టిఫిన్ బాక్స్ ఛాలెంజ్!

Fri,March 23, 2018 06:55 AM

Tiffin box challenge

హైదరాబాద్ : ప్లాస్టిక్ ప్రమాదాల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీటి వస్తువులు వినియోగంలోకి వచ్చినప్పటి నుంచి ఆ నష్టాల గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. అయినా ఏటా వినియోగం పెరుగుతూనే ఉంది. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్లు ఎంతో ప్రమాదం. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కవర్లను వినియోగించకుండా ఉండేందుకు రాము అనే సామాజిక కార్యకర్త ఓ వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చాడు. ఉగాది వేడుక సందర్భంలో టిఫిన్ బాక్స్ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టాడు. తాను ప్లాస్టిక్ కవర్లను వినియోగించనని, చికెన్ షాపునకు, కూరగాయలకు, పండ్లు, ఇతర అవసరాల కోసం దుకాణాలకు ఓ చేతి సంచిని తీసుకునేపోతానని ప్రమాణం చేశాడు. తాను ఆచరిస్తూ అందరినీ ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఈ ఛాలెంజ్ విసురుతున్నానని ప్రకటించాడు.
బల్దియా లెక్కల ప్రకారం..
జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం ఏడాది కాలంలో 73 కోట్ల 50 మైక్రాన్ల కంటే తక్కువ మందపాటి ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో పొంచి ఉన్న ప్రమాదం తెలిసిందే. అయినా సరే అలాగే వాడుతున్నాం. జీహెచ్‌ఎంసీ ఎంతగా అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తున్నా, వినియోగం పెరుగుతూనే ఉంది. అనేక చోట్ల అధికారులు దాడులు చేస్తున్నారు. గతేడాది 21 లక్షల రూపాయల జరిమానా విధించారు. అయినా మార్పు లేదు. వ్యాపారులే మారాలని కోరుకోవడం ప్రజల తప్పే.. అని రాము అనే యువకుడు భావించాడు. మనం ఎందుకు మారకూడదు. మనం వినియోగించడం వల్లే వ్యాపారులు వాటిని అంటగడతున్నారు. కవర్లు అవసరం లేకుండా జనపనార సంచులని షాపింగ్‌కు తీసుకుపోతే ఆ ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించొచ్చు కదా అనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఆచరిస్తున్నాడు. అంతేనా, తనలాగే ఇతరులను జ్యూట్ బ్యాగులు వాడేలా ప్రోత్సహించాలనుకున్నాడు.
నేను మారాను.. మీరు మారండి: - రాము దోసపాటి, సామాజిక కార్యకర్త
టిఫిన్ బాక్స్ ఛాలెంజ్‌ను సోషల్ మీడియా ద్వారా దీనిని ప్రచారం చేస్తున్నాను. చాలా మంది స్పందిస్తున్నారు. స్వచ్ఛందంగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మొదట కార్పొరేటర్లనే ఎంచుకున్నాను. నగరంలోని పది మంది కార్పొరేటర్లకు ఈ ఛాలెంజ్‌కు ఎంచుకున్నాను. వాళ్లకు సోషల్ మీడియా ద్వారా, మీడియా ద్వారా తెలియజేశాను. పది రోజుల్లో వాళ్లు స్పందిస్తారని ఆశిస్తున్నా. ఆ తర్వాత మరో పది మందికి ఈ ఛాలెంజ్ విసురుతాను. నా స్నేహితులు, బంధువులను కూడా భాగస్వామ్యం చేస్తాను. కార్పొరేటర్లనే ముందుగా ఎంచుకోవడానికి కారణం వాళ్లు వేలాది మంది ప్రజల్ని ప్రభావితం చేస్తారు. నేరుగా ప్రజలతో విస్త్రత సంబంధాలు కలిగి ఉంటారు. వాళ్ల ద్వారానే మార్పు సాధ్యమని భావించాను. ఒక వేళ వాళ్ల నుంచి స్పందన రాకుంటే నేనే వాళ్ల ఇంటికి పోయి ఒక జ్యూట్ బ్యాగుని, టిఫిన్ బాక్స్‌ని గిప్ట్‌గా ఇస్తాను. కర్రీ పాయింట్, టిఫిన్ సెంటర్, చికెన్ సెంటర్ ఎక్కడికి పోయినా ఈ బ్యాగుని, బాక్సుని తీసుకుపోతే వాళ్ల అవసరాలు తీరుతాయి. ప్లాస్టిక్ కవర్ల వినియోగం, వాటి నష్టాలను వివరిస్తాను. వచ్చే ఉగాది నాటికి నగరంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని సగం తగ్గించినా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.

2729
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles