భార్య మృతికి కారకుడైన భర్తకు ఐదేండ్లు జైలు, వెయ్యి జరిమానా

Tue,April 30, 2019 07:10 AM

The wife of the deceased is five years imprisonment and a thousand fine

హైదరాబాద్ : కట్టుకున్న భార్య చావుకు కారకుడైన భర్తకు కోర్టు ఐదేండ్లు జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించింది. దీంతో పాటు అదనంగా మరో మూడేండ్లు జైలు శిక్ష రూ.500 జరిమానా కట్టాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా, రాజనగరం మండలం, ఎల్లకడియం గ్రామానికి చెందిన ఏలుచూరి తాతారావు అలియాస్ శ్రీను(45)తో అదే మండలానికి చెందిన రామలక్ష్మి(40) అనే మహిళతో 19 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు.

పెళ్లి అయిన మొదట్లో కొద్దిరోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం మద్యానికి బానిసగా మారిన తాతారావు తరచూ భార్యను శారీరకంగా, మానసికంగా తీవ్రమైన వేధింపులకు గురిచేసేవాడు. దీంతో 2007లో తమ స్వస్థలంలో రామలక్ష్మి బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈకేసులో తాతారావు కొద్దిరోజులు జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుండి విడుదలైన అనంతరం తన భార్యాపిల్లలను చక్కగా చూసుకుంటానని ఆమె కుటుంబ సభ్యులను నమ్మబలికి మురారి అనే గ్రామానికి మకాం మార్చాడు.

అనంతరం 2011లో కుటుంబసభ్యులతో కలిసి నగరానికి వలస వచ్చి ప్రగతినగర్‌లోని సాయిపూజిత అపార్ట్‌మెంటులో వాచ్‌మెన్‌గా చేరి అక్కడే నివాసముండేవాడు. ఈక్రమంలో 2015లో భార్యతో గొడవపడి ఆమె తలను గోడకేసి కొట్టడంతో రామలక్ష్మి కోమాలోకి వెళ్లింది. కొద్ది రోజుల తర్వాత ఆమె కోలుకుంది. దీంతో అపార్ట్‌మెంటు వాసులు అతన్ని అక్కడి నుండి ఖాళీ చేయించడంతో సాయినగర్‌లోని శ్రీశ్రీనివాస రెసిడెన్సీలో వాచ్‌మెన్‌గా చేరాడు. రామలక్ష్మి అదే అపార్ట్‌మెంటులోని ప్లాట్లలో ఇంటి పనులు చేస్తూ పిల్లలను సాదుకునేది. అయితే తాతారావు వేధింపులు రోజురోజుకూ తీవ్రమవడంతో భరించలేని రామలక్ష్మి 2016 జులై 30న తెల్లవారుజామున అనుమానాస్పదస్థితిలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుని తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది.

మృతురాలి మేనమామ వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అప్పటి దుండిగల్ ఎస్సై పవన్(ప్రస్తుతం సీఐ) అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి చార్జిషీటు దాఖలు చేశాడు. కేసు పూర్వపరాలను పరిశీలించిన మేడ్చల్ జిల్లా అసిస్టెంట్ సెషన్స్ జడ్జీ జయప్రసాద్ సోమవారం తుది తీర్పు వెలువరించారు. ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం నింధితుడు తాతారావుకు ఐదేండ్లు జైలుశిక్ష, వెయ్యిరూపాయల జరిమానా విధించగా, ఐపీసీ సెక్షన్ 498(ఏ) ప్రకారం మరో మూడేండ్ల జైలుశిక్ష, రూ.500 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.

2117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles