
హైదరాబాద్: ఆనందాశ్రమంలో ఉన్న యాచకులు మళ్లీ యాచకం జోలికి వెళ్లకుండా సమాజంలో గౌరవంగా జీవించాలని దానికి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తామని సెట్విన్ చైర్మన్ ఇనాయత్ అలీ బాక్రీ అన్నారు. మంగళవారం చంచల్గూడ జైలులో ఉన్న ఆనందాశ్రమాన్ని ఆయన సందర్శించారు. ఆశ్రమంలో యాచకులకు అందిస్తున్న సేవలను జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ దివ్యాంగులకు ఫోన్ షాపు, ఇతరులకు బైండింగ్, సెక్యూరిటీ గార్డు, వెల్డింగ్ పనులు తదితర వాటిలో శిక్షణ ఇప్పించి వారి జీవనోపాధికి ఏర్పాట్లు చేస్తామన్నారు. యాచక వృత్తిని వదిలేసి నేరుగా తనను కలిస్తే ఎదైనా ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. యాచక వృత్తికి దూరంగా వుండాలని, సమాజంలో గౌరవంగా జీవించటానికి వచ్చేవారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు, జైలు అధికారులు పాల్గొన్నారు.