జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 1122 మంది అభ్యర్థులు పోటీ

- ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ షురూ
- పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సామగ్రి, సిబ్బంది
- కొవిడ్ నిబంధనల ప్రకారం పోలింగ్ నిర్వహణ
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకున్నది. మనల్ని పాలించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునే సమయం రానే వచ్చింది. ఈ రోజు (మంగళవారం) పోలింగ్ డే. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. వృద్ధులు, దివ్యాంగులతోపాటు కరోనా పాజిటివ్ రోగుల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో ఉదయం ఐదున్నర గంటలకు ఎన్నికల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలని ఎన్నికల అథారిటీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశించారు. ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభించి సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ పూర్తి చేయాలన్నారు. కొవిడ్-19 పాజిటివ్ ఉండి పోస్టల్ బ్యాలెట్ పొందలేని వారికి ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఆరు గంటల్లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ఎంపిక చేసిన 21 ఇతర గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా ఓటింగ్‌కు అవకాశం ఉంటుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయి. కొవిడ్ నిబంధనల మేరకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను శానిటైజ్ చేశారు.
మొత్తం 9101 పోలింగ్ కేంద్రాలుండగా, అందులో 1752 హైపర్ సెన్సిటివ్, 2934 సెన్సిటివ్, 4415 నార్మల్ పోలింగ్ కేంద్రాలున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 2909 పోలింగ్ లొకేషన్లున్నాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు 52,500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ పరిశీలనకు 1729 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 150 పోలింగ్ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నేషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. 660 మంది సెక్టోరియల్ అధికారులను నియమించారు.