గోలకొండ గొంతుక.. సురవరం వర్థంతి నేడు

Thu,August 25, 2016 09:01 AM

Suvarnam Pratapreddy death anniversary

హైదరాబాద్: ప్రజల పక్షాన అక్షరాన్ని ఆయుధంగా సంధించినవాడు.. నిరంకుశ పాలనను నిగ్గదీసినవాడు.. తెలంగాణ సాహితీ చరిత్రలో మైలురాయిగా నిలిచినవాడు.. ఆంధ్రుల సాంఘిక చరిత్రకు అక్షర రూపమిచ్చిన కలం యోధుడు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, రచయిత, కార్యకర్త, ఉద్యమకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. నగరంతో ఆయన అనుబంధం విడదీయరానిది. నేడు సురవరం ప్రతాపరెడ్డి 63వ వర్ధంతి.

దశాబ్ధాల కోస్తాంధ్ర పాలనలోనే కాదు.. నిజాం నిరంకుశ పాలనలోనూ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఓవైపు భూస్వామ్య దోపిడీ, మరోవైపు రజాకార్ల అరాచకాలు తెలంగాణను అతలాకుతలం చేశాయనే చెప్పాలి. ఉర్దూ అధికార భాషగా గల నిజాంపాలనలో తెలుగు భాష పట్ల తీవ్ర నిర్లక్ష్యం కొనసాగింది. అలాంటి సందర్భంలో తెలుగు భాషా వికాసానికి విశేష కృషిచేసిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి. పాలమూరు జిల్లాకు చెందిన సురవరం తిరవాన్‌కూర్‌లో బీఎల్ చదివాడు. కొంతకాలం న్యాయవాద వృత్తి చేశారు. కానీ పత్రికా సంపాదకుడిగా, సాహితీవేత్తగా, ఉద్యమకారుడిగానే తెలంగాణ ప్రజల ముదిలో మిగిలిపోయాడు.

సంపాదకుడిగా..
సురవరం ప్రతాపరెడ్డి 1926లో గోలకొండ పత్రికను ప్రారంభించారు. నగరంలోని ట్రూప్ బజార్‌లో నిజాం అనుమతితో చిన్న భవనంలో గోల్కొండ పత్రికను ప్రారంభించారు. తెలుగులో పత్రికలు లేని కాలంలో ఒక వారపత్రికను ఆరంభించడం తెలుగు భాషా చరిత్రలో సంచలనమనే చెప్పాలి. తెలంగాణ ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడంలో గోల్కొండ పత్రిక కీలకపాత్ర పోషించింది. తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రజలను సన్నద్ధం చేయడంతో పాటు, రజాకార్ల దౌర్జన్యాలను ఎండగట్టడంలో పత్రిక క్రియాశీలక పాత్ర పోషించింది. నిజాం బెదిరింపులకు జంకలేదు. తన కలాన్ని మరింత పదునుగా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఝులిపించాడు. ప్రజల కడగండ్లను అక్షరాల్లోకి ఒంపాడు. వారపత్రికగా ఆరంభమైన గోలకొండ అనతికాలంలోనే దినపత్రిక స్థాయికి ఎదిగింది. 22 సంవత్సరాల పాటు గోల్కొండ పత్రికకు ప్రతాపరెడ్డి సంపాదకత్వం వహించారు. అనంతరం 1951లో ప్రజావాణి అనే పత్రికను ప్రారంభించారు.

గోలకొండ కవుల సంచిక..
తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే.. దానికి సమాధానంగా 350మంది కవుల రచనలతో గోలుకొండ కవుల సంచికను ప్రచురించారు. తెలంగాణ సాహిత్య వెల్లువను ప్రపంచానికి చాటారు. 1934లో ప్రచురితమైన ఈ సంచిక తెలంగాణ సాహితీ చరిత్రలో ప్రముఖ అధ్యాయంగా చెప్పుకోవచ్చు. హిందువుల పండుగలు, రామాయణ కాలం నాటి విశేషాలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, మొఘలాయి కథలు, మామిడి పండు, మీసాల కృష్ణుడు, నిజాం రాష్ట్ర పాలన లిపి సంస్కరణ వంటి గ్రంథాలు రచించారు.

నగరంపై చెరగని ముద్ర..
సురవరం నగరంపై చెరగని ముద్రవేశారనే చెప్పాలి. గ్రంథాలయోద్యమంలో ఆయన పాత్ర ఎనలేనిది. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించారు. 1944లో నగరంలో ఆంధ్ర సారస్వత పరిషత్తుకూ ఆయన అధ్యక్షుడు. నగరం నుంచి నిర్వహించిన గోలకొండ పత్రికతోపాటు, రాజ బహద్దూర్ వెంకటరామరెడ్డి సూచనలతో రెడ్డి హాస్టల్ నిర్వహణ బాధ్యతలు సైతం స్వీకరించారు సురవరం. ఎలాంటి జీతభత్యాలు లేకుండానే రెడ్డి హాస్టల్ అభివృద్ధి కోసం విశేష కృషి చేశారు. 1952లో హైదరాబాదు రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వనపర్తి నియోజకవర్గం నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు. 1953 ఆగస్టు 25న చనిపోయారు. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసి.. తెలుగు భాషా వికాసానికి ఎనలేని సేవ చేసిన ఆ వైతాళికుడిని ఆయన వర్ధంతి సందర్భంగా గుర్తుచేసుకోవడం మనందరి బాధ్యత.

2094
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles