కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి

Sat,November 9, 2019 08:53 AM

మలక్‌పేట: మలక్‌పేట వ్యవసాయ మార్కెట్ ఉల్లిగడ్డ దిగుమతులతో కళకళలాడుతుంది. రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ర్టాల్లో ఏర్పడ్డ అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో ఉల్లిధరలు మళ్లీ కొండెక్కాయి. దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో ఉల్లి పంటను సాగుచేసే మహారాష్ట్రలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు బాగా దెబ్బతినడంతో ఉల్లి కొరత తీవ్రంగా ఏర్పడింది.


మహారాష్ట్రలో ఏర్పడ్డ పరిస్థితులతో దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు బాగా పెరిగాయి. కోస్తేనే కన్నీళ్లు తెప్పించే ఉల్లి, కోయకుండానే వినియోగదారులను కంటతడి పెట్టిస్తుంది. దేశ రాజధానితోపాటు ప్రముఖ నగరాల్లో రిటైల్ దుకాణాల్లో ఉల్లిగడ్డ కిలో ఒక్కంటికి రూ.80 ధర పలుకుతుండగా, మిగతా ప్రాంతాల్లో కూడా మధ్యరకం ఉల్లిగడ్డను రూ.50-60కి అమ్ముతున్నారు. రాష్ట్రంలో ఆ ప్రభావం ఏమిలేనప్పటికీ, ఇక్కడ కూడా ఉల్లిగడ్డ ధరలు బాగానే పలుకుతున్నాయి. మేలు రకం ఉల్లిగడ్డను రిటైల్ దుకాణాల్లో రూ.60-70 వరకు అమ్ముతుండగా, రెండోరకం ఉల్లిగడ్డను రూ.40కి అమ్ముతున్నారు. గత మూడు నెలలుగా ఉల్లిధరలు నెలనెలా పెరుగుతూ రావటంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మలక్‌పేట మార్కెట్‌లో మేలురకం(మోడల్ రకం) ఉల్లిగడ్డ హోల్‌సేల్‌గా కిలోకు రూ.50 ధర పలుకుతుండగా, రిటైల్ దుకాణాల్లో ఈ రకం ఉల్లిగడ్డను రూ.60-70లకు అమ్ముతున్నారు.

శుక్రవారం మలక్‌పేట మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి 8 లారీలు(1600 బస్తాలు), కర్ణాటక నుంచి 34 లారీలు (6800 బస్తాలు), ఏపీ(కర్నూలు) నుంచి 28 లారీలు(5600 బస్తాలు), తెలంగాణ(మహబూబ్‌నగర్) నుంచి 32 లారీలు (6400 బస్తాలు), మొత్తంగా శుక్రవారం మార్కెట్‌కు 20,400 బస్తాల ఉల్లిగడ్డ వచ్చింది. మేలురకం(మహారాష్ట్ర ఉల్లి) ఉల్లిగడ్డ క్వింటాల్‌కు రూ.5000 ధర పలుకగా, మధ్యరకం గరిష్టంగా రూ.3400, నాసీరకం కనిష్టంగా రూ.2500 ధర పలికాయి. ఉల్లిధరలు కొండెక్కుతుండటంతో రైతులు సంతోషాన్ని వ్యక్తంచేస్తుండగా, వినియోగదారులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు.

జంటనగరాలకు రోజుకు 20వేల బస్తాలు అవసరం

జంటనగరాల ప్రజల రోజువారీ అవసరాలు తీర్చేందుకు నిత్యం 20వేల బస్తాల ఉల్లిగడ్డ అవసరం పడుతుండగా, మహారాష్ట్ర నుంచి 10శాతం, కర్ణాటక నుంచి 30శాతం, తెలంగాణ, ఏపీ రాష్ర్టాల నుంచి 60శాతం చొప్పున మలక్‌పేట మార్కెట్‌కు ఉల్లిగడ్డ దిగుమతి అవుతుంది. అయితే సీజన్‌లో 60 వేల బస్తాలు దిగుమతి అయ్యే ఉల్లిగడ్డ ప్రస్తుతం 20వేల నుంచి 25 వేల వరకు దిగుమతి అవుతుంది. గతేడాది ఆగస్టులో మలక్‌పేట మార్కెట్‌కు 3,16,610 క్వింటాళ్ల ఉల్లిగడ్డ రాగా, ఈ ఏడాది 1,98,338 క్వింటాళ్ల ఉల్లిగడ్డ మార్కెట్‌కు దిగుమతి అయింది.

మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఏర్పడ్డ అతివృష్టి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఏర్పడ్డ అనావృష్టితో ఈ ఏడాది ఆగస్టులో 1,18,272 క్వింటాళ్ల ఉల్లి దిగుమతులు తగ్గటంతో ఉల్లిధరలకు రెక్కలొచ్చాయి. గతేడాది ఆగస్టులో మేలురకం ఉల్లిగడ్డ ధర క్వింటాలుకు రూ.1500 ధర పలుకగా, నాసీరకం ఉల్లి ధర రూ.800, మోడల్ రకం ఉల్లిధర రూ.1200 ఉండగా, ఈ ఏడాది ఆగస్టులో మేలురకం ఉల్లి రూ.3000 ధర పలుకగా, నాసీరకం రూ.1800, మోడల్ రకం రూ.2300లు ధర పలికింది.

గతేడాదితో పోలిస్తే ధరలు రెట్టింపు

గతేడాది నవంబర్‌లో మేలురకం ఉల్లిగడ్డ మలక్‌పేట మార్కెట్‌లో హోల్‌సేల్‌గా క్వింటాలుకు రూ.2200, మధ్యరకం రూ1800, నాసీరకం ఉల్లి రూ.1600 పలుకగా, ఈ ఏడాది నవంబర్‌లో మేలు రకం ఉల్లిగడ్డ హోల్‌సేల్‌గా క్వింటాలుకు రూ. 5000 ధర పలుకుతుండగా, మధ్యరకం రూ.3400, నాసీరకం 2500 ధర పలుకుతున్నాయి.

ధరల ప్రభావం రాష్ట్రంపై పడే అవకాశాలు లేవు

దేశంలో ఉల్లిధరలు పెరిగినా ఆ ప్రభావం రాష్ట్రంపై పడే అవకాశాలు తక్కువని మలక్‌పేట మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి వెంకటేశం తెలిపారు. మహారాష్ట్రలో ఉల్లిపంటలు బాగా దెబ్బతిన్న మాట వాస్తవమని, దేశంలోని ప్రధాన నగరాల్లో మేలురకం ఉల్లిధరలు కిలో ఒక్కంటికి రూ.70-80 పలుకుతున్న మాట కూడా వాస్తవమేనన్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతులు గణనీయంగా తగ్గినప్పటికీ, కర్ణాటక, ఏపీ నుంచి దిగుమతి ఎక్కువగానే అవుతాయని, వాటితోపాటు రాష్ట్రంలో పండించిన ఉల్లిగడ్డ కూడా మార్కెట్‌కు వస్తున్నందున ఉల్లిధరలు పెరిగే అవకాశాలు లేవు. కానీ గతేడాదితో పోలిస్తే ఈ సారి ఉల్లిధరలు రెట్టింపుగానే ఉన్నాయి.
- వెంకటేశం, మలక్‌పేట మార్కెట్, ఉన్నతశ్రేణి కార్యదర్శి

1207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles