హారన్ మించితే..కేసులే

Mon,July 22, 2019 08:42 AM

Now you will be fined to blow unnecessary horn in many places of  hyderabad

ఇష్టారాజ్యంగా హారన్ మోగిస్తే.. ఇక కటకటాలపాలు కావాల్సిందే.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 654 మంది వాహనదారులపై కేసులను నమోదు చేశారు. కాగా అధిక శబ్దంతో హారన్ మోగించే వాహనదారుల ఫొటోలు, వీడియోలను 9490617444 నంబర్ వాట్సాప్‌కు పంపితే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు.

రోడ్లపై శబ్ద కాలుష్యాన్ని సృష్టించడంతోపాటు ఇతర వాహనదారులు, పాదచారులను గందరగోళానికి గురిచేస్తూ పెద్దపెద్ద శబ్దాల హారన్‌లతో కలవర పెడుతున్న వాహనదారులపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 654 మంది వాహనదారులపై ఎంవీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 125 మంది వాహనదారులు ఎయిర్ హారన్‌లు, 424 మంది మల్టీటోన్డ్ హారన్‌లు, 105 మంది వాహనదారులు భారీ శబ్దాలతో కూడిన హారన్‌లు వాడుతున్నారని నిర్ధారించి వాటిని ఉపయోగిస్తున్న వాహనదారులపై కేసులు బుక్ చేశారు. స్కూల్, కాలేజీ, లారీలు, డీసీఎం, భారీ వాహనాలతోపాటు ఆర్టీసీ బస్సులు, వాహనాల యజమానులు నిషేధిత హారన్‌లను వాడరాదని వారు హెచ్చరిస్తున్నారు.

శబ్ద కాలుష్యం సృష్టించి హంగామా చేసే వాహనదారుల ఫొటోలు, వీడియోలను స్థానికులు తీసి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు లేదా సైబరాబాద్ వాట్సాప్ 9490617444కు పంపితే వారిపై చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ అధికారులు హామీ ఇస్తున్నారు. ఇలాంటి హారన్‌ల వాడకం ద్వారా వాహనదారులతోపాటు పాదచారులు కూడా గందరగోళానికి గురై ప్రమాదాల బారిన పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిషేధిత హారన్‌లు, సైలన్సర్‌లను ఏర్పాటు చేసుకుని రోడ్లపై హల్‌చల్ చేసే వారిని వదిలిపెట్టమని సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేశారు. ఏ వాహనం శబ్దం 55 డెసిబుల్స్ దాటొద్దని నిబంధనలు సూచిస్తున్నాయి. ట్రాఫిక్ అధికారులు వివరిస్తున్నారు.

852
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles