గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 11, 2020 , 01:24:15

‘మహా’ వెంచర్లకు సన్నద్ధం

‘మహా’ వెంచర్లకు సన్నద్ధం
 • మరో మూడు చోట్ల భూ సమీకరణ పథకం
 • భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులు
 • మల్కారంలో 170, భోగారంలో 100, లెమూరు గ్రామంలో 60 ఎకరాలు
 • త్వరలోనే సమ్మతి పత్రాల స్వీకరణ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీ) పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి మార్గం సుగమమైంది. ఎట్టకేలకు అమల్లోకి వచ్చిన భూ సమీకరణ పథకం అతి త్వరలోనే కొన్ని చోట్ల కార్యరూపం దాల్చనున్నది. ల్యాండ్‌ఫూలింగ్‌ స్కీంను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, పథకం ఆమలు ప్రక్రియను వేగిరం చేయాలని ఇటీవల మంత్రి కేటీఆర్‌ పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు ఇప్పటికే ఘట్‌కేసర్‌ మండలం ప్రతాప సింగారం, కొర్రెముల గ్రామాల్లో 1, 575 ఎకరాలు, శంకర్‌పల్లి మండలంలోని మోకిలాలో 456 ఎకరాల్లో భూ సమీకరణ పథకం ద్వారా లే అవుట్‌ చేసేందుకు సంబంధిత భూ యాజమానులతో హెచ్‌ఎండీఏ అధికారులు చర్చలు జరిపారు. రైతుల ఇంటింటికీ తిరిగి ల్యాండ్‌ఫూలింగ్‌ స్కీంపై అవగాహన కల్పించారు. అయితే కొర్రెముల గ్రామ రైతులు ఔటర్‌కు సమీపంగా భూములు ఉండడం, ప్రతాప సింగారంలో భూములు మల్టీఫుల్‌ జోన్‌లో ఉండడంతో ఎక్కువ ప్రయోజనాలు ఆశిస్తూ నాన్చివేత ధోరణిని అవలంభిస్తున్నారు. 


కాగా ఈ పథకంపై ఆమలుకు అధికారులు ముమ్మర చర్యలు చేపడుతున్న సమయంలోనే మూడు ప్రాంతాల రైతులు భూ సమీకరణ పథకానికి మేం సిద్ధ్దమంటూ ముందుకొచ్చారు. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మల్కారం గ్రామంలో పది మంది రైతులు తమ పట్టా భూములు దాదాపు 170 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధమని అధికారులను ఆశ్రయించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్‌ మండలం బోగారం గ్రామంలో దాదాపు వంద ఎకరాలకుపైగా భూములు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లెమూరు గ్రామంలో సుమా రు 60 ఎకరాలకు పైగా భూములు అందించేందుకు రైతులు ముందుకొచ్చారు. ఈ మూడు ప్రాంతాల్లో సంబంధిత రైతుల నుంచి సమ్మతి పత్రాలను స్వీకరించి భూ సమీకరణ పథకం కార్యాచరణలోకి తీసుకురానున్నారు. కాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్‌ చేయనున్నారు. ఆయా వెంచర్‌లో ప్రణాళికబద్ధంగా అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. స్థానికంగా భూములకు నిర్ధిష్టమైన ధరలు,అమ్మకందారులు, కొనుగోలుదారులకు పూర్తి స్థాయి లో భరోసా, స్థిరాస్తుల పెట్టుబడులు శాశ్వత ప్రాతిపదికన భద్రత దక్కనున్నది.


‘భూ’ సమీకరణ పథకం ప్రయోజనాలు 

 • ఈ పథకంలో రైతుల భూములకు హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన భూములుగా బ్రాండ్‌ వ్యాల్యూ లభిస్తుంది. ఇతర భూములతో పోలి స్తే అదనపు మార్కెట్‌ విలువ లభిస్తుంది. 
 • మంచినీరు, విద్యుత్‌, పార్కులు, సివరేజీ లాంటి ప్రపంచ స్థాయి సౌకర్యాలు కలిగిన హౌసింగ్‌ ప్లాట్లు రైతులు పొందుతారు. వారి అవసరాల మేరకు తమ ప్లాట్లను అభివృద్ధి లేదా అమ్ముకునే వీలు ఉం టుంది.
 • హెచ్‌ఎండీఏ నుంచి అభివృద్ధి చెందిన భూములు రైతులు పొందుతారు. వీటి విలువ పెరగడంతో పాటు అమ్ముకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
 • ఈ పథకంలో రైతులు ప్రపోషినేట్‌ అండ్‌ ఈక్విటబుల్‌ ల్యాండ్‌ పొందుతారు.
 • నగరం ప్రణాళికంగా అభివృద్ధికి, విస్తరించడానికి ఈ పథకం దోహదపడడంతో పాటు మరిన్ని అభివృద్ధి చేసిన భూములు అందుబాటులోకి వస్తాయి.
 • బిల్డింగ్‌ పర్మిషన్‌కు అనుమతులు త్వరితగతిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా లభిస్తాయి.
 • ఈ పథకం రైతులు, భూ యజమానులు, హెచ్‌ఎండీఏ మధ్య పారదర్శకంగా అమలవుతుంది. ఎలాంటి మధ్యవ్యక్తులు ఉండరు.
 • ల్యాండ్‌ ఫూలింగ్‌ స్కీంలో పార్కులు, ఆట స్థలాలు, కమ్యూనిటీ హాల్స్‌ లాంటి సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం భూమిని కేటాయించడం జరుగుతుంది.
 • ల్యాండ్‌ ఫూలింగ్‌ స్క్రీంలో ప్రాజెక్టు కాస్ట్‌ మేరకు డెవలప్‌మెంట్‌ ఏరియాను హెచ్‌ఎండీఏ, భూ యాజమానుల మధ్య డీఆర్‌పీ పద్ధతిలో కేటాయిస్తారు.
 • ల్యాండ్‌ ఫూలింగ్‌ స్కీంలో అభివృద్ధి చేసే అదనపు సౌకర్యాలు కల్పించిన ప్లాట్లను రైతులు/ భూ యజమానులకు కేటాయిస్తారు.
 •  భూ యజమానులు/రైతులు సమూహంగా ఉంటేనే ఈ విధమైన అభివృద్ధికి అస్కారం ఉంటుంది. 


logo