టార్గెట్.. రేడియల్ రోడ్లు..!

Sat,January 12, 2019 08:15 AM

radial roads to be constructed in hyderabad city

నగరం నలువైపులా నుంచి ఔటర్ రింగు రోడ్డుపైకి సాఫీగా ప్రయాణం సాగించే ఉద్దేశంతో నిర్మిస్తున్న రేడియల్ రోడ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. 35 రేడియల్ రోడ్ల (376కి.మీటర్ల) నిర్మాణంలో భాగంగా 17 చోట్ల హెచ్‌ఎండీఏ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఐదు చోట్ల ఆర్ అండ్ బీ శాఖ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. మిగిలిన 13 చోట్ల రేడియల్ రోడ్ల నిర్మాణ పనుల్లో భాగంగా హెచ్‌ఎండీఏ ఐదు చోట్ల పనులకు బాలానగర్ మినహా నాలుగు చోట్ల పూర్తి చేసింది. మరో ఏడు ప్రాంతాల్లో పనులు చేపట్టాల్సి ఉండగా, ఇందులో రేడియల్ రోడ్ నెం. 14, 26, 31, 32, 20లకు గానూ డిటెల్ట్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను సిద్ధం చేశారు. ప్రభుత్వ సహకారంతో ఈ రేడియల్ రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేసే క్రమంలోనే 2019-20 వార్షిక బడ్జెట్‌లో వీటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. భూ సేకరణ పూర్తి కానీ ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని జైకా తేల్చడంతో ప్రభుత్వంపై హెచ్‌ఎండీఏ ఆశలు పెట్టుకున్నది. త్వరలోనే రేడియల్ రోడ్ నెం. 20 పనులను కార్యరూపంలోకి తీసుకువచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ పనులను ల్యాండ్ ఫూలింగ్ స్కీంలో చేపట్టలా? భూ సేకరణకు ప్రభుత్వం సహకారంతో చేపట్టలా? అని అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.

రూ. 1813 కోట్ల వార్షిక బడ్జెట్ అంచనా


2019-20 వార్షిక బడ్జెట్‌ను అధికారులు రూపొందించారు. ఇందులో జైకా రుణానికిగానూ రూ. 512 కోట్లు, రూ. 1301కోట్లతో యాన్యూటీ పేమెంట్స్, రేడియల్ రోడ్ల నిర్మాణం, ఔటర్ భూ నిర్వాసితుల కోసం కోహెడా లే అవుట్ అభివృద్ధి పనులకు బడ్జెట్ కేటాయించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతేడాది 2017-18 వార్షిక బడ్జెట్‌లో రూ.485 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 121.25 కోట్లు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా 2019-20 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలో ప్రభుత్వం ఏ మేర కేటాయింపులు జరుపుతుందోనన్న ఉత్కంఠ హెచ్‌ఎండీఏలో నెలకొన్నది.

తక్షణం చేపట్టే రేడియల్ రోడ్లు ఇవే


మిథానీ జంక్షన్ నుంచి ఆదిబట్ల వరకు 15.50 కిలోమీటర్ల మేర రేడియల్ రోడ్ నం. 26 పనులను చేపట్టనున్నారు. ఈ పనులకు రూ. 207.75కోట్లు కాగా భూసేకరణకు రూ. 64.17 కోట్లు ఖర్చు పెట్టనున్నారు.

మూసాపేట నుంచి బీహెచ్‌ఈఎల్ జంక్షన్ వరకు 7.40 కిలోమీటర్ల మేర రేడియల్ రోడ్ నం. 8ని చేపడుతారు. డీపీఆర్ రూపకల్పనకు సిద్ధమవుతున్నది.

తారనగర్ నుంచి చందానగర్ దేవరగూడ వరకు 8.90 కిలోమీటర్ మేర రేడియల్ రోడ్ నం. 31ను చేపట్టనున్నారు. ఇందుకోసం రూ. 88.67కోట్లు ఖర్చు చేస్తారు. భూ సేకరణకు రూ.303.81 కోట్లు అవుతుందని అంచనా వేశారు.

నిజాంపేట క్రాస్‌రోడ్ నుంచి ఖాజిపల్లి వరకు 8.41 కిలోమీటర్ మేర రేడియల్ రోడ్ నం. 32ను చేపడుతారు. నిర్మాణానికి రూ. 93.80కోట్లు, భూసేకరణకు రూ.328కోట్లు ఖర్చు చేయనున్నారు.

నాగోల్ బ్రిడ్జి నుంచి కొర్రెముల వరకు 14.0 కిలోమీటర్ మేర రేడియల్ రోడ్ నం. 20ను చేపడుతారు. ప్రస్తుతం డీపీఆర్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు భూ సేకరణ అంశంలో ల్యాండ్ ఫూలింగ్ స్కీంలో ప్రాజెక్టు చేపట్టే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.

1778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles