సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేర్చాలి..రైతుల రుణం తీర్చుకోవాలి!

Wed,June 12, 2019 07:28 PM

Transco   CMD Prabhakar Rao About Power Supply

హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఈనెల 21న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందున నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి నుంచి 2 టీఎంసీల నీటిని ఎత్తి జలాశయాలకు తరలించడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా వేశాం. కొన్ని రిజర్వాయర్ల, లిఫ్టుల పనులు ఇంకా జరుగుతున్నందున ఈ ఏడాది నికరంగా 4,700 మెగావాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. అందుకు తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

వచ్చేఏడాది నుంచి మూడు టీఎంసీల నీరు ఎత్తిపోయాలని నిర్ణయించినందున మరో 2,160 మెగావాట్లు అదనంగా అవసరం అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 7,152 మెగావాట్ల విద్యుత్ అందించడానికి సిద్ధమవుతున్నాం. రూ.2,890 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. మొత్తం 15 డెడికేటెడ్ సబ్‌స్టేషన్లు నిర్మించాం. వివిధ కేటగిరీల్లో 80 పంపులు బిగించాం. గతంలో 30 మెగావాట్ల విద్యుత్ పంపులు వాడిన చరిత్ర మాత్రమే తెలంగాణలో ఉంది. సముద్రమట్టానికి 618 మీటర్లకు పైగా ఎత్తుకు నీటిని పంపింగ్ చేసి తెలంగాణ బీళ్లకు నదుల నీళ్లను మళ్లించే బృహత్ కార్యానికి విద్యుత్ సంస్థలు పూనుకున్నాయి.

తెలంగాణ రైతులకు సాగునీరు అందించే అతిపెద్ద క్రతువులో విద్యుత్ శాఖది చాలా కీలక పాత్ర. కోటికిపైగా ఎకరాలకు సాగునీరు అందించాలనే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టుల ద్వారా అనుకున్న విధంగా నీటిని ఎత్తిపోసే బాధ్యత విద్యుత్ ఉద్యోగులపై ఉంది. నిర్ణీత గడువులోగా విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసిన స్ఫూర్తితోనే లిఫ్టులను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించి సమర్థతను చాటుకోవాలి. సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేర్చాలి.. రైతుల రుణం తీర్చుకోవాలి.అని ప్రభాకర్ రావు వ్యాఖ్యానించారు.

4182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles