పోకిరీల పని పట్టేందుకు 200 చోట్ల నిఘా..

Tue,September 4, 2018 06:45 AM

She Teams concentration on Eve Teasers in hyderabad city

దూకుడు పెంచనున్న షీ బృందాలు
బస్టాపులు, కాలేజీలు, ఉమెన్స్ హాస్టల్స్ వద్ద ప్రత్యేక దృష్టి
కాలనీలు, బస్తీల్లో నిఘా
ఆకతాయిలకు వణుకు పుట్టేలా కార్యచరణ


హైదరాబాద్ : మహిళలు, యువతుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. వారికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు పోలీసులు, షీ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే బస్టాపులు, కాలేజీలు, పోకిరీలు తిరిగే ప్రాంతాల్లో నిఘా ఉంచారు. ఇంకా యువతులు, మహిళల్లో మరింత ధైర్యం నింపేందుకు హైదరాబాద్ షీ టీమ్స్ ఈవ్‌టీజర్ల ఆట కట్టించేందుకు సరికొత్త వుహ్యాలతో ముందుకెళ్లనుంది. ఇప్పటి వరకు గుర్తించిన హాట్ స్పాట్లకు అదనంగా, మరో వంద హాట్‌స్పాట్లను గుర్తించి దూకుడు పెంచనున్నారు. నగరంలో మొత్తం 200ల హాట్‌స్పాట్లలో షీ బృందాలు తిరిగే విధంగా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ రూట్ మ్యాప్ ప్రతి ఏరియా కవరయ్యేలా ఉంటుంది.

ఇలా చేయడంతో ప్రతి కాలనీ, బస్తీ ప్రాంతాలపై కూడా షీ టీమ్స్ నిఘా కొనసాగనున్నది. క్షేత్ర స్థాయి వరకు వెళ్లి, మహిళల నుంచి సూచనలు, సలహాలు తీసుకొని, దీనిని మరింత సమర్థవంతంగా చేసేందుకు షీ టీమ్స్ ప్రణాళికలు రూపొందిస్తున్నది. షీ టీమ్స్ పహారాతో ఈవ్‌టీజర్లలో ఇప్పటికే వణుకుపుడుతున్నది. బస్టాప్‌లు, కాలేజీలు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలున్న ప్రాంతాలపై షీ టీమ్స్ ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ నిరంతరం ఈవ్‌టీజర్లపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. షీ టీమ్స్‌పై మహిళల్లో అవగాహన వస్తుండడంతో నేరుగా షీ టీమ్స్‌కు తమ సమస్యల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. వారికి కొండంత అండగా ఉంటూ .. వేధింపులకు గురిచేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ షీ టీమ్స్ తమ సత్తాను చాటుతున్నాయి.

అదనంగా మరో 100 హాట్ స్పాట్ల గుర్తింపు
నగరంలో యువతులు, విద్యార్థినులు, మహిళలపై వేధింపులు జరిగే ప్రధానమైన 100 హాట్ స్పాట్లను గతంలోనే షీ టీమ్స్ గుర్తించాయి. ఈ హాట్ స్పాట్లలో నిఘా ఉంచుతూ, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే పోకిరీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. దీనికి తోడు వేధింపులకు గురయ్యే మహిళలు డయల్ 100, వాట్సాప్, ఫేస్‌బుక్, ఈ -మెయిల్‌తో పాటు నేరుగా వచ్చి షీ టీమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇలా షీ టీమ్స్‌కు ప్రతి రోజు ఐదు ఫిర్యాదుల వరకు అందుతున్నాయి. ఇందులో కొందరు కేసుల నమోదుకు విముఖత చూపుతున్నారు. వేధింపులకు గురిచేసే వారిని మందలించడం వరకే పరిమితం కావాలంటూ షీ టీమ్స్ ను కోరుతున్నారు. మహిళలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలైన బస్టాప్‌లు, ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీ కూడళ్లు, హాస్టల్స్‌ను ఈవ్‌టీజింగ్ జరిగేందుకు అవకాశమున్న ప్రాంతాల(హాట్ స్పాట్)ను గుర్తించారు. ఇలా 100 హాట్ స్పాట్లలో నిఘా కొనసాగుతుండడంతో, ఈ ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్ చాలా వరకు తగ్గుముఖం పట్టింది. షీ టీమ్స్ నిఘా కొనసాగుతున్నదనే భయం ఆయా హాట్‌స్పాట్లలో పోకిరీల్లో ఉంటుంది. ఇదే విధంగా మరింత క్షేత్ర స్థాయి వరకు షీ టీమ్స్ నిఘా ఏర్పాటు చేసే విధంగా నూతనంగా మరో 100 హాట్ స్పాట్లను గుర్తించి, మొత్తం 200 హాట్ స్పాట్లలో షీ టీమ్స్ నిఘా కొనసాగే విధంగా కసరత్తు చేస్తున్నారు.

రూట్ మ్యాప్ ఇలా ఉంటుంది....
పోలీస్‌స్టేషన్లలో సెక్టార్లు ఉంటాయి. ఆయా సెక్టార్లలో బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాల పహారా కొనసాగుతున్నది. ఇలాగే షీ టీమ్స్‌కు కూడా నగరంలో ఉన్న ఐదు డీసీపీ జోన్లను సెక్టార్లుగా విభజించి, ఆయా షీ బృందాలకు బాధ్యతలను ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 200 హాట్ స్పాట్లపై నిఘా కొనసాగే విధంగా రూట్ మ్యాప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక పక్క సెక్టార్ల వారీగా ఈ హాట్ స్పాట్లను విభజించి, ఒక్కో హాట్ స్పాట్ నుంచి మరో హాట్ స్పాట్‌కు షీ బృందాలు నిఘాను కొనసాగించే విధంగా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. పరిస్థితులను బట్టి ఆయా రూట్ మ్యాప్‌ల్లో షీ బృందాలు ప్రతి రోజు, రోజు మార్చి రోజు ఇలా ఎప్పటికప్పుడు తమ రూట్లలో మార్పులు చేసుకుంటూ ప్రతి హాట్‌స్పాట్లలో షీ టీమ్స్ నిఘా ఉండేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రతి హాట్ స్పాట్‌లో షీ టీమ్స్ ఎప్పుడు ఉంటాయో పోకిరీలు ఉహించని విధంగా నిఘాను ఏర్పాటు చేసేందుకు షీ టీమ్స్ ఇన్‌చార్జి కసరత్తు మొదలు పెట్టారు.

ఈవ్‌టీజింగ్‌ను కట్టడి చేస్తాం
నగరంలో పూర్తి స్థాయిలో ఈవ్‌టీజింగ్‌ను కట్టడి చేయడంతో పాటు, ప్రతి మహిళకు షీ టీమ్స్‌పై పూర్తి అవగాహన ఉండే విధంగా ఉన్నతాధికారులు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. వారిచ్చిన ఆదేశాల మేరకు కొత్తగా హాట్ స్పాట్లను గుర్తించాం. ప్రతి కాలనీ, బస్తీలోని ముఖ్య కూడళ్లను, ఆయా ప్రాంతాలను షీ టీమ్స్ కవర్ చేసే విధంగా రూట్ మ్యాప్‌ను తయారు చేస్తున్నాం. నగర అదనపు పోలీస్ కమిషనర్, షీ టీమ్స్ ఇన్‌చార్జ్జి షీకా గోయెల్ నేతృత్వంలో షీ టీమ్స్ మరింత సమర్థవంతంగా పనిచేస్తూ మరిన్ని ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు కార్యచరణ సిద్ధమయ్యింది. - సి.నర్మద, షీ టీమ్స్, ఏసీపీ

2100
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles