మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Feb 13, 2020 , 04:18:04

స్వచ్ఛ నగరం.. సాధిస్తాం

స్వచ్ఛ నగరం.. సాధిస్తాం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ను పరిశుభ్రనగరంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని, అలాగే  పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నామని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. నగరం చుట్టూ కొత్త పార్కులను ఏర్పాటు చేస్తామని, ప్రజలు, ముఖ్యంగా మహిళలు  ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని టాయిలెట్లను నిర్మిస్తామని మేయర్‌ తెలిపారు. ప్రధాన రోడ్లను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అలాగే, ట్రాఫిక్‌ సమస్య నివారణలో భాగంగా చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ మొదటిదశను పూర్తిచేస్తామని, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. మేయర్‌గా నాలుగేండ్ల్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రామ్మోహన్‌ ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా గడచిన నాలుగేళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు గుర్తుచేస్తూ, వచ్చే ఏడాది కాలంలో తమ 

ప్రాధాన్యలను వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే....


300 ప్రాంతాల్లో పచ్చదనం 

 పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఆదేశాల ప్రకారం కాలనీల్లోని ఖాళీస్థలాల్లో పార్కులను అభివృద్ధి చేయడంతోపాటు ఉన్న పార్కుల్లో మొక్కలు నాటాలని నిశ్చయించాం. 616 ఖాళీ జాగాలను గతంలో గుర్తించగా, అందులో గత హరితహారంలో 300 స్థలాల్లో మొక్కలు నాటాం. మిగిలిన వాటిల్లో 50 చోట్ల థీమ్‌ పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. ఇవికాకుండా 250 చోట్ల కూడా పార్కులను, పెద్ద స్థలాలు ఉన్నచోట మేజర్‌ పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈ ఏడాదిలో ఇవన్నీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం.


పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరుస్తాం

గ్రేటర్‌ను పరిశుభ్రనగరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నాం. వీధులు ఊడ్చే సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పిస్తూ పారిశుధ్య పనులు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మారుమూల ప్రాంతాలుసహా ఇంటింటి చెత్తసేకరణ కోసం మరిన్ని చెత్త టిప్పర్లను సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇండోర్‌ తరహాలో తడి, పొడి చెత్తను పూర్తిస్థాయిలో విడదీసి సేకరించేందుకు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. పారిశుధ్య పనుల పర్యవేక్షణ బాధ్యతను వైద్యుల నుంచి తొలగించి ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్లకు అప్పగించాం. 


3000 టాయిలెట్ల నిర్మాణం

  పురపాలకశాఖ మంత్రి కే.టీ.రామారావు ఆదేశాల ప్రకారం జోన్‌కు 500 చొప్పున టాయిలెట్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నగరంలో సమీప భవిష్యత్తులో 3000 కొత్త టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాం. ముంబైకి చెందిన ఆర్కిటెక్చర్‌ రూపొందించిన నమూనాల్లో ఇప్పటికే పదిరకాల నమూనాలను కూడా ఎంపిక చేశాం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వీటి నిర్మాణం చేపడతాం. ఇప్పటికే నగరంలోని 300 ప్రాంతాల్లో టాయిలెట్లు కొనసాగుతున్నాయి. అయినా రద్దీ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని షీ టాయిలెట్లకు ప్రాధాన్యతనిస్తున్నాం. 


దశలవారీగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల పంపిణీ

 నగరంలోనే పేదల కోసం చేపట్టిన లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణంలో దాదాపు 60వేల ఇండ్లు తుదిదశలో ఉన్నాయి. వాటిని దశలవారీగా పంపిణీ చేయడంతోపాటు వచ్చే ఏడాదిలో మిగిలిన ఇండ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తాం. కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. కొల్లూరు, రాంపల్లి తదితర ప్రాంతాల్లో వేలసంఖ్యలో ఇండ్లున్న మెగా కాలనీలు నిర్మిస్తున్నాం. ఇన్‌సిటూ(గుడిసెలున్నచోట వాటిని తొలగించి పక్కాగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మాణం) పద్ధతిలో నిర్మిస్తున్న 800 ఇండ్లు త్వరలోనే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 


ఎస్‌ఆర్‌డీపీ మొదటి దశ పూర్తి చేస్తాం

 ట్రాఫిక్‌ సమస్య పరిష్కారంలో భాగంగా చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ) మొదటిదశను ఈ ఏడాదిలో పూర్తి చేస్తాం. ముఖ్యంగా దుర్గంచెరువుపై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.186కోట్లతో నిర్మిస్తున్న తీగల వంతెన పనులు పూర్తయ్యాయి. లైటింగ్‌, ఇతర తుదిమెరుగులు దిద్దుతున్నారు. త్వరలోనే దీనిని ప్రారంభిస్తాం. అలాగే, దీనికి సమాంతరంగా చేపట్టిన జూబ్లీహిల్స్‌ ఫ్లైఓవర్‌కు కూడా భూసేకరణ పనులు పూర్తయ్యాయి. పనులు వేగం పుంజుకున్నాయి. ఎల్బీనగర్‌, కామినేని ఫ్లైఓవర్ల నిర్మాణం పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇవన్నీ వచ్చే నాలుగైదు నెలల్లోనే పూర్తిచేసి అందుబాటులోకి తెస్తాం. ఇప్పటికే ఎనిమిది ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు పూర్తయ్యాయి. వీటితో హైటెక్‌సిటీ, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు చాలావరకు తగ్గినట్లు చెప్పవచ్చు. 


సీఆర్‌ఎంపీ ద్వారా ప్రధాన రోడ్లను మరింత మెరుగుపరుస్తాం..

 రోడ్ల నిర్వహణను మెరుగుపర్చేందుకు సమీకృత రోడ్ల నిర్వహణ ప్రణాళిక(సీఆర్‌ఎంపీ)ని చేపట్టాం. ఇందులో భాగంగా రూ.1800కోట్లతో  ప్రధాన రోడ్లను దాదాపు 709 కిలోమీటర్ల మేర నగరరోడ్లను ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో నిర్వహించాలని నిశ్చయించారు. ఎక్కడా చిన్న గుంతకూడా ఉండకుండా వారికి స్పష్టమైన ఆదేశాలు జారీచేశాం. అధికారులు పర్యవేక్షణ బాధ్యతలు చూస్తారు. నాణ్యతలో తేడావస్తే కాంట్రాక్టర్లను బ్లాక్‌లీస్టులో పెట్టడమే కాంకుడా పర్యవేక్షక అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం. రోడ్లపై ఫిర్యాదులు చేసేందుకు ప్రజలకు కూడా ఆయా ప్రాంతాల్లో రోడ్లపై బోర్డులు ఏర్పాటుచేసి ఏజెన్సీల ఫోన్‌ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. 


60 కిలోమీటర్ల మేర కొత్త ఫుట్‌పాత్‌లు

 పాదచారుల సౌకర్యార్థం జోన్‌కు పది కిలోమీటర్ల చొప్పున 60 కిలోమీటర్ల మేర కొత్త ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టాం. ఉన్నవాటిని మెరుగపర్చడంతోపాటు కొత్తవి నిర్మిస్తున్నాం. అంతేకాకుండా ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను చాలావరకు తొలగించాం. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) ఆధ్వర్యంలో ఫుట్‌పాత్‌ ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పాదచారులు ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటకుండా ఫుట్‌పాత్‌లకు గ్రిల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఫుట్‌పాత్‌లపైకి ద్విచక్రవాహనాలు ఎక్కించకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. 


వార్డుకి రెండు బస్తీ దవాఖానలను అందుబాటులోకి తెస్తాం

 గ్రేటర్‌వ్యాప్తంగా పేదలకు కనీస వైద్య సదుపాయాలు అందించే ఉద్దేశంతో ప్రతి వార్డులో కనీసం రెండుచొప్పున బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో ఇప్పటికే దశలవారీగా 123 ప్రాంతాల్లో ఏర్పాటు చేయగా, మిగిలిన ప్రాంతాల్లో వాటి ఏర్పాటుకు స్థలాలను, భవనాలను గుర్తించాం. వైద్య-ఆరోగ్యశాఖ సిబ్బందిని నియమించడంతోపాటు మందులను సరఫరా చేస్తుంది. కనీసం 5000జనాభాకు ఒకటిచొప్పున ఇటుంటి దవాఖానలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. స్థలాల లభ్యత ఆధారంగా భవిష్యత్తులో వీటి సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించాం. 


logo
>>>>>>