మోదీ హత్యకు కుట్ర.. వరవరరావు అరెస్ట్

Tue,August 28, 2018 03:00 PM

Varavara Rao arrested by Pune police in connection with Modi assassination  plot

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారన్న కేసులో పుణె పోలీసులు మంగళవారం హైదరాబాద్‌లో విరసం నేత వరవరరావును అరెస్ట్ చేశారు. సుమారు 8 గంటల పాటు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. తర్వాత వరవరరావును అరెస్ట్ చేశారు. ముందు ఆయనను ఆరోగ్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచి వరవరరావును పుణెకు తరలించనున్నట్లు తెలుస్తున్నది. ఆయనతోపాటు మరో ఇద్దరు సీనియర్ జర్నలిస్టుల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. మోదీ హత్యకు సంబంధించిన కేసులో మావోయిస్టుల లేఖలో వరవరరావు పేరు ఉన్నట్లు పుణె పోలీసులు గుర్తించారు.

అయితే కేవలం ఆ లేఖలో పేరు ఉన్నందుకే పోలీసులు వరవరరావును అరెస్ట్ చేశారని ఆయన భార్య ఆరోపించారు. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో ఢిల్లీలోని మావోయిస్టు సానుభూతిపరుడు రోనా జాకబ్ విల్సన్ ఇంట్లో పుణె పోలీసులు ఓ లేఖను గుర్తించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో అరెస్టయిన ఐదుగురిలో జాకబ్ విల్సన్ కూడా ఒకరు. ఇందులో ఎం-4 రైఫిల్‌తోపాటు, నాలుగు లక్షల రౌండ్ల బుల్లెట్ల కొనుగోలు కోసం 8 కోట్లు అవసరమని, అది వరవరరావు సమకూరుస్తారని లేఖలో రాసి ఉంది.

మ‌హారాష్ట్ర‌లో భీమా-కోరెగావ్ అల్ల‌ర్లలో మావోయిస్టుల పాత్ర ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి ప‌లువురు మావోయిస్ట్ సానుభూతి ప‌రుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ల నుంచే మోదీ హ‌త్య‌కు సంబంధించిన ఓ లేఖ బ‌య‌ట‌ప‌డింది. అరెస్ట్‌యిన వాళ్ల‌లో ఓ వ్య‌క్తికి సూర్జాగ‌డ్‌, గడ్చిరోలీల‌లో జ‌రిగిన మావోయిస్టుల దాడుల‌తో సంబంధం ఉంది. ఈ దాడులు విజ‌య‌వంతంగా నిర్వ‌హించినందుకు ఆ వ్య‌క్తిని వ‌ర‌వ‌ర‌రావు అభినందించిన‌ట్లు కూడా పుణె పోలీసులు గుర్తించారు. అయితే అప్పుడే మీడియా ముందుకు వ‌చ్చిన వ‌ర‌వ‌ర‌రావు.. అస‌లు ఆ లేఖ అబ‌ద్ధ‌మ‌ని, త‌మ‌పై అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని చెప్పారు. మ‌రోవైపు వ‌ర‌వ‌రరావు అరెస్ట్‌ను నిర‌సిస్తూ.. మాన‌వ‌హ‌క్కుల సంఘాల నేత‌లు గాంధీన‌గ‌ర్‌లోని ఆయ‌న ఇంటి ద‌గ్గ‌ర ఆందోళ‌న‌కు దిగ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

3570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS