ఇంకా దొరకని రామంతాపూర్‌వాసుల జాడ

Wed,September 18, 2019 06:57 AM

రామంతాపూర్: బోటు ప్రమాదంలో గల్లంతైన రామంతాపూర్ వాసుల ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. అక్కడి అధికార యంత్రాంగం నుంచి సమాచారం సేకరిస్తూ కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. ఇప్పటికే ప్రమాదంలో మృతి చెందిన శివజ్యోతి అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు. బోటు సుడిగుండంలో మునిగి సుమారు 300 అడుగుల లోతు ఉండడంతో అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా నావీ బృందాన్ని రప్పిస్తున్నారని, లోపలి నుంచి బోటును బయటికి తీస్తే తప్ప గల్లంతైన వివరాలు తెలుస్తాయని అక్కడ ఉన్నవారు చెప్పారు. ఇదిలా ఉండగా రామంతాపూర్ ఆర్టీసీకాలనీలో అంకెల శంకర్, రేవతిలను పలువురు బంధువులు, స్నేహితులు పరామర్శించారు. గల్లంతైన వారి సమాచారం ఇంకా తెలియకపోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలానికి ఎవరు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రాజమండ్రి ప్రభుత్వ దవాఖాన వద్ద వేచి చూస్తున్నామని ఆక్కడి వెళ్లిన జగదీష్ మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ వైద్యశాలనుంచి బోటు మునిగిన ప్రాంతం సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. ఇందులో మరణంచిన వారిని రాజమండ్రి దవాఖానలో పోస్టుమార్టం చేసి స్వస్థలాలకు పంపిస్తున్నారని తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకు గల్లంతైన వారి సమాచారం ఏమీలేదన్నారు.

1308
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles