గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 12, 2020 , 03:41:51

దోమలపై డ్రోన్‌తో యుద్ధం

దోమలపై డ్రోన్‌తో యుద్ధం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వర్షాకాలంలో ప్రబలిన వ్యాధులను దృష్టిలో ఉంచుకొని జీహెచ్‌ఎంసీ ముందుజాగ్రత్త చర్యలకు దిగింది. చేతులు కాలాక ఆకులు పట్టుకునే తమ సహజసిద్ధ విధానానికి భిన్నంగా ఈసారి మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో దోమల నివారణ చర్యలకు పూనుకున్నది. వర్షాకాలం వచ్చేలోగా సాధ్యమైనంత మేరకు దోమలను నివారించడమే లక్ష్యంగా ఐదు నెలల కార్యప్రణాళిక చేపట్టారు. డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా చెరువులు, నాలాలు, మూసీ నదిలో దోమలపై యుద్ధం ప్రకటించారు. దోమలతో డెంగీ, మలేరియా, బోదకాలు, మెదడువాపు తదితర వ్యాధులు ప్రబలనున్న విషయం విదితమే. ముఖ్యంగా వర్షాకాలంలో సమస్య ఎక్కువవుతోంది. గత వర్షాకాలంలో డెంగీ వ్యాధి పెద్దఎత్తున వ్యాపించి పలువురు మృత్యువాతపడ్డారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, దీనికి సమగ్ర కార్యాచరణను చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ అధికారులకు స్పష్టం చేశారు. దీంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ముందుచూపుతో ఇప్పటి నుంచే దోమలను అదుపు చేసేందుకు ఐదు నెలల కార్యాచరణను చేపట్టింది. వ్యాధులను అదుపు చేయాలంటే దోమలను నిర్మూలించడమే మార్గం. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాటి ఉత్పత్తి కేంద్రాలపై జీహెచ్‌ఎంసీ డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా యుద్ధం ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పలుచోట్ల నాలాలు, మూసీలో అత్తాపూర్‌ పిల్లర్‌ నం- 118 వద్ద, మియాపూర్‌, ఎల్బీనగర్‌, హఫీజ్‌పేట్‌, సంతోష్‌నగర్‌ ఎర్రకుంట చెరువు, ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని హెచ్‌ఎంటీ, రవీంద్రనగర్‌, పెద్దచెరువు, చిన్నచెరువు, నల్లచెరువు తదితర చెరువుల్లో మందు పిచికారీ చేపట్టారు. నగరంలోని చెరువులన్నీ మురుగునీటితో నిండిపోవడమే కాకుండా గుర్రపుడెక్కతో కమ్ముకొని పోవడంతో దోమల ఉత్పత్తి ఎక్కువవుతోంది. ఫలితంగా వర్షాకాలంలో దోమల సమస్య ఎక్కువైపోయి విష జ్వరాలు, మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి.


మనుషులతో కానిది డ్రోన్లతో...

నగరంలో సుమారు 185 చెరువులు వేలాది ఎకరాల వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి. అలాగే, నగరంలో 22కిలోమీటర్ల మేరకు మూసీనది, 354కిలోమీటర్ల పొడవును నాలాలు పారుతున్నాయి. ఇవన్నీ దోమల ఉత్పత్తి కేంద్రాలే కావడం ఒక ఎత్తైతే వీటన్నింటిలో మనుషులతో రసాయనాలు పిచికారీ చేయడం అంత సులభం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జీహెచ్‌ఎంసీ డ్రోన్‌ టెక్నాలజీని చేపట్టింది. ఐదు నెలలపాటు, అంటే ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు నగరంలోని అన్ని చెరువులు, నాలాలు, మూసీలో డ్రోన్లద్వారా దోమల నివారణ మందులను పిచికారీ చేసేందుకు కార్యప్రణాళిక సిద్ధంచేసి ఆ మేరకు పనులు చేపట్టారు. ఐదు నెలల్లో సమస్యాత్మక చెరువులు, నాలాలు, మూసీలో డ్రోన్ల ద్వారా మందులు పిచికారీ చేసి వర్షాకాలంలో దోమలు వ్యాప్తి చెందకుండా చేయాలన్నది వారి ప్రధాన లక్ష్యం. మనుషుల ద్వారా పనులు చేపట్టాలంటే ముందుగా గుర్రపు డెక్కను తొలగించి మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎంతోమంది అవసరం. అంతేకాదు, సమయం కూడా ఎక్కువ పడుతుంది. సుమారు పది మంది మనుషులు 15 రోజులపాటు చేసే పనులను డ్రోన్‌ ద్వారా రెండు-మూడు గం టల్లోనే పూర్తి చేయవచ్చని అధికారులు తెలిపారు. డ్రోన్ల ద్వారా మందును పిచికారీ చేస్తున్నట్లు వారుపేర్కొన్నారు.


గంటకు నాలుగు ఎకరాల్లో పిచికారీ..

 స్క్యూబ్‌ ఇన్‌ఫ్రా అనే ఏజెన్సీ నగరంలో డ్రోన్‌ ద్వారా మందుల పిచికారీ పనులు చేపట్టింది. గంటకు కనీసం నాలుగు ఎకరాల చెరువులో పిచికారీ పూర్తి చేయవచ్చు. ఒకేసారి పదిలీటర్ల మందును పిచికారీ చేసే అవకాశముంది. క్యూలెక్స్‌ దోమను దీనిద్వారా అదుపు చేయవచ్చని అధికారులు తెలిపారు. ఈ దోమవల్ల ప్రధానంగా మెదడువాపు, బోదకాలు, విషజ్వరాలు, ఇతర చర్మ సంబంధమైన వ్యాధులు వ్యాప్తి చెందుతాయని వారు పేర్కొన్నారు. అంతేకాదు, ఈ దోమలు కుప్పలు కుప్పలుగా ఇండ్లపై దాడి చేస్తాయని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై వీటి ప్రభావం అధికంగా ఉంటుందని వారు చెప్పారు. డెంగీ వ్యాధి ప్రబలే దోమలు ఇండ్లలోని శుభ్రమైన నీటిలోనూ చేరే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.



డ్రోన్‌ టెక్నాలజీతో ఉపయోగాలు

  • మందులు సమర్థవంతంగా పిచికారీ చేసే అవకాశం
  • జలాశయాలు, నాలాలు అన్నీ పూర్తి స్థాయిలో కవర్‌ చేసే వీలు n సమయం ఆదా
  • మందులు వృథా అయ్యే అవకాశం తక్కువ
  • మ్యాన్యువల్‌ పద్ధతిలో మాదిరి కార్మికులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు


logo
>>>>>>