బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad - Feb 11, 2020 , 01:05:38

చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో.. మరో ఐదు ప్లాట్‌ఫారంల ఏర్పాటు

చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో.. మరో ఐదు ప్లాట్‌ఫారంల ఏర్పాటు

చర్లపల్లి, ఫిబ్రవరి 10 : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ అభివృద్ధి పనులను సంబంధిత ఉన్నతాధికారులు సోమవారం పరిశీలించారు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న రైల్వే డీఆర్‌ఎం ఆనంద్‌ భాటియా, ఎండీఆర్‌ఎం సుబ్రహ్మణ్యం, కమర్షియల్‌ మేనేజర్‌ నరేందర్‌ కుమార్‌లు చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో సుమారు రూ.5 కోట్ల నిధులతో చేపడుతున్న పనులను పరిశీలించి, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్లపల్లి రైల్వే స్టేసన్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, రైల్వే నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామన్నారు. చర్లపల్లి స్టేషన్‌లో ఇప్పటికే నాలుగు ప్లాట్‌ఫారంల పనులను చేపట్టి పూర్తి చేశామని, మరో ఐదు ప్లాట్‌ఫారంలను నిర్మించేందుకు నిధులు కేటాయించనున్నట్లు వారు పేర్కొన్నారు. 


అదేవిధంగా టెర్మినల్‌లో ప్రయాణికుల కోసం మంచినీరు, మూత్రశాలలు, తదితర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. టెర్మినల్‌లో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని, రిజర్వేషన్‌ కౌంటర్‌ వద్ద ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా చర్లపల్లి మీదుగా ఘట్‌కేసర్‌, సికింద్రాబాద్‌ వరకు ఎంఎంటీఎస్‌ పనులు పూర్తయిన సందర్భంగా అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు అధికారులను కోరారు. అనంతరం స్టేషన్‌లో నెలకొన్న సమస్యలను సిబ్బంది, ప్రయాణికులను వారు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ డీఎస్‌ఈ గాంధీ, స్టేషన్‌ మాస్టర్‌ దిలీప్‌ కుమార్‌ శర్మ, ఇన్‌స్పెక్టర్‌ బెన్నయ్య, ఏఎస్‌ఐ హర్జీ, సిబ్బంది శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. logo
>>>>>>