ఆశించిన ఫలితమివ్వని ఆపరేషన్ భరత్‌పూర్!

Mon,December 31, 2018 06:44 AM

Operation bharathpur has not given much results for telangana police

హైదరాబాద్: ఓఎల్‌ఎక్స్ సైబర్ చీటర్లను పట్టుకోవడానికి పకడ్బందీ వ్యూహంతో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు వెళ్లిన హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయారు. ఆపరేషన్ భరత్‌పూర్‌కు రాజస్థాన్ పోలీసులు సహకరించకపోవడంతో ఆశించిన ఫలితం రాక హైదరాబాద్ పోలీసులు ఇద్దరు నిందితులను మాత్రమే పట్టుకొని తిరిగి వచ్చారు. హైదరాబాద్ పోలీసులు భరత్‌పూర్‌కు వచ్చేశారనే విషయాన్ని ముందే సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అక్కడి పోలీసుల ద్వారా లీక్ అయ్యింది.

రాజస్థాన్ పోలీసుల సహకారం లేకున్నా.. సొంతంగానే సైబర్ నేరగాళ్లను పట్టుకోవాలనే హైదరాబాద్ పోలీసుల వ్యూహం దీంతో బెడిసి కొట్టింది. తమ వ్యూహం ప్రకారం సైబర్‌క్రైమ్ పోలీసులు భరత్‌పూర్ ప్రాంతంలోని ఆయా గ్రామాల్లో సైబర్ నిందితుల కోసం గాలింపు చేపట్టడంతో అప్పటికే ఆ గ్రామాల్లో ఉండే సైబర్ నేరగాళ్లు ఆ ఊర్ల నుంచి వేరే ప్రాంతాలకు పరారయ్యారు. పక్కనే సరిహద్దులో ఉండే హరియాణా రాష్ట్రంలోకి పరారైన ఈ సైబర్ నేరగాళ్లు యథేచ్ఛగా అక్కడి నుంచి కూడా అమాయకులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారం రోజులపాటు అక్కడే గాలింపు చేపట్టిన హైదరాబాద్ పోలీసులకు కనువర్ పౌల్, మహవీర్ అనే ఇద్దరు సైబర్ నేరగాళ్లు చిక్కారు. హైదరాబాద్ పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్నంత వరకు సైబర్ నేరగాళ్లు ఆ గ్రామాల వైపు చూడకపోవడంతో హైదరాబాద్ పోలీసులు వెనుతిరిగి వచ్చారు.

సహకరించని రాజస్థాన్ పోలీస్..!
ఓఎల్‌ఎక్స్‌లో ఆర్మీ అధికారులుగా నమ్మించి వస్తువులను విక్రయిస్తామంటూ నమ్మిస్తూ వందల సంఖ్యలో భరత్‌పూర్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. ఆరు నెలల కాలంలో ట్రై కమిషనరేట్ల పరిధిలో 500లకు పైగా ఇలాంటి మోసాలు జరిగాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు 30 మంది బృందంతో ప్రత్యేక కార్యాచరణతో వారం క్రితం సైబర్ నేరస్తులను పట్టుకోవడం కోసం నగరం నుంచి బయలు దేరారు. బృందాలుగా విడిపోయి సైబర్ నేరగాళ్లను పట్టుకోవాలని, అవసరమైతే దేనికైనా సిద్ధంగా ఉండాలనే ప్రణాళికలతో వెళ్లారు. అయితే పోలీసులు అనుకున్న ప్లాన్ ప్రకారం వెళ్లినా.. అక్కడ ఇటీవలే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గతంలో బీజేపీ ప్రభుత్వం ఉండగా, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకున్నది. కొత్త ప్రభుత్వం వ్యూహం ఎలా ఉంటుందనే విషయంలో అక్కడి పోలీసులకు స్పష్టత లేదు.

దీంతో అక్కడి పోలీసులు కూడా మన పోలీసులకు పూర్తిగా సహకరించలేదని తెలుస్తున్నది. మన రాష్ట్ర ఉన్నతాధికారులు, ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడి అంతా పర్యవేక్షించారు. ఎస్పీ పైస్థాయి అధికారుల నుంచి పూర్తిస్థాయిలో సహకరించినా, అదనపు ఎస్పీ స్థాయి నుంచి కింది అధికారుల వరకు మాత్రం సహకారం అందలేదు. అక్కడికి వెళ్లిన మన పోలీసులకు క్షేత్ర స్థాయిలో సహకరించాల్సింది కిందిస్థాయి అధికారులే.. ఈ అధికారులే చేతులెత్తేశారు.

అక్కడ ఏదైనా సమస్య ఎదురైతే తమకు ఇబ్బందిగా మారుతుందని, ఈ సమయంలో మేం ఏమి చేయలేమంటూ కూడా కొందరు అధికారులు చెప్పినట్లు తెలిసింది. అయితే సైబర్‌చీటర్లు ఎక్కువగా ఉండే భరత్‌పూర్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే కూడా హైదరాబాద్ పోలీసులతో మాట్లాడినట్లు తెలుస్తున్నది. అయితే తాము వచ్చిన పనిని మధ్యలో ఆపేసి వెళ్లే ప్రసక్తే లేదని, తమ కేసులో నిందితులైన వారిని పట్టుకునే వెళ్తామని సైబర్‌క్రైమ్ పోలీసులు అక్కడ ఎమ్మెల్యే, స్థానిక పోలీసులకు తేల్చి చెప్పారు. అయితే హైదరాబాద్ పోలీసులు అక్కడే భీస్మించి ఉండడంతో ఆయా గ్రామాల నుంచి జంప్ అయిన, సైబర్‌నేరగాళ్లు ఇతర ప్రాంతాల్లో ఉండే వారి బంధువుల వద్ద తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసుల సహకారం లేకపోవడం, సమాచారం లీక్ కావడంతో అనుకున్న మేర లక్ష్యాన్ని ఈసారి సాధించలేకపోయామని అక్కడకు వెళ్లిన బృందంలోని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

1206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles