కష్టపడి కట్టుకున్న ఇంట్లోకి రానివ్వడం లేదు

Fri,November 15, 2019 10:30 PM

ఖైరతాబాద్: కష్టపడి రేకుల ఇళ్లు కట్టుకుంటే కొందరు కబ్జాదారులు బలవంతంగా ఆక్రమించుకునేందుకు కుట్ర చేస్తున్నారని బాధితురాలు కె. నిర్మల వాపోయారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన గోడును మీడియా ముందు వెల్లబోసుకున్నారు. కాప్రా సైనిక్‌పూరిలోని భాస్కర్‌రావు నగర్ కాలనీలో ఓ జడ్జి ఇంట్లో తన తల్లి మేకల మరియమ్మ 30 సంవత్సరాలకు పైగా పనిచేసిందని, ఆమెతో పాటు పనిచేసిన వారికి ఆ జడ్జి కుమారుడు కొరియన్ విశ్వాసంతో పనిచేసినందుకు అందరికి తన సర్వే నెంబరు 597/ఎ స్థలంలో 2009 సంవత్సరంలో కొంత భాగాలను గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చారన్నారు. అందులో తన తల్లి మరియమ్మకు కూడా 64 గజాల స్థలం ఇచ్చారన్నారు. దీంతో తమ వద్ద ఉన్న కొంత డబ్బుతో ఆ స్థలంలో రేకుల షెడ్డు నిర్మించుకొని తల్లితో కలిసి జీవిస్తున్నానన్నారు. అదే క్రమంలో తమ ఇంటి వెనుక ఉన్న స్థల యజమానులు ప్రశాంత్, మల్లికార్జున్‌లు తమ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు కుట్ర చేశారన్నారు.


ఆ స్థలాన్ని తమకు అమ్మాలని బలవంత పెట్టారన్నారు. తమ ఇంటికి సంబంధించి ఆస్థి పన్ను, విద్యుత్తు, నీటి బిల్లులను సకాలంలో చెల్లిస్తూ వస్తున్నామన్నారు. కొద్ది రోజుల క్రితం నల్లా కనెక్షన్‌ను తొలగించారని, వేసిన బోరులో కంకర రాళ్లు వేసి మూసివేశారన్నారు. దీంతో వారి వేదింపులు భరించలేక సమీపంలో అద్దె ఇంట్లో ఉండాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఉంటున్న అద్దె ఇంటి యజమాని సైతం తమను వేదిస్తోందన్నారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, తమకు అనుకూలంగా తీర్పు వచ్చినా తమను వేదించడం ఆపడం లేదన్నారు. కుషాయిగూడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. తనపై అక్రమ కేసులు కూడా పెడుతున్నారని వాపోయారు. ప్రస్తుతం ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుదామనుకుంటే స్థానిక పోలీసులు వచ్చి అడ్డుకుంటున్నారన్నారు. రెండు సంవత్సరాలుగా వృద్ధాప్యంలో ఉన్న తల్లితో ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు.

1192
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles