8వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాల తొలగింపు

Sat,September 14, 2019 08:39 AM

Over 8,000 tonnes of trash cleared on Friday

గణేశ్ నిమజ్జనం సందర్భంగా నగరంలో శుక్రవారం 8000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రకటించారు. రోజుకు దాదాపు నాలుగున్నరవేల టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, నిమజ్జనం సందర్భంగా 8000 టన్నులకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. 12వ తేదీ ఉదయం తుది నిమజ్జన ఘట్టం ప్రారంభమైన అనంతరం నుంచి 13వ తేదీ ఉదయం వరకు నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి 8000మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరించి 17ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు తరలించినట్లు చెప్పారు.

గ్రేటర్ పరిధిలో 391కిలోమీటర్లమేర శోభాయాత్ర నిర్వహించగా, ఆయా మార్గాల్లో వ్యర్థాల తొలగింపునకు జీహెచ్‌ఎంసీ 9849మంది పారిశుధ్య కార్మికులను నియమించింది. ప్రధానంగా ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్, బషీర్‌బాగ్ తదితర మార్గాల్లో జరిగిన గణేశ్ నిమజ్జనానికి వేలాదిమంది ప్రజలు తరలిరావడమే కాకుండా గణేశ్ మండపాల నుంచి వెలువడిన పత్రి, పూలు, ఇతర వ్యర్థాలతో అదనపు చెత్త ఏర్పడింది. వ్యర్థాలను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా నియమించిన 194గణేశ్ యాక్షన్ టీమ్‌లు విశేషంగా కృషిచేశాయి.

నిమజ్జనం సందర్భంగా ఎదురయ్యే సమస్యలను డయల్ 100, మై జీహెచ్‌ఎంసీ యాప్, జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్లు తదితర మాద్యమాలను ఏర్పాటుచేయగా, వాటిద్వారా అతి తక్కువ ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన ఎన్‌టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో దుర్వాసన లేకుండా పోయిందన్నారు. ప్రమాదాలు జరుగకుండా ఏర్పాటుచేసిన బారికేడింగ్ ఎంతో ఉపయోగపడినట్లు, అంతేకాకుండా ప్రత్యేక బోట్‌లను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.

కొలనుల్లో అధికసంఖ్యలో నిమజ్జనం

గ్రేటర్‌లో హుస్సేన్‌సాగర్‌సహా 35ప్రాంతాల్లో జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంగా 55 వేలకుపైగా విగ్రహాలు నిమజ్జనం అయినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా 23 నిమజ్జన కొలనుల్లో 20వేలకుపైగా విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా నెక్నాంపూర్, దుర్గంచెరువు, మల్కంచెరువు, రాజేంద్రనగర్ పత్తికుంట, కూకట్‌పల్లి రంగదామునిచెరువు, కుత్బుల్లాపూర్ లింగంచెరువు, అల్వాల్ కొత్తచెరువు తదితరవాటిలో అధికసంఖ్యలో విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు తెలిపారు. బతుకమ్మ నిమజ్జనానికి కూడా వీటినే వినియోగిస్తామని కమిషనర్ చెప్పారు. నిమజ్జన ఘట్టం ముగిసిన అనంతరం ఈ కొలనులు దోమల ఆవాసాలుగా మారకుండా గంబూసియా చేపలను వదలడం, లార్వా నివారణ మందును వేయడం తదితర చర్యలు తీసుకుంటామని వివరించారు.

రెండు లక్షల మొక్కల పంపిణీ

గణేశ్ నిమజ్జనం సందర్భంగా నగరంలోని పలు గణేశ్ మండపాల వద్ద జీహెచ్‌ఎంసీ ఉచితంగా దాదాపు రెండు లక్షల మొక్కలను పంపిణీచేసింది. ప్రధానంగా తులసితోపాటు పూల మొక్కలను పంపిణీచేశారు. మరోవైపు, నిమజ్జన వేడుకల సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు భక్తుల సౌకర్యార్థం విశేషంగా సేవలు అందించాయి. మంచినీటి సౌకర్యం కల్పించడంతోపాటు అన్నదానాలను ఏర్పాటుచేశారు. ప్లాస్టిక్ తయారీదారుల సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా టీషర్టుల పంపిణీ జరిగింది.

561
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles