e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home హైదరాబాద్‌ మండలిలో వాణి వినిపిద్దాం

మండలిలో వాణి వినిపిద్దాం

మండలిలో వాణి వినిపిద్దాం

సురభి వాణీదేవి గెలుపు సునాయసమే
పీవీ కుటుంబ ఖ్యాతిని మరింత పెంచుదాం
గ్రాడ్యుయేట్లకు పిలుపు
ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ఘట్టం
నేడు గ్రేటర్‌ నేతలతో మంత్రి కేటీఆర్‌ భేటీ

సిటీబ్యూరో,  ఫిబ్రవరి 23, (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల్లో విద్యావేత్త సురభి వాణీదేవిని గెలిపించడమే ధ్యేయంగా బ్రాహ్మణ సంఘాలు కృషి చేయాలని పలువురు ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఇందుకుగాను ఐక్యంగా కృషి చేయాలని వారు కోరారు. స్థానికులే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి ఇక్కడ నివాసముంటున్న బ్రాహ్మణ ప్రతినిధులు సైతం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. 

పీవీ.. మన టీవీ.. విద్యాభివృద్ధికి బాటలు వేసి.. మాతృభాషలోనే చదివే అవకాశాన్ని కల్పించిన మహోన్నత వ్యక్తికి గౌరవమిస్తూ.. ఆయన కూతురు వాణీదేవికి పట్టభద్రుల టికెట్‌ కేటాయించిన సీఎం కేసీఆర్‌పై సకల జనులు, విద్యావంతులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సురభి వాణీదేవికి స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నారు. విద్యారంగ సమస్యలపై లోతైన అవగాహన ఉన్న వాణీని గెలిస్తే తప్పకుండా విద్యారంగ సమస్యలపై తన గొంతును చట్టసభల్లో బలంగానే వినిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బ్రాహ్మణసేవా సంఘం మద్దతు ప్రకటించగా.. విద్యా సంఘాలు, విద్యావంతులు పీవీని స్మరిస్తూ.. ఆయన సేవలకు గుర్తుగా, టీఆర్‌ఎస్‌ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పట్టం కడుతామని ముక్తకంఠంతో తేల్చిచెబుతున్నారు. పీవీపై గౌరవంతో అన్ని పార్టీలు స్వచ్ఛందంగా తప్పుకొని వాణీదేవికి ఏకగ్రీవంగా పట్టం కట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

వాణీదేవిని గెలిపించుకుందాం: బ్రాహ్మణ పరిషత్‌ డైరెక్టర్‌ సుమలత శర్మ 

మల్కాజిగిరి, ఫిబ్రవరి 23 : గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణీదేవిని ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌కు బ్రాహ్మణ పరిషత్‌ డైరెక్టర్‌ సంకేపల్లి సుమలత శర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు బ్రాహ్మణ పరిషత్‌ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మల్కాజిగిరిలో సురభి వాణీదేవికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పట్టభద్రులను కలుస్తూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రైవేటు డిగ్రీ కళాశాలల లెక్చరర్‌ అసోసియేషన్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్‌ అయితరాజు సంధ్యారాణి, వైశ్య నాయకురాలు గీతాగుప్తాలను కలిసి వాణీదేవికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం పరిషత్‌ అధ్యక్షుడు సుధాకర్‌శర్మ, వెంకటరమణారావు, సింగం వెంకటేశ్వర్లు, బీవీ వెంకటేశ్వర్‌ గుప్తా, సురేశ్‌ శర్మ, మాధవి, శివానీ తదితరులు పాల్గొన్నారు.  

అభివృద్ధికే పట్టం కడుతాం.

అభివృద్ధికే పట్టభద్రులు పట్టం కట్టనున్నారు. దేశానికి సేవలందించిన భారత మాజీ ప్రధాని పీవీ కుటుంబానికే అవకాశం కల్పిస్తారు. దేశానికి సేవలందించిన పీవీ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుంచుకొని వారి కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. వాణీదేవిని గెలిపించి పీవీకి నిజమైన నివాళి అందించాలి. కరోళ్ల రాజేశ్‌(ఎంబీఏ), మహేశ్వరం గ్రామం 

పీవీని గౌరవిస్తున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ నరసింహారావు కూతురు వాణీదేవిని ప్రకటించడం హర్షణీయం. పీవీని గౌరవిస్తున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌. సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమ కోసం నిరంతరం పాటుపడుతున్నారు. విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి ఓటు వేస్తా.- సప్పిడి కిరణ్‌కుమార్‌, బీఎస్సీ, మామిడిపల్లి, పహాడీషరీఫ్‌  

అభివృద్ధికే ఓటేస్తా

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుంది. మైనార్టీ విద్యార్థులకు పీజీ వరకు ఉచితంగా కార్పొరేట్‌ విద్యను అందిస్తున్నారు. పేద మైనార్టీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తా.- మహ్మద్‌ నసీర్‌, ఎంబీఏ, వాది ఏ ముస్తఫా, పహాడీషరీఫ్‌  

వాణీదేవి వెంటే పట్టభద్రులు

సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశానికి సేవలందించిన మాజీ ప్రధాని పీవీ కుటుంబానికి పట్టభద్రుల సీటు ఇవ్వడం సంతోషంగా ఉంది. ఉన్నత విద్యనభ్యసించి, ప్రత్యేకంగా ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న వాణీదేవి వెంట గ్రాడ్యుయేట్స్‌ అందరూ ఉన్నారు. – డి. నవీన్‌కుమార్‌, రెజిమెంటల్‌ బజార్‌, మారేడ్‌పల్లి  

పీవీ సేవలకు గుర్తింపుగా వాణీదేవిని గెలిపించాలి

భద్రాచలం, ఫిబ్రవరి 23 : త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థినిగా మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం పట్ల తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పట్టణ గౌతమి బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షుడు రామావఝుల రవికుమార్‌శర్మ మంగళవారం హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపర చాణక్యుడు పీవీ తన మేధా సంపత్తితో భారతదేశాన్ని అగ్రరాజ్యాలకు తీసిపోని విధంగా అభివృద్ధి పర్చారన్నారు. పీవీ మనదేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా వాణీదేవిని ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా గెలిపించడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకురావాలని పిలుపునిచ్చారు.

పీవీ కుటుంబానికి దక్కిన గౌరవమిది

మన దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు కుటుంబానికి దక్కిన అరుదైన గౌరవమిది. వాణీదేవిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించి సీఎం కేసీఆర్‌ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ నిర్ణయాన్ని బ్రాహ్మణ సమాజం హర్షిస్తున్నది. దీంతోపాటు అతి తక్కువ రాష్ర్టాల్లో అమలు చేసిన ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్‌ విధానాన్ని తెలంగాణలో కూడా 10శాతం వరకు ఇస్తూ జీఓ విడుదల చేసిన సీఎంకు కృతజ్ఞతలు. – అవసరాల ప్రసాద్‌శర్మ సిద్ధాంతి, చండీ పరమేశ్వరి పీఠం

వాణీదేవిని గెలిపించుకుందాం

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని బ్రాహ్మణ సమాజమంతా ఐక్యమై గెలిపించుకుంటాం. కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయం హర్షించదగింది. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు బ్రాహ్మణ సేవాసమితి తరఫున కృతజ్ఞతలు.- పోచంపల్లి రమణారావు, తెలంగాణ బ్రాహ్మణ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు, 

వాణీదేవి ఎంపిక..  గొప్ప విషయం

దేశానికి ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు చేసిన సేవలు మరువలేనివి. ఆయన ప్రధానమంత్రి కావడం తెలుగుజాతికే గర్వకారణం. అలాంటి మహోన్నత వ్యక్తి కుమార్తె వాణీదేవిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దింపడం హర్షించదగిన విషయం. ఓటర్లు కూడా ఆమెను గౌరవించి ఎన్నుకోవడం అవసరం. – గాజుల సంగీత, ఉపాధ్యాయురాలు సీతాఫల్‌మండి 

అంకితభావంతో పనిచేస్తారు..

ప్రధానమంత్రిగా దేశానికి ఆదర్శవంతమైన పాలన అందించిన మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు కూతురును టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలుపడం సంతోషించదగిన విషయం. ఇలాంటి వ్యక్తులు దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటారన్న నమ్మకం కలుగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాణీదేవికి అవకాశం కల్పించడం హర్షణీయం. -దేశబోయిన రఘు, అడ్వకేట్‌, వారాసిగూడ 

సీఎం ఆలోచనా.. విధానం గొప్పది..

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిపిన సీఎం కేసీఆర్‌ ఆలోచనా విధానం ఎంత గొప్పదో మరోసారి నిరూపితమైంది. పీవీని కాంగ్రెస్‌ పార్టీ గుర్తించలేదు. కాని పీవీ కుమార్తె వాణీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ వెనువెంటనే ఆమెకు టికెట్‌ కేటాయించడం హర్షణీయం. వాణీదేవి గెలుపునకు కృషిచేయాలని స్వయంగా ఎమ్మెల్యేలను పిలిచి కోరడం సీఎం కేసీఆర్‌కే చెల్లింది. ఈ విషయం కాంగ్రెస్‌ పార్టీ నేతలను సైతం విస్మయానికి గురిచేసింది. నా మొదటి ప్రాధాన్యత ఓటును వాణీదేవికే వేసి గెలిపిస్తా. -ఎన్‌.నీరజ్‌, తిరుమలగిరి, బొల్లారం 

పీవీకి తగిన గౌరవం

పీవీకి తెలంగాణ ప్రభుత్వం ఎంతో గౌరవమిస్తుంది. పీవీ తెలంగాణ వ్యక్తి కావడం గర్వకారణం. అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధాని కావడం అభినందనీయం. అందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ ఆయన స్థాయిని తగ్గించకుండా కుమార్తె సురభి వాణీదేవిని పెద్దల సభకు పంపడం హర్షించదగిన విషయం. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -మెంటె ఉపేందర్‌,బొల్లారం 

అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం

గ్రాడ్యుయేట్స్‌ అందరూ వాణీదేవికి పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నారు. ప్రతి ఒక్క విద్యావంతుడు కలిసికట్టుగా పనిచేసి వాణీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు తగిన ప్రాధనత్యను ఇచ్చారు. – సరిత, రెజిమెంటల్‌బజార్‌, మారేడ్‌పల్లి 

ఏకగ్రీవం చేసి గౌరవాన్ని చాటాలి 

పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన కుమార్తె సురభి వాణీదేవిని ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఆమెకు యువకులు, విద్యావంతులు అండగా ఉండి విజయానికి కృషి చేయాలి. ఏకగ్రీవం చేసి పీవీ మీద ఉన్న గౌరవాన్ని చాటాలి. సీఎం కేసీఆర్‌ మరోసారి పీవీని ప్రపంచానికి గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు హర్షించదగిన విషయం. వాణీదేవి చట్ట సభల్లో రాణిస్తారు.- రేణిగుంట్ల శ్రీకాంత్‌ గుప్తా. విద్యార్థి, ఆర్యవైశ్య సంఘం నాయకుడు, కందుకూరు. 

వాణీదేవి విజయం.. పీవీకి నివాళి

పీవీ నరసింహారావు కూతురు వాణీదేవిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని యువత స్వాగతిస్తున్నది. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమెను భారీ మెజార్టీతో గెలుపించుకోవడమే మనం పీవీకి ఇచ్చే నివాళి. కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించిన పీవీ కుటుంబాన్ని సీఎం కేసీఆర్‌ గుర్తించడం అభినందించదగిన విషయం. పీవీ మీద ఉన్న గౌరవంతో ప్రతిపక్షాలు సహకరించి వాణీదేవిని ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుంది. – శ్రీపాద నరేంద్ర, బేగంపేట 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మండలిలో వాణి వినిపిద్దాం

ట్రెండింగ్‌

Advertisement