సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 13, 2020 , 04:16:04

పట్టు వదలకుండా.. మెట్టు దిగకుండా..

పట్టు వదలకుండా.. మెట్టు దిగకుండా..
  • ఛాలెంజ్‌గా బంజారాహిల్స్‌ దొంగతనం కేసు ఛేదన
  • 45 రోజులు పోలీసుల నిరంతర శ్రమ
  • హాక్‌ ఐ మొబైల్‌ అప్లికేషన్‌ వాడాలంటున్న సీపీ అంజనీకుమార్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  హైదరాబాద్‌లో దొంగతనాలు చేయాలంటే అంతరాష్ట్ర ముఠాలు వణికిపోతున్నాయి.. అలాంటిది హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భారీ చోరీకి బీహార్‌ గ్యాంగ్‌ ఎలా పాల్పడిందనే విషయాన్ని తేల్చేందుకు హైదరాబాద్‌ పోలీసులు ఈ ఘటనను ఛాలెంజ్‌గా తీసుకున్నారు. అయితే బీహార్‌కు వెళ్లి ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి 45 రోజులపాటు బంజారాహిల్స్‌ పోలీసులు ఎన్నో కష్టాలు పడ్డారు. తెలుగులో మూడేండ్ల కిందట వచ్చిన ‘ఖాకీ’ సినిమాలోని సన్నివేశాలను తలపించే విధంగా బీహార్‌లో పలు అనుభవాలను సిటీ పోలీసులు ఎదుర్కొన్నారు. డిసెంబర్‌ 9వ తేదీన పోలీసులకు ఫిర్యాదు అందగానే రామాశిష్‌కు సంబంధించిన వారెవరున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. అసలు బీహార్‌ నుంచి ఎలా వచ్చారు.. ఉద్యోగంలో ఎలా చేరాడనే విషయంలో సమాచారాన్ని సేకరించారు. బీహార్‌ మధుబని జిల్లాలోని నిర్భపూర్‌ గ్రామానికి చెందిన భగవత్‌ ముఖియా లీడర్‌గా వ్యవహరిస్తూ ఏజెన్సీల ద్వారా వీరిని నియమించినట్లు గుర్తించారు. భగవత్‌ సూచనలతో బంజారాహిల్స్‌లో పనిచేస్తున్న బోలా ముఖియా ద్వారా రామాశిష్‌ వ్యాపారి ఇంట్లో వంట మనిషిగా పనిలో చేరినట్లు గుర్తించిన పోలీసులు అతడి కోసం వేట ప్రారంభించారు. 


నిందితుల కంటే ముందే పోలీసులు..! 

ఫిర్యాదు అందిన గంటల వ్యవధిలోనే బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇందులోభాగంగా హైదరాబాద్‌లో ఏడేండ్లుగా ఉంటున్న బోలాముఖియా ఇచ్చిన సమాచారంతో నిందితుల స్వగ్రామానికి పోలీసులు, నిందితుల కంటే ముందే చేరుకున్నారు. నిందితులు సైతం బంజారాహిల్స్‌ పోలీసులు ఇంత వేగంగా తమ స్వగ్రామానికి వస్తారనే విషయాన్ని గుర్తించలేకపోయారు. ఇక్కడ దొంగతనం జరగ్గానే తమ స్వగ్రామంలో నిందితులు జరిగిన విషయాన్ని చెప్పిపెట్టారు. అయితే దొంగలు నేరుగా తమ స్వగ్రామానికి వెళ్లకుండా, ముంబాయి నుంచి తమ స్వగ్రామానికి దగ్గరల్లో ఉన్న ఓ ప్రాంతానికి చేరుకొని అక్కడే వారం రోజులపాటు ఉన్నారు. సిటీ పోలీసులు దొంగల స్వగ్రామం, వారి బంధువుల ఉండే గ్రామాల వివరాలతో అక్కడ నిఘా పెట్టారు. మరో పక్క దొంగిలించిన వజ్రాలను గుజరాత్‌లోని సూరత్‌లో విక్రయించే అవకాశాలున్నాయని సందేహపడుతూ అక్కడకు కూడా మరో బృందాన్ని పంపించి గాలింపు చేపట్టారు. మరో పక్క మధుబని జిల్లా నేపాల్‌కు సమీపంలో ఉండడంతో దేశం విడిచి పరారయ్యే అవకాశాలుండడంతోపాటు, అక్కడ దొంగ సొత్తు అమ్మే మార్కెట్లను గుర్తించి అక్కడ మరో బృందం నిఘా పెట్టా రు. అయితే పోలీసులకు అనుకున్న సమాచారం రాకపోవడంతో వెనుతిరిగారు. 


రెండోసారి కీలక సమాచారం..!

రెండోసారి కూడా బంజారాహిల్స్‌ పోలీసులు నిందితులను పట్టుకోవడం కోసం నిందితుల స్వగ్రామంలో సోదాలు చేసేందుకు వెళ్లారు. అక్కడి పోలీసుల సహకారంతో నిందితుల ఇండ్లలో అర్ధరాత్రి వేళ సోదాలు నిర్వహించారు. నిందితులు అప్పటికే అక్కడికి వచ్చి వెళ్లిపోయారనే సమాచారాన్ని తీసుకున్నారు. సోదాల్లో సూత్రధారి రామాశిష్‌ ఇంటితోపాటు అనుమానితుల ఇండ్లలో 20 సిమ్‌కార్డులు, 15 వాడని ఫోన్లు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎక్కడున్నారో తెలిపేందుకు ఆ గ్రామస్తులు పోలీసులకు సహకరించ లేదు. అంతేకాకుండా అర్ధరాత్రి మా ఇండ్లలో సోదాలు చేస్తారా అంటూ సిటీ పోలీసులపై దాడికి పాల్పడ్డారు. స్థానిక పోలీసులు వారిని సముదాయించడంతో సమస్య అక్కడ తాత్కాలికంగా సద్దుమణిగింది. దీంతో సిటీ పోలీసులు అక్కడి నుంచి బయటపడ్డారు. ఇదిలాఉండగా పోలీసుల సోదాల విష యం తెలుసుకున్న నిందితులు ఆ గ్రామ పెద్దలకు రూ.2 లక్షలు పంపించారు. స్థానిక పోలీసులను మేనేజ్‌ చేయాలని సూచించారు. దీంతో అప్పటి నుంచి మన పోలీసులకు అక్కడి గ్రామ పెద్దలు, పోలీసుల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. 


ఒక్క ఫోన్‌ నంబర్‌ క్లూ ఇచ్చింది.!

అక్కడ స్వాధీనం చేసుకున్న సిమ్‌కార్డులు, సెల్‌ఫోన్ల ఐఎంఈఐ నంబర్లను పరిశీలించడం ప్రారంభించారు. ఆయా సిమ్‌కార్డులను, ఐఎంఈఐ నంబర్లను విశ్లేషించారు. కొన్ని లక్షల ఫోన్‌ నంబర్లు ఈ క్రమం లో పోలీసులు విశ్లేషిస్తుండగా డిసెంబర్‌ 8వ తేదీ సాయంత్రం బంజారాహిల్స్‌లో చోరీ జరిగిన ప్రాం తం నుంచి నిందితుల స్వగ్రామంలోని ఒక నంబర్‌కు వెళ్లినట్లు గుర్తించారు. దీని ఆధారంగా ఆ గ్యాంగ్‌ సభ్యులను గుర్తించారు. అతడి ద్వారా మొత్తం గ్యాం గ్‌ను కూపీ లాగారు. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా ఈ ముఠాపై ఉన్న కేసుల వివరాలను సేకరించారు. 


మహారాష్ట్ర పోలీసుల చేతికి చిక్కి... 

నిందితులు చోరీ చేసిన సొత్తును ముంబాయి, సూరత్‌, నేపాల్‌లో విక్రయించవచ్చని అనుమానించిన పోలీసులు దొంగ సొత్తును విక్రయించే ప్రాం తాల్లో నిఘా వేశారు. ఈ క్రమంలో ఒక నిందితుడిని పట్టుకునే సమయంలో మహారాష్ట్రలోని పాలఘర్‌లో గాలటా చోటుచేసుకుంది. దీంతో అక్కడి పోలీసులు రంగప్రవేశం చేసి బంజారాహిల్స్‌ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. తమ అనుమతి లేకుండా తుపాకులతో తిరుగుతున్నారంటూ వారిని అనుమానించి, అక్కడి ఠాణాకు తీసికెళ్లారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోడంతో మన పోలీసులు బయటపడ్డారు.


ట్రైన్‌ కోసం ఎదరు చూపులు..!

ముంబాయి నుంచి పాలఘర్‌కు ఈ కేసులో నిందితుడైన రాహుల్‌ ముఖియా వస్తున్నట్లు సాంకేతికంగా సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడి కోసం స్థానిక రైల్వే స్టేషన్‌లో కాపుకాశారు. ఉదయం 7 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు అక్కడే ఉన్నారు. పోలీసులు ఎదురుచూస్తున్న రాహుల్‌ కాకుం డా.. ప్రధాన నిందితుడు రామాశిష్‌ స్టేషన్‌లో పోలీసులకు కన్పించాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై నిందితుడు పరారు కాకుండా.. అతడిని స్టేషన్‌ నుంచి ఓ ఇంటి వరకు రెండు కిలోమీటర్ల దూరం వెంబడిస్తూ వెళ్లారు. అక్కడకు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది.

గోడలో వజ్రాలు.. గోతిలో బంగారం

నిందితులు దొంగిలించిన వజ్రాలను తమ స్వగ్రామంలోని ఓ ఇంటి గోడలో, బంగారాన్ని పశువుల పాకలో గొయ్యి తవ్వి అందులో దాచిపెట్టారు. కిలోన్నర బంగారాన్ని రూ.17 లక్షలకు విక్రయించి తలా కొంత పంచుకున్నారు.


logo