నీటి సంరక్షణ కోసం ‘జలం - జీవం’

Sat,January 6, 2018 12:35 PM

Minister KTR participate in ManaNagaram citizen interaction program at Chandanagar

హైదరాబాద్ : మహా నగరంలో నీటి సంరక్షణ కోసం ‘జలం - జీవం’ కార్యక్రమాన్ని చేపడుతామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మియాపూర్‌లోని విశ్వనాథ గార్డెన్స్‌లో మన నగరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. నగర అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే మన నగరం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ వేదిక ద్వారా సమస్యలు, పరిష్కారాలు చేసుకోవచ్చు. ప్రభుత్వ కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. కోటి మంది నివాసముండే నగరంలో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు.

ఇంకుడు గుంతలకు ఆరు నెలల సమయం
జల సంరక్షణ కోసం ‘జలం-జీవం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో కూడా నీటి కష్టాలున్నాయి. నీటి కష్టాలు రావొద్దనే ఉద్దేశంతో.. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ చట్టం చేసింది. దీనిపై నిబంధనలు కూడా వచ్చాయి. కానీ ఎవరూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం లేదు. 300 స్కేర్ మీటర్ల స్థలంలో, ఆపైన నిర్మాణాలు చేపడితే ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఈ ఉత్తర్వులు అమలు కావడం లేదన్నారు. హైదరాబాద్ నగరంలో నిర్మాణాలు వేల సంఖ్యలో ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతలు వందల సంఖ్యలో కూడా లేవని మంత్రి స్పష్టం చేశారు. ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే 6 నెలల సమయంలో ఇంకుడు గుంతలు నిర్మించాలని కోరారు. ఆరు నెలల్లోపు ఇంకుడు గుంతలు పూర్తి కాకపోతే.. ఇంటి యజమాని, సంబంధిత అధికారిపై జరిమానా విధిస్తూ.. వారిద్దరిని బాధ్యులను చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ, ప్రజల సహకారంతో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకుడు గుంతల విషయంలో ప్రజలను చైతన్యపరచడానికి జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణాన్ని యుద్ధప్రతిపాదికన చేపట్టాలని ఆదేశించారు. వీటి నిర్మాణానికి పటిష్ట కార్యాచరణ చేపట్టాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలిచ్చారు.

నీటి కొరత ప్రపంచ వ్యాప్తంగా ఉంది
నీటి కొరత అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒక నగరానికో.. దేశానికో పరిమితం కాలేదన్నారు. భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌తో పాటు పలు రాష్ర్టాల్లో నీటి కొరత ఉందని చెప్పారు. హైదరాబాద్ నగరానికి కృష్ణా, గోదావరి బేసిన్‌తో పాటు మంజీరా, గండీపేట నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నామని గుర్తు చేశారు కేటీఆర్. మహారాష్ట్రలో లాతూర్ అనే ఒక పట్టణం ఉంది. ఒకప్పుడు భూకంపం కూడా వచ్చింది. అక్కడ మొన్న మంచినీటి సమస్య తీవ్రంగా వచ్చింది. అక్కడ నీటి లభ్యత లేని పరిస్థితి. కేంద్ర, మహరాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రత్యేక రైళ్లలో నీళ్లు తెప్పించిన పరిస్థితి ఉండే. మనకు అలాంటి పరిస్థితి లేదు.

హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నాం
గతంలో హైదరాబాద్ జనాభా 15 నుంచి 20 శాతం ఉన్నది. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 30 శాతం ఉందని తెలిపారు. హైదరాబాద్ జనాభాతో పాటు వచ్చిపోయే వారితో కలిపి మొత్తం కోటి 25 లక్షల జనాభా ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్‌ను అభివృద్ది చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వల్ల మంచినీటి సమస్యను పరిష్కరించగలిగామని తెలిపారు. గతంలో ఎండకాలం వచ్చిందంటే ఒకటి ఖాళీ కుండలు, బిందెల ప్రదర్శన జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరొకటి విద్యుత్ కోతలు. విద్యుత్ కోతలు ఇప్పుడు లేనే లేవు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. మంచినీటి సరఫరా మెరుగైనప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. రూ. 2 వేల కోట్ల నిధులతో మంచినీటి కార్యక్రమం చేస్తున్నాం. రూ. 3,100 కోట్లతో నగర శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను రాబోయే సంవత్సర కాలంలో చేపట్టబోతున్నామని తెలిపారు. పారిశుద్ధ్యం విషయంలో సీఎం కేసీఆర్ స్వయంగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించారని కేటీఆర్ గుర్తు చేశారు.

2169
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles