హైదరాబాద్ : రాపన్జెల్ సిండ్రోమ్ అని పిలువబడే చాలా అరుదైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలిక ప్రాణాలను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) లోని సర్జన్లు కాపాడారు. రాపన్జెల్ సిండ్రోమ్ కలిగిన వారి జీవితం సాధారణంగా విషాదంగానే ముగుస్తుంది. కానీ ఈ విషయంలో వైద్యుల తీవ్ర శ్రమ ఫలించి బాలిక బ్రతికి బట్టకట్టింది.
శంషాబాద్, గగన్పహాడ్కు చెందిన పూజిత మందాల అనే బాలికకు జుట్టును నమలడం, మింగడం అలవాటు. ఈ కారణంగా జుట్టంతా చేరి బాలిక కడుపులో బంతి ఆకారంలో చుట్టుకుంది. బాలిక ఇటీవలే కొవిడ్-19 నుండి కోలుకుంది. గత మూడు నెలలుగా పొత్తికడుపులో నొప్పి కారణంగా చూపించుకునేందుకు ఉస్మానియా దవాఖానకు వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. బాలికకు గత ఆరు నెలలుగా జుట్టును నమిలి, మింగే అలవాటు ఉందన్నారు.
జూన్ 2న శస్త్ర చికిత్స చేసి 150 సెంటీమీటర్ల పొడవైన 2 కేజీల బరువున్న జుట్టు బంతిని తొలగించారు. తమ రికార్డుల్లో అప్పటివరకు ఇలాంటి కేసులు 68 నమోదు అయ్యాయని కాగా ఇది చాలా అరుదైన కేసు అని వైద్యులు తెలిపారు. రాపన్జెల్ సిండ్రోమ్ లక్షణం కడుపు ఉబ్బరం, బరువు తగ్గడం, వాంతులు, కడుపునొప్పి, నెత్తిమీద జుట్టు రాలడం వంటివని శస్త్రచికిత్సకు నాయకత్వం వహించిన ఓజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ తెలిపారు.