'రూసా'తో ఓయూకు కొత్త కళ

Sun,February 3, 2019 10:17 PM

PM  Narendra Modi interacts with college students across the country  from Srinagar

ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ (రుసా) 2.0 పథకం కింద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ కెరీర్‌ హబ్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పది యూనివర్సిటీలు, పలు డిగ్రీ కళాశాలలను ఎంపిక చేసుకుని విద్యా, పరిశోధనల్లో మరింత ముందుకుసాగేందుకు రూసా 2.0 పథకాన్ని డిజిటల్‌ విధానం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.

జమ్మూ కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని షేర్‌-ఇ-కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ నుంచి ప్రధాని మోడీ ప్రారంభించిన ఈ కార్యక్రమం ఓయూలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈ పథకం మంజూరైన పది విశ్వవిద్యాలయాలు, ఇతర డిగ్రీ కళాశాలలలోని కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్లు, అధికారులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిర్ణీత సమయానికి రెండు గంటలు ఆలస్యంగా కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ.. కార్యక్రమం జరుగుతున్నంతసేపూ ఆడిటోరియం సీట్లు నిండిపోయి ఉండడం విశేషం. కార్యక్రమం మొత్తాన్ని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్‌పై తిలకించారు.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు ప్రధానిని పలు ప్రశ్నలు అడగడం, వాటికి ఆయన సమాధానాలు చెప్పడాన్ని ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం ప్రధాని మోడీ ప్రసంగాన్ని సభికులు ఆసక్తిగా విన్నారు. తరువాత నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌, రూసా స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ ఈ పథకం కింద దేశవ్యాప్తంగా పది విశ్వవిద్యాలయాలను ఎంపిక చేయగా, అందులో ఓయూ ఉండడం గర్వకారణమన్నారు.

ప్రపంచస్థాయి యూనివర్సిటీగా ఓయూ మారడంలో ఇది మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. రూసా నిధులతో దేశవ్యాప్తంగా ఎంపికచేసిన పది యూనివర్సిటీలు ప్రపంచస్థాయి యూనివర్సిటీలుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ పథకం కింద యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఇదే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీలతో అవగాహన కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.

రూసా 1.0 పథకం అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఈ పథకం కింద నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రూసా 2.0 పథకం కింద ఓయూకు రూ.100 కోట్లు, కాకతీయ యూనివర్సిటీకి రూ.50 కోట్లు, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీలకు రూ.20 కోట్ల చొప్పున మంజూరయ్యాయని వివరించారు. ఈ నిధులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ప్రొఫెసర్‌ టి. పాపిరెడ్డి మాట్లాడుతూ రూసా 2.0 పథకం కింద నిధులు పొందేందుకు న్యాక్‌ గుర్తింపు తప్పనిసరన్నారు. రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలు, కళాశాలలు నాణ్యతా ప్రమాణాలు పెంచుకుంటూ న్యాక్‌ గుర్తింపు కోసం ప్రయత్నించాలని సూచించారు. తద్వారా రూసా లాంటి పథకాల కింద నిధులు పొందవచ్చని అభిప్రాయపడ్డారు.

ఓయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రామచంద్రం మాట్లాడుతూ న్యాక్‌ గుర్తింపులో ఓయూ రెండో అత్యున్నతమైన న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ సాధించిందని చెప్పారు. దానికి అదనంగా యూపీఈ హోదాతో పాటు డీబీటీ, డీఎస్‌టీ, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లను కలిగి ఉన్నామని పేర్కొన్నారు. ప్రపంచ పోటీకి అనుగుణంగా టీచింగ్‌ - లర్నింగ్‌ ప్రక్రియలో మార్పులు తీసుకువచ్చామని వివరించారు. పరిశోధన, బోధనల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచుతూ నూతన ఆవిష్కరణ దిశగా ముందుకుసాగాలన్నారు. రూసా నిధులకు ఎంపిక చేసినందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్లు ప్రొఫెసర్‌ లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకటరమణ, రూసా ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సౌందర్య జోసెఫ్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ అడ్వైజర్‌ ప్రొఫెసర్‌ స్టీవెన్‌సన్‌, రూసా నోడల్‌ ఆఫీసర్లు ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌, డాక్టర్‌ శ్రీనివాసులు, ఆర్‌క్యూస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పార్థసారథి, పీఆర్‌వో డాక్టర్‌ ఇ. సుజాత తదితరులు పాల్గొన్నారు.

2001
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles