ఆహ్లాదం...ఆనందం..ఆరోగ్యం..

Mon,January 21, 2019 09:11 AM

The fifth edition of All India Horticulture and Agriculture exhibition

ఖైరతాబాద్: ఆరోగ్యాన్ని అందించే ఔషధమొక్కలు...ఆనందాన్ని పంచే పుష్పజాతులు....ఆహ్లాదపరిచేలా పల్లె వాతావరణం...నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వేదికగా ఆల్ ఇండియా ఉద్యానవన, వ్యవసాయ గ్రాండ్ నర్సరీ మేళా ప్రజలను ఆకర్షిస్తున్నది. దేశ, విదేశాలకు చెందిన వేలాదిగా వివిధ పూలు, పండ్లు, ఇండోర్, బోన్‌సాయ్, హోమ్, టెర్రస్,వర్టికల్, కిచెన్ గార్డెన్స్ జాతికి చెందిన మొక్కలు మనసు దోచుకుంటున్నాయి. అందుబాటు ధరల్లో లభిస్తుండడంతో ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సుమారు 80 స్టాళ్లను ఏర్పాటు చేయగా, ప్రపంచంలోని అన్ని జాతులకు చెందిన పండ్లు, పూల మొక్కలతో పాటు డ్రాగన్, రుద్రాక్ష చెట్టు మొక్కలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. రూ.1,70,000 విలువ చేసే అరుదైన బోన్సాయ్ మొక్కలూ అందుబాటులో ఉంచారు. అలాగే వివిధ పుష్పజాతులు ఆకట్టుకుంటున్నాయి. సోమవారం ఈ ప్రదర్శన ముగియనున్నది.

అనేక ఔషధ మొక్కలు..

ఉద్యానవన ప్రదర్శనలో మామిడిలో 25 రకాల పండ్లు, ఆరు రకాల రసాలు, మరో ఐదు రకాల పచ్చడి కాయలు, ఏడాదికి రెండు సార్లు ఫలాన్నిచ్చే మామిడి మొక్కలు ఉన్నాయి. వీటితో పాటు అరుదైన ఫ్యాషన్ ఫ్రూట్, లీచి, మల్బరీ, వాటర్, వుడ్ యాపిల్, పీచ్, కివి, వాల్‌నట్, బార్బోడస్ చెర్రి, వాక్కాయ, డ్రాగన్ ఫ్రూట్, రుద్రాక్షలు ఉన్నాయి. అలాగే దానిమ్మ, మొసంబి, ఉసిరి,కాలాజామూన్, డ్రై ఫ్రూట్ రకాల్లో బాదం, కాజు, కజూర్, వక్కలు, ఔషధాల్లో కలబంద, అశ్వగంధ, లెమన్ గ్రాస్, మోదుగ, తెల్ల జిల్లేడు, రోజ్ మేరీ, ఇన్సూలిన్, పాములు, ఈగలను నివారించే తెల్లాయిసార, సిట్రోనెల్లా మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.స్టీవియా మొక్క సైతం ఇక్కడ లభిస్తున్నది. ఇది మధుమేహ వ్యాధికే కాకుండా క్యాన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు అద్భుతమైన చికిత్స అందించేదిగా గుర్తించారు. వాటి ఔషధ గుణాలను వివరిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు 2006లో వంద పేజీల నివేదికను భారత్ అందచేసింది. దీంతో దీనిపై విశేషంగా పరిశోధనలు జరిపించిన ఆ సంస్థ ఎట్టకేలకు స్టీవియా అద్భుతమైన ఔషధ మొక్కగా గుర్తింపునిచ్చింది.

ఈ మొక్కలు ఇంట్లో, పెరట్లో విరివిగా పెంచుకోవచ్చు. అలాగే క్యాన్సర్‌ను నివారించే సాబాస్నేక్ గ్రాస్, గ్రావియోలా, ఇన్సూలిన్ మొక్కల పెంచడంతో పాటు వాటి ఆకులను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. చక్కెర వంటి తీపి ఉన్న ఈ మొక్క చక్కెర వ్యాధిని అరికడుతుందంటే అతిశయోక్తి కాదేమో. ఈ అరుదైన ఔషధ మొక్కలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. ఔషధ మొక్కలతో పాటు రోగనిరోధకశక్తిని పెంచే మల్టీ విటమిన్ మొక్క అశ్వగంధ, సరస్వతి, కాడ జిముడు, నల్లేరు, థైరాయిడ్ వంటి సమస్యలను తొలగించే సదాపాకు, క్యాన్సర్‌ను జయించే సముద్ర పాల లభిస్తున్నాయి.

1317
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles