మన మహిళా తేజోమూర్తులు

Fri,December 15, 2017 02:26 PM

తెలంగాణ ముక్కోటి కళల కాణాచి. కథలు, కవితలు, పాటలు ఒక్కటేమిటీ ఎన్నెన్నో సాహితీ పరిమళాలు విరబూసిన నేల. ఇక్కడి కలానికి పదునుతో పాటు పౌరుషమూ ఎక్కువే. ఒక్కో సిరా చుక్కా తను తరుగుతూ ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదింది. కాదు మహిళా మణులు కూడా తెలంగాణ మాగాణంలో సాహితీ సేద్యం చేశారు. ఇక్కడి మట్టి పొరల్లో తమ కలంతో కవితలు, కథలు, పాటల విత్తనాలు జల్లి పుట్లకొద్దీ సాహిత్యపు రాశులను పండించి కుప్పగా పోశారు.


భండారు అచ్చమాంబ(1874 - 1905)
తొలి తెలుగు కథా రచయిత్రి. నల్లగొండ జిల్లా మునగాల పరగణా మేనేజర్ వెంకటప్పయ్య-గంగమ్మల సంతానం.1874వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామలో పుట్టింది. గురజాడ అప్పారావు కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథ ధన త్రయోదశిని హిందూ సుందరి పత్రికలో ప్రచురించారు. ప్రథమ స్త్రీవాద చరిత్ర కారణి. ఎమ్. ఏ చదివిన తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ తెలుగు, హిందీ నేర్చుకొన్నది. ఆమెకు ఇంగ్లీషు, గుజరాతీ భాషలలో కూడా ప్రవేశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నో స్త్రీల సంఘాలు ఏర్పరచింది. చిన్న వయసులో కుమారుడు, కుమార్తె మరణించడంతో అనాథ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది. 1905 జనవరి 18వ తేదీన ముప్పై ఏళ్ళకే మరణించింది. వివిధ భాషలలో స్త్రీ సాహిత్యం రాసిన రచయిత్రుల గురించి భండారు అచ్చమాంబ రచనల ద్వారా మనకు తెలుస్తుంది.

వీరితో పాటు నేటితరం మహిళలు సాహితీ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. కథలు, కవితలు, నవలలు రాస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. వారిలో కొందరు..

బొమ్మా హేమాదేవి, ఆనందమాంబ, గోగు శ్యామల, అనిశెట్టి రజిత, జూపాక సుభద్ర, బద్దం అనసూయ, కాత్యాయిని విద్మహే, స్వాతిశ్రీపాద, తిరునగరి దేవకీదేవి, గోడి భాగ్యలక్ష్మి, రత్నమాల, విమలక్క, అమృతలత, గీతాంజలి, సూర్యధనుంజయ, కొలిపాక శోభారాణి, తుర్లపాటి లక్ష్మి, కొల్లపూర్ విమల, త్రివేణి, మెర్సిమార్గరేట్, అడువాల సుజాత, షాజహాన, జాజులగౌరి, షాహనాజ్ ఫాతిమా, నామని సుజనాదేవి, నల్లూరి రుక్మిణి, ఎం.దేవేంద్ర, చక్రవర్తుల లక్ష్మి నరసమ్మ, రేగులపాటి విజయలక్ష్మి, అయినంపూడి శ్రీలక్ష్మి, బండారు సుజాతశేఖర్, కొండపల్లి నిహారిణి, వాణీ దేవులపల్లి,నెల్లుట్ల రమాదేవి, శుక్తిమతి, కళాగోపాల్, కందాళ శోభాదేవి, కొలిపాక శోభారాణి, షంషాద్ బేగం, రజియా బేగం, సూరేపల్లి సుజాత, కరణ బాల, తుర్లపాటి ఎన్.అరుణ, బండారి విజయ, హన్మాండ్లు శారద, జ్వలిత, హిమజ తదితరులు.


కుప్పాంబిక
తెలంగాణ ఆడబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రి. కుప్పాంబిక కాకతీయుల కాలం నాటి కవయిత్రి. తెలుగులో తొలి రామాయణంగా ప్రసిద్ధికెక్కిన రంగనాథ రామాయణం రాసిన గోన బుద్ధారెడ్డికి ఆమె కుమార్తె. మహబూబ్‌నగర్ జిల్లాలోని బూదపూర్ (భూత్పూర్)లో క్రీ.శ. 1276లో తన భర్త చనిపోయినప్పుడు వేయించిన శాసనాన్ని బట్టి ఆమె 1230లో జన్మించినట్టు తెలుస్తుంది. తండ్రి నుంచి సాహిత్య వారసత్వం పొంది, భర్త మల్యాల గుండనాథుని ఆస్థానంలోని కవుల స్ఫూర్తితో ఆమె సాహిత్యానికి మెరుగులు దిద్దుకున్నారు. అయ్యలరాజు రామభద్రుడు సంకలనం చేసిన ఓ గ్రంథంలో కుప్పాంబిక పద్యాన్నొకదాన్ని పేర్కొన్నారు. బాల్యం నుంచి యవ్వనదశకు చేరుకున్న తనపై మన్మథుడు కురిపించే బాణాలు పెంచే మోహాన్ని తన ప్రియసఖులతో కూడా చెప్పుకోలేకపోవడం గురించి ఆ పద్యంలో కుప్పాంబిక హృద్యంగా రాశారు.

మాదిరెడ్డి సులోచన
మాదిరెడ్డి సులోచన హైదరాబాద్ శంషాబాద్ గ్రామంలో 1935లో జన్మించారు. వీరిది సంప్రదాయక వ్యవసాయక కుటుంబం. ఈమె ఎం.ఏ,ఎం.ఇడి చేసి 1971 వరకు సుమారు 10 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేశారు. భర్తతో పాటు ఇథియోఫియా, జాంబియా దేశాలకు వెళ్లి అక్కడ కూడా ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1965లో జీవనయాత్ర పేరుతో మొదటి నవల రాశారు. ఈమె దాదాపు 150 కథలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రాశారు. వీటిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ప్రేమలూ పెళ్లిళ్ల కంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఆమె రచనా శైలి సాగింది. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కథారచయిత్రి అవార్డులు అందుకున్నారు.

పోల్కంపల్లి శాంతాదేవి
పోల్కంపల్లి శాంతాదేవి ప్రసిద్ధి తెలుగు నవలా రచయిత్రి. మహబూబ్ నగర్ జిల్లా, పెబ్బేరు మండలం, శ్రీరంగాపూర్ గ్రామంలో 1942లో జన్మించారు. శాంతాదేవి సామాజిక సమస్యలను, స్త్రీల అవస్థలను తన నవలలో చిత్రీకరిస్తూ సామాజిక చైతన్యాన్ని కలిగిస్తున్న ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి. సహజత్వంతో, వాస్తవికతకు దగ్గరగా, తాత్వికతతో కూడిన రచనలు చేసింది. విద్యార్థి దశ నుంచే రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టారు. 1961లో వీరి మొదటి రచన ముక్తిమార్గం కుసుమహరనాథ పత్రికలో అచ్చైంది. ప్రజాపాణీగ్రహం, కాలపురుషుని హెచ్చరిక కథలు, 40 కు పైగా నవలలు రాశారు. చండీప్రియ, ప్రేమపూజారి, బాటసారి, రక్తతిలకం, పచ్చిక, పూజాసుమం, ప్రేమ బంధం, జీవన సంగీతం, సుమలత, దేవదాసి, పుష్యమి, వరమాల వీరి నవలలలో కొన్ని. 7 కథా సంపూటాలు వెలువరించింది.

పాకాల యశోదారెడ్డి
పాకాల యశోదారెడ్డి ( ఆగస్టు 8, 1929 - అక్టోబర్ 7, 2007) ప్రముఖ రచయిత్రి. యశోదారెడ్డి 1929, ఆగష్టు 8న మహబూబ్‌నగర్ జిల్లా, బిజినేపల్లిలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఆచార్యులుగా పనిచేసి, పదవీ విరమణ చేసింది. ఆమె ధర్మశాల, ఎచ్చమ్మ కథలు తదితర కథాసంపుటులను వెలువరించింది. తెలంగాణ సజీవ భాషను ఆమె తన రచనల్లో వాడి పలువురి మన్ననలు పొందింది. ఆకాశవాణిలో తెలంగాణ మాండలికంలో ప్రసంగం చేసిన తొలి రచయితగా ఆమె పేరు పొందింది. ఆమె ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది. జర్మన్ భాషలో, భాష శాస్త్రంలో డిప్లొమా చేసింది. ఉస్మానియా నుంచి డాక్టరేట్ పట్టాను పొందింది. యశోదారెడ్దికి హిందీ, ఉర్దూ, కన్నడ, జర్మన్ భాషతో కూడా పరిచయమున్నది.

నందగిరి ఇందిరాదేవి
నందగిరి ఇందిరాదేవి సెప్టెంబరు 22, 1919లో వరంగల్ జిల్లా హన్మకొండలో జన్మించారు. తొలితరం తెలంగాణ కథారచయిత్రి. పద్నాలుగో ఏటే పాఠశాల తరపున సాహిత్య సంచికల్ని వెలువరించింది. ఆమె అనేక సామాజిక, సాంసృతిక ఉద్యమాల్లో పాలు పంచుకునేది. ఆంధ్రయువతి మండలి వ్యవస్థాపకులలో ఆమె ఒకరు. నిజాం పాలనాకాలంలో హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి ప్రసారమైన నషర్ కార్యక్రమాల్లో పాల్గొనేది. చాలా రేడియో ప్రసంగాలు వ్రాసింది. సంసార, కుటుంబ సంబంధమైన ఇతివృత్తాలతో రాసిన ఇందిరాదేవి కథలు, వ్యావహరిక భాషలో, సరళ శైలిలో ఉన్నాయి. తన కథల్లో వరంగల్ జిల్లా ప్రజా జీవితాన్ని చిత్రించింది. తన కథలలో స్త్రీ పురుషుల మనస్తత్వాలను సుకురమారంగా చిత్రించింది. వాయిద్యం సరదా, ప్రథమ పరిచయం, ప్రాప్తం, ఏకాకి కథలు రాశారు.

ఇల్లిందల సరస్వతీదేవి
ఇల్లిందల సరస్వతీదేవి(1918-1998) ప్రముఖ తెలుగు కథారచయిత్రి. భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారంగా వాసికెక్కిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత్రి. 1918లో జన్మించారు. ఇల్లిందల సరస్వతీదేవి 250 కథలను, 5 నవలలు రచించారు. దరిజేరిన ప్రాణులు, ముత్యాల మనసు మొదలైన 5 వ్యాససంపుటాలు, జీవితచరిత్రలు రచించారు. బాలసాహిత్యకారిణిగా నాటికలు, రేడియో నాటికలు రచన చేశారు. వివిధ భాషల్లోంచి ఎన్నో పుస్తకాలను అనువాదాలు కూడా చేశారు. స్వర్ణకమలాలు, తులసీదళాలు, రాజహంసలు వంటి కథాసంకలనాలు వెలువరించారు. 1982లో స్వర్ణకమలాలు కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. స్వర్ణకమలాలు కథాసంకలనానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.

ముదిగంటి సుజాతారెడ్డి
ముదిగంటి సుజాతారెడ్డి ప్రఖ్యాత రచయిత్రి. ఈమె నల్లగొండ జిల్లా, నకిరేకల్ మండలం, ఆకారం గ్రామంలో జన్మించింది. తెలుగు సాహిత్యరంగంలో తెలంగాణ భావనను మేధోపరంగా సాహిత్యపరంగా అందిస్తున్న వారిలో ముదిగంటి సుజాతారెడ్డి ముఖ్యులు. నవలా, కథా రచయిత్రిగా, ముదిగంటి సుజాతారెడ్డి మార్గం స్వతంత్రమైనది. విసుర్రాయి, మింగుతున్నపట్నం, వ్యాపార మృగం, మరోమార్క్స్ పుట్టాలె అన్న నాలుగు కథా సంపుటాలు ఇప్పటి వరకు వచ్చాయి. ప్రపంచీకరణ నేపథ్యం, పట్టణ స్వభావంలోని మోసాలు, మారుతున్న హైదరాబాదు మనుషులు ఆమె కథల్లో కనిపిస్తారు.

5798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles