తాటి బెల్లం.. తమిళనాడు టు నగరం

Sat,January 12, 2019 08:06 AM

palm jaggery has huge demand which is manufactured in tamilnadu

ఔషధ గుణాలు ఘనం
నగరంలో పెరుగుతున్న డిమాండ్
కిలో రూ.240 నుంచి రూ.450
ఎక్కువ కాలం నిల్వ చేసుకునే అవకాశం
వివిధ ప్రాంతాల్లో విక్రయాలు

తాటి బెల్లం.. తీపే కాదు.. ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. ఉరుకులు పరుగుల జీవితంలో నగరవాసులు ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. బలవర్ధకమైన ఆహార పదార్థాలను తినేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు తాటిబెల్లంపైనా మక్కువ పెంచుకుంటున్నారు. వైట్ షుగర్‌కు బదులుగా దీనినే వాడుతున్నారు. అయితే తాటిబెల్లం తెలంగాణ ప్రాంతంలో దొరకడం అంతంత మాత్రమే. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా తమిళనాడు నుంచి తయారీదారులు ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కిలో రూ.240 నుంచి రూ.450 వరకు అమ్ముతున్నారు. ఎక్కువ కాలం నిల్వ చేసుకున్నా.. పాడవ్వకపోవడం తాటిబెల్లం ప్రత్యేకత.

కిలోకు రూ.240 నుంచి 450..
సాధారణ బెల్లం కిలో రూ.60 నుంచి రూ.70కి మించదు. కానీ తాటిబెల్లం ధర సాధారణ బెల్లానికి దాదాపు మూడు రెట్లు అధికంగా ఉంటుంది. తాటి బెల్లానికి ఔషధ గుణాలు మెండుగా ఉండడంతో పాటు డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా లేకపోవడమూ అధిక ధరకు కారణం. తాజాగా తాటిచెట్ల నుంచి సేకరించిన తాటినీరాను సేకరిస్తారు. తాటిబెల్లం తయారు చేయాలంటే.. నీరా ఎట్టి పరిస్థితుల్లోనూ పులవదు. అందుకుని నీరాను సేకరించేందుకు ప్రత్యేకమైన పాత్రను సున్నంతో పూత పూస్తారు. ఇలా సున్నాన్ని పూయడం వల్ల తాటి నీరా పులియకుండా తాజాగా ఉంటుంది. అలా సేకరించిన నీరాను 25 గేజ్ గల కడాయిలో పోసి వేడి చేస్తారు. అలా రెండుమూడు పొంగులు వచ్చేవరకు దాన్ని మరుగబెడుతారు. అనంతరం చల్లార్చి వడబోస్తారు. అందులో పీహెచ్‌ను 7.5 శాతానికి తగ్గేలా చేస్తారు.

మళ్లీ పొయ్యిపై పెట్టి నీరాను మరుగబెడుతారు. ఆ సమయంలో నీరాపై వచ్చే తెట్టును ఎప్పటికప్పుడు తీసేస్తారు. ఫలితంగా బెల్లంలో సున్నం శాతం తగ్గుతుంది. నీరాను అలా రెండు నుంచి మూడు గంటల పాటు బాగా మరిగిస్తే.. చిక్కగా బెల్లం పాకంలా మారుతుంది. మధ్యమధ్యలో రెండు మూడు చుక్కల నీరా పాకాన్ని చల్లని నీటిలో వేసి.. బెల్లంలా మారేందుకు పాకం సిద్ధమైందో లేదో తెలుసుకోవచ్చు. పాకం అయిందని నిర్ధారణకు రాగానే.. అప్పటికే సిద్ధం చేసుకున్న బాక్సుల్లో పోసీ మనకు కావాల్సిన పరిమాణం, ఆకృతిలో తాటిబెల్లాన్ని తయారు చేస్తారు. మొత్తంగా మూడు రోజుల్లో తాటిబెల్లం అందుబాటులోకి వస్తుంది.

తమిళనాడు నుంచి..
ఇక్కడ ఉన్న డిమాండ్ దృష్ట్యా తమిళనాడు రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి తాటిబెల్లం తరలివస్తున్నది. తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాకు చెందిన తయారీదారులు తాటిబెల్లాన్ని నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అక్కడ తయారు చేసే తాటి, అల్లం బెల్లాన్ని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగి విక్రయిస్తున్నారు. ఏటా సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ఇక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు తయారీదారులు కలిసి వాహనాల్లో 500 కేజీల వరకు తాటిబెల్లాన్ని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. నగరంలోని చేవెళ్ల- హైదరాబాద్ ప్రధాన రహదారిపై చిలుకూరు, మృగవని, అప్పా జంక్షన్, ఆర్మీ మైసమ్మ, ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాంతంలో రోడ్డుకిరువైపులా విక్రయాలు జరుపుతున్నారు. మెహిదీపట్నం నుంచి లింగంపల్లి మార్గంలో హైటెక్‌సిటీ నుంచి హెచ్‌సీయూ, గచ్చిబౌలి, లింగంపల్లి వరకు రోడ్లు వెంట అక్కడక్కడ బుట్టల్లో తాటిబెల్లాన్ని విక్రయిస్తున్నారు.

ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు..
తాటిబెల్లాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. నీరు తగలనంత వరకు ఏ దశలోనూ చెడిపోదు. కేవలం స్వచ్ఛమైన తాటి నీరా నుంచి తయారుచేయడం, తయారీలో ఎలాంటి రసాయనాలు ఉపయోగించకపోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునైనా వాడుకోవచ్చు. తెలంగాణ ప్రాంతంలో తాటిబెల్లం అరుదుగా దొరుకుతున్న నేపథ్యంలో తమిళనాడు నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. తాటిబెల్లాన్ని బాక్సుల(ఒక్కో వెదురుబుట్టలో 10 కేజీల చొప్పున) రూపంలో తీసుకొచ్చి అమ్ముతున్నారు. కొనుగోలుదారులు అరకేజీ నుంచి పది కేజీల వరకు తీసుకెళ్తున్నారు. ఇందులోనూ మూడు నాలుగు రకాలుగా అందుబాటులో ఉంది. కొత్త తాటి బెల్లానికి కిలో రూ.240 ఉండగా, పాత బెల్లానికి రూ.450 వరకు విక్రయిస్తుండడం గమనార్హం. తాటిబెల్లంతో పాటు అల్లంతో తయారు చేసిన బెల్లాన్ని అక్కడక్కడ విక్రయిస్తున్నారు.

5219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles