ఆర్‌టీవో ఆఫీసుకు రాకుండానే లైసెన్సు

Wed,August 14, 2019 09:11 AM

now you will get Driving Licence without going to rto office in hyderabad

హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సేవలందించడంలో విప్లవాత్మక మార్పులకు ఇప్పటికే శ్రీకారం చుట్టిన రాష్ట్ర రవాణాశాఖ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నది. వినియోగదారుడు ఎక్కడినుంచైనా సేవలు పొందేలా సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపకల్పన చేస్తున్నది. లైసెన్సులు మొదలుకొని ప్రస్తుతం రవాణాశాఖ అందించే ముఖ్యమైన సేవలను వినియోగదారుడు కార్యాలయానికి రాకుండానే పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 32 సేవలను ఆన్‌లైన్ ద్వారా అందించాలని భావిస్తున్నప్పటికీ సాధ్యమైనన్ని సేవలను అతి త్వరలో అందుబాటులోకి తెస్తున్నారు. వీటిలో లైసెన్సు రెన్యూవల్, హైపోథికేషన్ టర్మినేషన్, వాహన రిజిస్ట్రేషన్లు, వాహన యాజమాన్య బదిలీ, టూర్ పర్మిట్ల వంటి ముఖ్యమైన అంశాలను దీని పరిధిలోకి తీసుకువస్తున్నారు. దీనికి సంబంధించి రవాణాశాఖ ఐటీ విభాగం కసరత్తు చేస్తున్నది.

దాదాపు ఇప్పటికే తుది దశకు తెచ్చినప్పటికీ ఎటువంటి లీకేజీకి తావులేకుండా పారదర్శకంగా సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో దీన్ని పటిష్టంగా తయారుచేస్తున్నారు. ఇటీవల పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో వాహన డీలర్లు లైఫ్‌ట్యాక్స్‌ను కాజేసిన అంశాన్ని దృష్టిలో ఉంచుకుని అటువంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన దస్త్రం విధివిధానాలను రవాణాశాఖ ఐటీ విభాగం ప్రభుత్వ పరిశీలనకు పంపింది. సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సాఫ్ట్‌వేర్ తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. వినియోగదారుల రద్దీని నివారించడంతోపాటు ఎక్కడ ఉన్నా కావాల్సిన రవాణా సేవలను పొందేలా రూపకల్పన చేస్తున్నారు.

అయితే రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు తదితర అంశాలకు సంబంధించి పన్నులు, ఫీజులు ముందు చెల్లించిన తర్వాతే సేవలందేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో కూడిన సేవలందేలా ప్రణాళిక రూపొందించి అమలు పరుచనున్నారు. ఇప్పటికే ఆర్‌టీ ఎం వ్యాలెట్ వంటి ఆవిష్కరణలతో యావత్ దేశంలోని రవాణా రంగాన్ని ప్రభావితం చేసిన తెలంగాణ రవాణాశాఖ మరోసారి అన్ని రాష్ర్టాలను ఆకర్షించనుంది.

స్లాట్‌బుకింగ్, ఫొటో అప్‌లోడ్ అంతా ఆన్‌లైన్‌లోనే..

వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు రెన్యూవల్ చేసుకోవాలనుకున్న వ్యక్తి తనకు సంబంధించిన పాత రవాణాశాఖ డాక్యుమెంట్ లేదా స్మార్ట్‌కార్డును అప్‌లోడ్ చేస్తే చాలు రెన్యూవల్ అయిపోతుంది. గతంలో పొందిన ఆర్‌సీ లేదా లైసెన్సు, రవాణాశాఖలో ఉన్న వివరాల ఆధారంగా సేవలు అందుతాయి. అయితే ఈ సేవలు పొందే సమయంలో సెల్ఫీ తీసుకుని ఫొటో పంపాల్సి ఉంటుంది. కొత్తగా లైసెన్సులు కావాలనుకున్నవారికి ఇది వర్తించదు. వీరు నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుతమున్న విధానంలోనే లైసెన్సు పొందాల్సి ఉంటుంది. లెర్నింగ్ లైసెన్స్ పొందడానికి కావాల్సిన పరీక్ష రాసి లెర్నింగ్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. నెల రోజుల తర్వాత ఆరు నెలలలోపు డ్రైవింగ్ టెస్ట్‌లో పాసై శాశ్వత లైసెన్సు పొందాల్సి ఉంటుంది.

వాహనదారుల కోసమే: డీటీఓ పాపారావు

వాహనదారుల ప్రయోజనం కాంక్షించే ఈ విధానం అమల్లోకి తెస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్, ఐటీ డీటీసీ కె.పాపారావు తెలిపారు. డెస్క్‌టాప్ లేదా మొబైల్ ద్వారా సేవలు సులభంగా పొందే వీలుంటుందని అన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు, సాఫ్ట్‌వేర్‌పై వర్క్ జరుగుతున్నదని చెప్పారు. ప్రభుత్వం కూడా పరిశీలించిన తర్వాత అమల్లోకి వస్తుందని చెప్పారు. అయితే గతంలో జరిగిన ఘటనలు, పక్క రాష్ట్రంలో జరిగిన అవినీతిని పరిగణలోకి తీసుకుని అటువంటి వాటికి ఆస్కారం లేకుండా పకడ్బందీ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు. సర్వర్ సామర్ధ్యాన్ని కూడా పెంచుతున్నట్లు పేర్కొన్నారు.

4848
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles