ఢీకొట్టి వెళ్లిపోయినా.. తప్పించుకోలేరు..!

Sun,May 19, 2019 09:22 AM

traffic accident monitoring cell knows all the details in hit and run case

- ప్రమాదాల గుట్టువిప్పుతున్న ఆర్టీఏ సెల్
- రెండు నెలల్లో 12 కేసుల ఛేదన
- హిట్ అండ్ రన్ ఘటనలపై లోతైన దర్యాప్తు
- ప్రమాద కారణాల విశ్లేషణ

హైదరాబాద్: కొన్ని కేసుల్లో రోడ్డు ప్రమాదాల ఘటనలను దర్యాప్తు చేస్తుండగా, అవి హత్యలుగా వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో రోడ్డు ప్రమాదాల ఘటనలను సమర్థవంతంగా దర్యాప్తు చేస్తూ, అన్ని కోణాల్లో విచారణ జరిపేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సరికొత్తగా మార్చి 6వ తేదీన రోడ్డు ట్రాఫిక్ యాక్సిండెంట్ మానిటరింగ్ (ఆర్టీఏ) సెల్‌ను ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సెల్ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించడంతో పాటు శాంతి భద్రతల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తులో తమ వంతు సహకారాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు, ప్రత్యక్ష సాక్షులు, రోడ్డు ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు, బాధితులు, వారి కుటుంబ సభ్యుల వద్ద నుంచి ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ వివరాలు సేకరిస్తున్నారు. ఇలా రెండు నెలల్లో 12 కేసులను ఛేదించారు. అందులో మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన విచారణలో హత్యగా తేలింది.

కారును గుర్తించారు..


ఏప్రిల్ 3వ తేదీన ఉదయం 8.45 సమయంలో మెహిదీపట్నం నుంచి అరంఘర్ వైపు బైక్‌పై వెళ్తుండగా ఒక గుర్తుతెలియని కారు డ్రైవర్ అతడిని ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయమైన ద్విచక్రవాహనదారుడు కిందపడి పోయాడు. ఈ ఘటనపై ఆర్టీఏ సెల్ సీసీ కెమెరాల ద్వారా ఆధారాలు సేకరించింది. పిల్లర్ నంబర్ 247లో ఉన్న సీసీ కెమెరాలలో ఆ కారు ఎర్ర రంగున్న మారుతీ స్విఫ్ట్ కారుగా గుర్తించారు. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ ముజీవ్ ఖాన్ మహ్మద్‌ను గుర్తించారు.

నమాజ్‌కు వెళ్తుండగా..


ఈ నెల 6వ తేదీన మహ్మద్ ఖాన్(67) ఉదయం 5.15 నిమిషాల ప్రాంతంలో నడుచుకుంటూ నమాజ్ చేసేందుకు మసీద్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఒక గుర్తుతెలియని కారు అతడిని ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై ఆర్టీఏ సెల్‌కు సమాచారం రావడంతో వెంటనే ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనా స్థలంలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన సీసీ కెమెరాలున్నాయి, అందులో లభించిన దృశ్యాల్లో నాణ్యత లేకపోవడంతో, స్థానికంగా ఉన్న కమ్యూనిటీ సీసీ కెమెరాలను విశ్లేషించారు. ఇందులో భాగంగా ఒక కెమెరాలో ప్రమాదానికి కారణమైన కారు ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆ కారు ఏ రూట్‌లో వెళ్లిందనే విషయాన్ని నిర్ధారించుకోవడంతో పాటు కారు నంబర్, ఇతర వివరాలను పరిశీలించారు. పోలీసులకు అది రోడ్డు ప్రమాదం కాదని, ఘటన వెనుక కుట్ర ఉందని గుర్తించారు. లోతుగా దర్యాప్తు చేయడంతో పక్కా ఫ్లాన్‌తో తెల్లవారుజామున కారుతో ఢీకొట్టి, దానిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన సంఘటనగా చిత్రీకరించేందుకు నిందితులు ప్లాన్ చేసినట్లు వెల్లడయ్యింది. ఈ కుట్రలో తాజముల్ బేగ్, జావెద్, అతియ ప్రవీణ్ ఉన్నట్లు గుర్తించి లా అండ్ అర్డర్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

అతివేగంతోను ప్రమాదాలు..!


ఆర్టీఏ సెల్ విశ్లేషణలో గుర్తుతెలియని వాహనాలు ఢీకొట్టడమే కాకుండా, వాహనదారులు అతివేగంగా వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. రోడ్డు బాగోలేక అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో కొన్ని ప్రమాదాలు జరిగాయి. శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మార్చి నెలలో డి.శ్రీనివాసరావు(48) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆటో వెనుక భాగంలో కూర్చున్నాడు. ఆ సమంలో ఆటో అతివేగంగా వెళ్లడంతో అందులో నుంచి కిందపడి తీవ్ర గాయమై, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విశ్లేషణలో తేలింది. అమీర్(21) స్నేహితుడితో కలిసి ఒక విందుకు హాజరై తిరిగి ఇంటికి బైక్‌పై వెళ్తున్నాడు. అతివేగంగా బైక్‌ను నడిపి దానిని అదుపు చేయలేక డివైడర్‌ను ఢీకొట్టి అక్కడక్కడే మృతి చెందాడు. ఆనంద్‌రెడ్డి(19), జావెద్(20) బైక్‌పై అతివేగంగా వెళ్తూ వాహనాన్ని అదుపు చేయలేక రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

ఆర్టీఏ సెల్ ఛేదించిన కొన్ని ఘటనలు


మార్చి 19వ తేదీ రాత్రి 9.15 గంటల సమయంలో కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో మహేశ్వరి అనే మహిళ బైక్‌పై జేఎన్‌టీయూ వైపు నుంచి మియాపూర్ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆమెను ఒక గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆర్టీఏ సెల్ ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించి అక్కడ సీసీ కెమెరాలను పరిశీలించింది. స్థానికుల నుంచి ఒక పసుపు రంగు బస్సు ఢీకొట్టిందని సమాధానం వచ్చింది. దీంతో ఆ రూట్‌లోని సీసీ కెమెరాలను గుర్తించి ఆ సమయంలో వెళ్లిన బస్సులను పరిశీలించగా, కర్ణాటకకు చెందిన బస్సు ప్రమాదానికి కారణమయ్యిందని గుర్తించారు.

ప్రమాదాల నివారణ కోసం..


హిట్ అండ్ రన్ కేసులలో ప్రమాదానికి కారణమైన వాహనాలను గుర్తించడం, రోడ్డు ప్రమాదానికి గల కారణాలను విశ్లేషంచడం కోసం ఏర్పాటు చేసిన ఆర్టీఏ సెల్‌కు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వం మహిస్తున్నాడు. నగర శివారు ప్రాంతం కావడంతో గుర్తుతెలియని వాహనాల ప్రమాదాలు జరుగుతుంటాయి. దాంతో పాటు రోడ్ల పరిస్థితి, వాహనం నడిపే వారి పరిస్థితి తదితర అంశాలను విశ్లేషణ చేస్తున్నాం. ప్రమాదాల గూర్చి స్పష్టత తీసుకురావడానికి సీసీ కెమెరాలతో పాటు స్థానికులు ఇస్తున్న సమాచారం ఎంతగానో ఉపయోగపడుతున్నది. కొన్ని రోడ్డు ప్రమాదాలు.. ప్రమాదాలు కావని హత్యలని తేలుతున్నాయి. రెండు నెలల సమయంలో క్లిష్లతరమైన 12 హిట్ అండ్ రన్ కేసులను ఛేదించడంలో ఆర్టీఏ సెల్ తమ వంతు పాత్ర పోషించింది.
- విజయ్‌కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ

1762
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles