e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home హైదరాబాద్‌ పైసా తీసుకోకుండానే.. ఖరీదైన పరీక్షలు..

పైసా తీసుకోకుండానే.. ఖరీదైన పరీక్షలు..

పైసా తీసుకోకుండానే.. ఖరీదైన పరీక్షలు..
 • వరప్రదాయినిగా తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌
 • మూడేండ్లలో 27.98 లక్షల టెస్టులు
 • ఏడాదికి రూ.15కోట్ల నుంచి రూ.20 కోట్లు ప్రజాధనం ఆదా
 • 327 కేంద్రాల నుంచి నమూనాల సేకరణ
 • రోజుకు 25వేల రోగ నిర్ధ్దారణ పరీక్షలు
 • ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన రిపోర్టులు
 • ప్రస్తుతం 57 రకాల పరీక్షలు..
 • త్వరలోనే మరిన్ని అందుబాటులోకి..

వ్యాధి నిర్ధారణకు పరీక్షలు తప్పనిసరి. అయితే ప్రైవేటులో ఏ చిన్న టెస్టు చేయించాలన్నా.. సామాన్యులకు తలకు మించిన భారమే. వేలకు వేలు ధారపోయాల్సిందే. ఈ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రాథమిక స్థాయిలోనే వ్యాధులను గుర్తించి.. మెరుగైన వైద్యం అందించేందుకు నగరంలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ , వెల్‌నెస్‌ సెంటర్లు, జిల్లా ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడ తీసుకున్న నమూనాలు పరీక్షించి..రిపోర్టులు ఇచ్చేందుకు నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌(ఐపీఎం) ఆవరణలో 2018లో ‘తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ (తెలంగాణ నిర్ధారణ పరీక్షల పథకం)ను నెలకొల్పింది. ఈ మూడేండ్లలో ఇక్కడ 27.98 లక్షల టెస్టులు చేశారు. దీనిద్వారా ఏడాదికి రూ. 15కోట్ల నుంచి రూ. 20 కోట్ల ప్రజాధనం ఆదా అయింది.

టెస్టులు ఎలా చేస్తున్నారంటే..

 • ప్రతి రోజు యూపీహెచ్‌సీ కేంద్రాల్లో రోగుల నుంచి సేకరించిన నమూనాలను మధ్యాహ్నం ఒంటి గంటలోపు సమీపంలోని క్లస్టర్‌ ఆరోగ్య కేంద్రాలకు చేరవేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు నారాయణగూడ తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు పంపిస్తారు.
 • రోగి నుంచి నమూనాలు సేకరించే సమయంలో వారికి ఈ-మెయిల్‌ ఐడీ ఉంటే తీసుకుంటారు.
 • అధునాతన పరికరాల్లో రక్తనమూనాల సమాచారాన్నిపొందుపరుస్తారు. ఆన్‌లైన్‌లో రోగికి, యూపీహెచ్‌సీకి టెస్టుల ఫలితాలు ఇస్తారు.
 • ఎక్కువ ఫలితాలు అదే రోజు సాయంత్రానికి వెల్లడిస్తారు. కొన్ని మాత్రం మరుసటి రోజు ఉదయం అందిస్తారు.
 • టెస్టుల రిపోర్టులను పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తారు. అక్కడి సిబ్బంది వాటిని డౌన్‌లోడ్‌ చేసి.. రోగులకు ఇవ్వాల్సి ఉంటుంది.
 • రోగి ఫోన్‌ నంబర్‌కు కూడా వైద్య పరీక్షల ఫలితాలను పంపిస్తున్నారు.
 • షిఫ్టుల వారీగా 24 గంటలు ఇక్కడ రోగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.
 • ఆ ఫలితాలను చెక్‌ చేసి సరిదిద్దేందుకు ఇద్దరు డాక్టర్లు ప్రత్యేకంగా పని చేస్తున్నారు. వారే రిపోర్టులను చూసి పంపిస్తుంటారు.
 • ఎమర్జెన్సీ ఉంటే అప్పటికప్పుడే పరీక్ష చేసి రిపోర్టు ఇస్తారు.
 • ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన ఫలితాలు వస్తాయి.
 • ఇక్కడ చేసిన రిపోర్టులు సక్రమంగా వస్తున్నాయా? సరిగా చేస్తున్నామా? అని పరిశీలించుకునేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు ప్రతి మూడు నెలలకోసారి పంపిస్తారు. ఇప్పటివరకు పంపించిన రిపోర్టులన్నీ సక్రమమేనని వాళ్లు తేల్చి చెప్పారు.

ఏయే పరీక్షలంటే..

57 రకాల రక్త పరీక్షలు చేస్తున్నారు. సాధారణ రక్త, మల, మూత్ర పరీక్షలతో పాటు టైఫాయిడ్‌, డెంగీ, మలేరియా జ్వరాల నిర్ధారణకు, కాలేయం, మూత్రపిండాలు, థైరాయిడ్‌ పనితీరును తెలుసుకోవడానికి, రక్తంలో కొలెస్ట్రాల్‌, మూణ్నెళ్ల సగటు చక్కెర స్థాయి.. తదితర పరీక్షలు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎనిమిది పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌, ఈసీజీ పరికరాలను ఏర్పాటు చేశారు.రోజుకు వంద మందికి ఈసీజీ చేస్తున్నారు. 8 నుంచి 10 మంది వరకు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించి గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లలో చికిత్స చేయిస్తున్నారు. త్వరలోనే సీటీ స్కాన్‌ , ఏంఆర్‌ఐ పరికరాన్ని అందుబాటులోకి తేనున్నారు.

అత్యాధునిక ప్రయోగశాల..

ఐపీఎం ఆవరణలో రూ.4 కోట్లతో ఏర్పాటైన తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ పరిధిలోకి గ్రేటర్‌లోని యూపీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రులన్నీ వస్తాయి. రోజుకు కనీసం 25వేల నమూనాలను పరీక్షించేందుకు వీలుగా ప్రయోగశాల ఉంది. మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ వైద్య నిపుణులు ఉన్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నియమితులైన ల్యాబ్‌ టెక్నీషియన్లలో కొందరి సేవలను వినియోగించుకుంటున్నారు. తొలుత 50 యూపీహెచ్‌సీల్లో రక్త నమూనాల సేకరణ, ప్రయోగశాలలో పరీక్షలు, ఆన్‌లైన్‌లో ఫలితాల వెల్లడి వంటివి చేసేవారు. ప్రస్తుతం ఈ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో 327 కేంద్రాల నుంచి రోజుకు 5వేల నుంచి 7వేల వరకు నమూనాలను సేకరించి, పరీక్షించి, ఆన్‌లైన్‌ ద్వారా రిపోర్టులు ఇస్తున్నారు. కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలతో 57 రకాల రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు, అల్ట్రాసౌండ్‌, ఈసీజీ వంటి ఖరీదైనవి కూడా ఉచితంగా చేస్తున్నారు.

త్వరలో 130 వైద్య పరీక్షలు..

రోజుకు 327 కేంద్రాలకు 5వేల నుంచి 7వేల నమూనాలు వస్తున్నాయి. రౌండ్‌ ది క్లాక్‌ 25వేల పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో రిపోర్టులు పంపిస్తున్నాం. ప్రస్తుతం 57 రకాల పరీక్షలు చేస్తున్నాం. త్వరలోనే 130 రకాల టెస్టులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన ఈ పథకం పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పైసా తీసుకోకుండానే.. ఖరీదైన పరీక్షలు..

ట్రెండింగ్‌

Advertisement