మధ్యతరగతి కుటుంబాలకు గాలం...

Mon,December 24, 2018 07:07 AM

multi-level network marketing fraud attracting to middle class people

హైదరాబాద్ : మధ్య తరగతి కుటుంబాల కలలను సాకా రం చేస్తామని ... మాయమాటలతో గాలం వేసేందుకు ప్రయత్నించే మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్‌లపై కఠినంగా వ్యవహరించాలని రాచకొండ క్రైం విభాగం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఈ స్కీమ్‌లను బట్టబయలు చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. పోలీసుల ప్రయత్నానికి ప్రజల భాగస్వామ్యం కూడా తోడవుతే మధ్య తరగతివారి నడ్డి విరుస్తున్న మోసగాళ్ల చీటింగ్‌కు బ్రేక్ వేస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఇలాంటి గొలుసు కట్టు స్కీమ్‌ల్లో చిక్కుకుని చాలా మంది అమాయకులు ఆర్థికంగా చితికి పోతున్నారు.

ఏదో ఒక సందర్భంలో ఆ గొలుసు తెగిపోవాల్సిందే. ఇప్పటికే ఆ స్కీమ్‌ల్లో చేరిక సంఖ్య వందలు దాటి వేలాది నుం చి లక్షలకు చేరుకుంది. లాభపడేది పదుల సంఖ్యలో అయినప్పటికీ... మోసపోయేది మాత్రం వేలాది మంది. ఇది ఎప్పటికైనా ప్రమాదకరమే. ఈ స్కీమ్‌లను నిర్వహించే మాయగాళ్ల మాటలు, ఆఫర్‌లు సాధారణంగా మధ్య తరగతి వారిని ఆకర్షిస్తాయి. అలా చేరిన వారు.. వారికి తెలియకుండానే మరొకరికి ఆశపుట్టించి... వారిని కూడా ఆ గొలుసు కట్టులోకి లాగుతున్నారు. మరికొందరు మోసపోతామని తెలిసి కూడా మన డబ్బు వచ్చే వరకు ఇతరులను చేర్పిస్తే వారి కష్టాలేదో వారు పడుతారులే అన్న ధోరణి లో ఈ స్కీమ్‌ల్లోకి సభ్యులను లాగుతున్నారు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం, ఇటీవల రియల్ భూమ్ పెరగడంతో గొలుసుకట్టు స్కీమ్‌ల వారు ఇక్కడి వారిని టార్గెట్ చేశారు. దీంతో ప్రజలను అప్రమత్తం చేయడా నికి రాచకొండ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ స్కీమ్‌లపై నిఘా పెట్టారు. ఆధారాల సేకరణ, వాటి చట్టబద్ధత పై సమీక్షించుకొని త్వరలోనే గొలుసుకట్టు భాగోతాలను బయటపెట్టనున్నారు. ప్రజలు కూడా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గొలుసుకట్టు మోసాలపై వాట్సాప్ నెం.9490617111కు సమాచారం ఇవ్వాలని రాచకొండ సైబర్ క్రైం డీసీపీ నాగరాజు తెలిపారు.

ఇది ఇలా ఉండగా... సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం దేశవ్యాప్తంగా రూ.1200 కోట్ల వరకు మోసం చేసిన ఫ్యూచర్ మేకర్స్ లైఫ్ సంస్థ, రూ.8 కోట్ల వరకు మోసానికి పాల్పడ్డ కరక్కాయ పౌడర్ స్కాం, హెల్తీ వేజ్స్ సంస్థ గొలుసుకట్టు మోసాలను బయటపెట్టి దాదాపు రూ.200 కోట్లకు పైగా నగదును బ్యాంకుల్లో సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ గొలుసుకట్టు స్కీమ్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీటిల్లో చేరవద్దని రాచకొండ పోలీసులు సూచిస్తున్నారు.

2701
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles