హుస్సేన్‌సాగర్ చుట్టూ సుందరీకరణ పనులు

Sat,August 18, 2018 07:46 AM

work around hussain sagar lake hyderabad

హైదరాబాద్ : హుస్సేన్‌సాగర్ పరిసరాలు కొత్త సొబగులద్దుకుంటున్నది. ఇక్కడి లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్‌లు పర్యాటకుల తాకిడితో నిత్యం సందడిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు రూ. 35 కోట్ల అంచనా వ్యయంతో హుస్సేన్‌సాగర్ చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసిన హెచ్‌ఎండీఏ.. విడుతల వారీగా సుందరీకరణ పనులకు శ్రీకారం చూడుతున్నది. నెక్లెస్‌రోడ్‌లోని పీవీ ఘాట్ వద్ద ఉన్న మూడున్నర ఎకరాల స్థలంలో గ్రీనరీ పనులు చేపట్టింది. రూ. 41 లక్షలతో ఫ్లవర్‌బెడ్స్, పాత్‌వేలు, హెడ్జ్ ప్లాంట్స్, ల్యాండ్ స్కేప్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను చేపట్టారు.

హుస్సేన్‌సాగర్ తీరంలో పర్యటించే వారి కోసం ఈ కొత్త అందాలను పరిచయం చేశారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కుటుంబ సభ్యులతో కలిసి ఈ పార్కు సేదతీరుతూ సాగర్ అందాలు, అతి భారీ జెండాను ఆస్వాదించే వీలుంది. ముఖ్యంగా పాటిగడ్డ, ప్రకాశ్‌నగర్ సమీప ప్రాంతాల వాసుల కోసం వాకింగ్ ట్రాక్ నిర్మించారు. ఇక చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఐదు రకాల ఆర్టిఫిషియల్ జంతువుల రూపంలో గ్రీనరీని రూపొందించారు. ఇది ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఎనుగు, గొర్రె, జింక, పులి, పక్షి నెమలి ఆకారంలో ఉన్న బొమ్మలు చిన్నారులను ఆకర్షించనున్నాయి. ఈ ఉద్యానవనంలో పెద్దమొత్తంలో మొక్కలను నాటినట్లు హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అసిస్టెంట్ డైరెక్టర్ పి. యాదగిరి తెలిపారు. త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

1309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles