ఉగాది పచ్చడిలాగే జీవితంలోనూ షడ్రుచులు ఉంటాయి: వెంకయ్య

Sat,March 17, 2018 07:56 PM

vice president venkaiah naidu participates in ugadi celebrations in rajbhavan

హైదరాబాద్: ఉగాది పచ్చడిలాగే మన జీవితంలోనూ షడ్రుచులు ఉంటాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. షడ్రుచులను ఆస్వాదించినట్లే జీవితంలో జరగబోయే పరిణామాలను ఎదుర్కోవాలని తెలిపారు. రాజ్‌భవన్‌లో జరిగిన శ్రీవిళంబినామ సంవత్సర ఉగాది వేడుకలకు హాజరైన వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా తెలుగు రాష్ర్టాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మన జీవితం, పండుగలు అంతా ప్రకృతితో ముడిపడి ఉన్నాయన్నారు. ప్రకృతితో మమేకమై జీవించడం భారతీయ సంస్కృతిలో భాగమన్నారు.

ప్రస్తుతం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తూ ప్రమాదం కొనితెచ్చుకుంటున్నామని వెంకయ్య తెలిపారు. సంప్రదాయాన్ని, భాషను పరిరక్షించుకోవడం మన బాధ్యతన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు భాష పరిరక్షణకు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. భారతీయ సంస్కృతి శక్తివంతమైనదన్న వెంకయ్య.. భారతీయ సంస్కృతిని ప్రపంచం మొత్తం గుర్తించిందన్నారు. ప్రస్తుత తరానికి తెలుగు నెలలు, సంవత్సరాల పేర్లు, నక్షత్రాల పేర్లు తెలియడం లేదని పేర్కొన్నారు. మనం జరుపుకునే ప్రతి పండుగ వెనక శాస్త్రీయమైన సందేశం ఉందన్నారు. ఉగాది పండుగ నవ్యత, వినూత్నతకు చిహ్నమన్నారు.

శ్రీవిళంబినామ సంవత్సరంలో అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నా... ఈ సంవత్సరం సుఖసంతోషాలు, శాంతిని కలిగిస్తుంది...గవర్నర్ నరసింహన్

2149
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS