది. ఇవే కాకుండా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద ఎక్కువ మంది లబ్ధిదారులుగా గ్రేటర్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో బోరంబడ ఉన్నది.

నమస్తే తెలంగాణ: బోరబండలో గతంలో ఉన్న దీర్ఘకాలిక సమస్య ఏమిటి.. దాని పరిష్కారానికి ఏమి చేయబోతున్నారు?

డిప్యూటీ మేయర్‌: బోరబండలో ప్రధాన సమస్య ఇరుకుగా ఉన్న మెయిన్‌ రోడ్డు. దీని వల్ల స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే గోపీనాథ్‌తో కలిసి బల్దియా ఉన్నతాధికారులతో సమావేశమై రోడ్డు విస్తరణకు బీజం పడేలా చేయటం జరిగింది. బోరబండ బస్టాండ్‌ నుంచి సైట్‌-3 వరకు 60 ఫీట్ల వెడల్పు రోడ్డు పనుల ప్రాథమిక దశ ఇటీవలే పూర్తయింది. వీలైనంత త్వరగా రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేసి ప్రజల కష్టాలను దూరం చేస్తాం.


logo