పోకిరీల పనిపట్టారు..

Sun,July 7, 2019 07:17 AM

rachakonda police arrested youth who harassed girls in hyderabad

- అదే పనిగా వేధిస్తున్న 54 మంది అరెస్టు
- ఐదు వారాల్లో 49 ఫిర్యాదులు

హైదరాబాద్: అమ్మాయిల వెంట పడి వేధిస్తున్న 54 మంది పోకిరీలను రాచకొండ షీ టీమ్స్ అదుపులోకి తీసుకుంది. ఐదు వారాల్లో నమోదైన ఫిర్యాదులపై షీటీమ్స్ దర్యాప్తు చేసి పోకిరీలను అరెస్టు చేసింది. వీరందరికీ శనివారం ఎల్బీనగర్‌లోని రాచకొండ పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ను ఇచ్చింది. ఈ కౌన్సెలింగ్ కార్యక్రమంలో షీటీమ్స్ అధికారులతోపాటు భూమిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మానసిక విశ్లేషకులు పాల్గొన్నారు. మల్కాజిగిరి, భువనగిరి, ఎల్బీనగర్ షీటీమ్స్ 4 బాల్య వివాహాలను అడ్డుకుని బాలికలకు ఇష్టం లేని పెండ్లీల నుంచి కాపాడింది. 54 మంది పోకిరీలపై మొత్తం 19 ఎఫ్‌ఐఆర్‌లు, 27 పెట్టీ కేసులు, మూడు కౌన్సెలింగ్ కేసులను నమోదు చేసింది. పట్టుబడిన వారిలో 48మంది మేజర్లు, 6 మైనర్లు ఉన్నారు. షీటీమ్స్ పట్టుకున్న పలు ముఖ్యమైన సంఘటనల్లో వెలుగులోకి వచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి.

పరీక్షల హాల్లో విద్యార్థినికి బూతు ఫొటోలు..


అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతానికి చెందిన ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థిని బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అయితే మే 18న విద్యార్థిని సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైంది. పరీక్ష గదిలో ఇన్విజిలేటర్‌గా ఉన్న చేకూరి మహేశ్ విద్యార్థిని దగ్గరకు వచ్చి ఏదైనా జవాబులు కావాలా? అని అడిగాడు. అయితే వద్దని విద్యార్థిని బదులు ఇచ్చింది. మరికొద్ది సేపటి తర్వాత వచ్చి ఫోన్ తీసి కొన్ని బూతు ఫొటోలు, వీడియోలు చూపించి నీవు ఇలా నాతో చేస్తే నీకు పరీక్షల్లో పాసయ్యే విధంగా సహాయం చేస్తానని చెప్పాడు. అంతే కాకుండా పెన్సిల్‌తో అతని ఫోన్ నంబరును రాసిచ్చి ఫోన్ చేయాలని చెప్పాడు. ఈ పరిణామాలతో గందరగోళానికి గురైన విద్యార్థిని తనను ఎక్కడ ఫెయిల్ చేస్తాడో అని భయపడి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. వారి సహాయంతో షీటీమ్స్‌ను ఆశ్రయించింది. దర్యాప్తు చేసిన పోలీసులు మహేశ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు.

ఈత నేర్పిస్తాను.. ప్రేమించమని వెంటపడ్డాడు..


ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక(13) వేసవి సెలవుల్లో బండ్లగూడలోని వీ స్పోర్ట్స్ అకాడమీలో ఈత నేర్చుకోవడానికి చేరింది. అకాడమీలో ఈత శిక్షకుడిగా పనిచేస్తున్న నవీన్ ఆ బాలికకు ఫోన్ చేసి ప్రేమించమని వెంటపడ్డాడు. పెండ్లి చేసుకుంటానని వేధించాడు. బాలిక పలుమార్లు హెచ్చరించినా అతడు వినకుండా ప్రేమను ఒప్పుకోకపోతే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. అంతేకాకుండా ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలిక వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రవర్తనతో బెంబేలెత్తిన బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలు సేకరించిన పోలీసులు నవీన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పోకిరీలపై ట్విట్టర్‌లో సమాచారం..


మల్కాజిగిరి ప్రాంతంలో పోకిరీల బెడద ఉందని తమకు రక్షణ కల్పించాలని షీ టీమ్స్‌కు ట్విట్టర్ ద్వారా సమాచారం అందించడంతో షీ టీమ్స్ 10 రోజులు డీకాయ్ ఆపరేషన్‌ను నిర్వహించి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న 18 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ను నిర్వహించారు. భువనగిరి షీటీమ్స్ యాదగిరిగుట్ట జెడ్పీహెచ్‌ఎస్ స్కూల్ వద్ద ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారికి కౌన్సెలింగ్ చేశారు. పోకిరీలు, ఇతరుల వేధింపుల బారినపడే మహిళలు, యువతులు, విద్యార్థినులు మౌనంగా ఉండకుండా డయల్ 100/రాచకొండ వాట్సాప్ 9490617111కు సమాచారం ఇవ్వాలని సీపీ మహేశ్ భగవత్ కోరుతున్నారు.

2293
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles