నగరంలో 400 బస్‌షెల్టర్ల పునరుద్ధరణ

Sun,July 21, 2019 07:46 AM

Restoration of 400 bus shelters in the city

హైదరాబాద్: నగరంలో వివిధ కారణాలతో జీహెచ్‌ఎంసీ, మెట్రోరైలు అధికారులు తొలగించిన 400 బస్ షెల్టర్లను తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించేందుకు జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, ట్రాఫిక్ తదితర విభాగాల అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. వచ్చే 15 రోజుల్లోగా కమిటీ తన నివేదికను సమర్పించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. మింట్ కాంపౌండ్‌లోని సెంట్రల్ పవర్ డిస్ట్రీబ్యూషన్ కంపెనీ (సీపీడీసీఎల్) కార్యాలయంలో శనివారం సిటీ సమన్వయ సమావేశం జరిగింది. సీఎండీ రఘుమారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల సంయుక్త కలెక్టర్లు జి. రవి, హరీశ్, హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం డీసీపీ చౌహాన్, జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ విభాగం డైరెక్టర్ విశ్వజిత్ తదితరులతో పాటు రైల్వే, ఆర్మీ శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో తొలగించిన 400 బస్ షెల్టర్లను తిరిగి ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనిపై దానకిశోర్ సానుకూలంగా స్పందిస్తూ, బస్ షెల్టర్ల ఏర్పాటు ప్రతిపాదనలను రూపొందించేందుకు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ అద్వైత్‌కుమార్, నగర ముఖ్య ప్రణాళికాధికారి దేవేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్, సైబరాబాద్ డీసీపీ విజయ్‌కుమార్, ఆర్టీసీ ఈడీ వినోద్‌కుమార్ తదితరులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

547
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles