ముందుగా డబ్బుల ప్రస్తావన వస్తే.... జాగ్రత్త

Sun,October 14, 2018 07:31 AM

protect yourself against Cyber Crime

హైదరాబాద్ : వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం... ప్రతి ఒ క్కరూ ఇప్పడు ఇంటర్‌నెట్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇంటర్‌నెట్ ద్వారానే కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన లావాదేవీలు సులవుగా సాగడంతో పాటు.. కూర్చున్న వద్దనే పని పూర్తవుతుందనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. ఈ ఆలోచననే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రీ యాడ్ పోస్టింగ్ వెబ్‌సైట్లలో వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తున్నామంటూ నమ్మిస్తూ.. మోసాలకు పాల్పడుతున్న ముఠాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. కంప్యూటర్.. సెల్‌ఫోన్.. ఉంటే ఇప్పుడు నిమిషాల వ్యవధిలోనే వేలు, లక్షలు సంపాదించే ట్రిక్కులతో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తులు వేస్తూ అమాయకులను ముంచేస్తున్నారు. ఓఎల్‌ఎక్స్.కామ్, క్వికర్.కామ్ వెబ్‌సైట్లలో ఎన్నో రకాల ఆన్‌లైన్ ప్రకటనలు పోస్టు చేసుకునే అవకాశముంది. ఇందులో నైజీరియన్‌కు చెందిన కొందరు సైబర్ చీటర్లతో పాటు బెంగుళూరు, ఢిల్లీ వంటి ప్రాంతాలకు చెందిన మరికొంత మంది సైబర్‌నేరగాళ్లు కార్లు, సెల్‌ఫోన్లు, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, అంబులెన్స్ కాంట్రాక్టులు అంటూ ప్రకటనలు పోస్టు చేస్తూ అమాయకులకు వల వేస్తున్నారు. మోసపూరితమైన మాటలు.. ప్రకటనలతో అమాయకులను మోసం చేస్తున్నారు.

మోసం ఇలా జరుగుతున్నది..


సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు కార్లు, ఫోన్లు విక్రయిస్తామని పోస్టుపెట్టి అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. కారు ధర, కారు ఫొటోను పోస్టు చేయడంతో చాలామంది అందులో ఉన్న ఫోన్ నంబర్‌కు ఫోన్ చేస్తారు. మంచి మోడల్ కారు.. మార్కెట్ రేట్ కంటే 30 శాతం వరకు తక్కువగా వస్తుందంటే అందరికీ ఆశే ఉంటుంది.. ఇదే ఆశతో సైబర్‌చీటర్లు కొనుగోలు దారులను నిండుగా ముంచేస్తున్నారు. కారు విక్రయం ప్రకటన చూసి ఫోన్ చేయగానే.. తన స్నేహితుడు అర్జెంట్‌గా అమెరికా, దుబాయ్, లండన్ వెళ్లాడు. ఆ సమయంలో కారును ఎయిర్‌పోర్టు పార్కింగ్‌లో పార్కు చేశాడు. అక్కడ కారు ఉన్నది, కారు విక్రయానికి సంబంధించిన పూర్తి హక్కులన్నీ నాకు ఇచ్చేసి వెళ్లారంటూ నమ్మిస్తారు. కారు ఎక్కువ రోజులు పార్కింగ్‌లో ఉంటే పార్కింగ్ ఫీజు ఎక్కువవుతున్నది.. అందుకే ఎంతో కొంతకు విక్రయించాలని నిర్ణయించామంటూ నమ్మిస్తారు. అయితే కారుకు సంబంధించిన పార్కింగ్ ఫీజును చెల్లిస్తేనే చూసే వీలుంటుందని, అందుకు కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించండంటూ కొనుగోలుదారులను ఒప్పిస్తారు. ఇలా అడ్వాన్స్ తీసుకొని.. మాటలు చెబుతూ కారు ధర కంటే ఎక్కువగానే కొనుగోలుదారుల నుంచి సైబర్‌చీటర్లు నొక్కేస్తుంటారు. అలాగే లేటస్ట్ సెల్‌ఫోన్‌ను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ పోస్టులు పెట్టి అమాయకులను మోసం చేస్తుంటారు. ముందస్తు ప్రణాళికతో సైబర్‌నేరగాళ్లు సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలను ఇతరులవి సమకూర్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో వస్తువును డెలివరీ చేశామని, కొరియర్ ట్రాక్ చేసుకోవచ్చంటూ నమ్మిస్తారు.. కొరియర్ డబ్బులు చెల్లించాలంటూ నమ్మిస్తూ కూడా మోసాలు చేస్తున్నారు. ఇటీవల ఐఫోన్ ప్లస్ టీ ఫోన్‌ను విక్రయస్తున్నానంటూ క్వికర్‌లో పోస్టు చేసి రూ. 82,500 మోసం చేసిన నైజీరియన్‌ను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు బెంగుళూరులో ఇటీవల అరెస్ట్ చేశారు. ఇన్నోవా కారును తక్కువ ధరకు విక్రయిస్తున్నామంటూ నమ్మించి రూ. 85 వేలు మోసం చేసిన మరో నైజీరియన్‌ను కూడా బెంగుళూరులోనే సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నమ్మించి... మోసం చేస్తారు


ఆన్‌లైన్ ప్రకటనలో వస్తువు చూడకుండా డబ్బు లావాదేవీల ప్రస్తావన వచ్చిందంటే అది మోసమని అనుమానించక తప్పదు. ఆన్‌లైన్ ఫొటోలు చూసి.. డబ్బుల విషయం మాట్లాడుకోవడం వరకు బాగానే ఉంటుంది.. ఆ తరువాత డబ్బులు ఇవ్వాలని అమ్మేవారు పట్టుబట్టారంటే తొందరడి డబ్బులు ఇవ్వకుండా ఉండడం మంచిది. చదువులు, వ్యాపారం నిమిత్తం మన దేశానికి వచ్చే నైజీరియన్‌లు కొందరు సులువుగా డబ్బు సంపాదించేందుకు అమాయకులను మోసం చేసేందుకు ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకుంటున్నారు.

డబ్బుల ప్రస్తావన వస్తే... మోసం అని గ్రహించండి


సైబర్‌నేరాలను గుర్తించడంలో ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలి. తక్కువ ధర ఆశ చూ పడం.. మీరు త్వరపడకపోతే మంచి అవకాశాన్ని కోల్పొతున్నారనే భ్రమను కల్పిస్తుంటారు.. ఇలాంటి సందర్భాల్లో తొందరపడి డబ్బులు చెల్లించడం చేస్తుంటారు. ఇదొక్కటే కాదు.. ఉద్యోగాలు, పెండ్లిళ్లు, లాటరీ, ఇన్సూరెన్స్ ప్రీమియం లు ఇలా పలు సందర్భాల్లో సైబర్‌నేరగాళ్లు అమాయకులను ఎంచుకొని, వారిని మభ్య పెడుతారు. వారిని బుట్టలోకి దింపిన తరువాత రిజిస్ట్రేషన్ ఫీజంటూ ప్రారంభించి వేలు, లక్షల రూపాయలు లాగేస్తుంటారు. ఆన్‌లైన్ ప్రకటనలలోను అలాంటి ఘటనలు జరుగుతుంటాయి. అన్ని రకాలుగా ఆలోచించాలి. డబ్బు ప్రస్తావన వస్తే ఆ విషయంలో అనుమానించి, కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించి, నిర్ణయం తీసుకోవాలి. - అదనపు డీసీపీ, రఘువీర్, సైబర్‌క్రైమ్స్, హైదరాబాద్

2603
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles