ద్రోహాలను ఒప్పుకుని టీడీపీ ప్రచారానికి రావాలి: హరీశ్‌రావు

Thu,November 8, 2018 12:38 PM

minister harish rao letter to andhra pradesh cm chandrababu

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే విషయంలో తెలంగాణ ప్రజలకు అభ్యంతరాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు నర నరానా తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆయనలో వ్యతిరేకత ఉంది. ఆయన తెలంగాణ ఉద్యమాన్ని సహించలేదు. తెలంగాణ పదం అంటే గిట్టనటువంటి వాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావద్దని బలంగా కోరుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. గతంలో కేంద్రంలో బీజేపీ కలిసి ఉన్ననాడు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మలిదశ ఉద్యమంలో కూడా చివరి నిమిషం దాకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగకుండా తన చివరి ప్రయత్నం కూడా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్ని విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలిసిందే.

రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కూడా దీన్ని ఒక విఫల రాష్ట్రంగా చేయాలని సర్వ శక్తులు ఒడ్డినటువంటి వ్యక్తి చంద్రబాబు అన్న విషయం రాష్ట్ర ప్రజలుకు తెలుసు. తెలంగాణ ఒక రాష్ట్రంగా మనుగడ సాగించడం కూడా ఇష్టం లేనటువంటి వ్యక్తి చంద్రబాబు. చివరికి ఆయన తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా రాజకీయ అస్థిరత సృష్టించడానికి యత్నించాడు. తెలంగాణ ప్రాంతం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణ మనుగడ కొనసాగించడం పట్ల నర నరానా వ్యతిరేకతను పెంచుకున్న చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఈ రోజు తెలంగాణలో పోటీ చేయడం పట్ల తెలంగాణ ప్రజలకు చాలా తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. ఇక్కడ మీరేదో నాలుగు సీట్లు గెలిచి, రాజకీయంగా తమ ఉనికిని చాటుకోవడం ద్వారా మీ ప్రయత్నం ఏం కనబడుతోంది... ఈ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ కొట్టి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఒక దారి దొరుకుతుందనే కుట్ర మీయోక్క పొత్తులో, మీరు పోటీ చేసే విషయంలో ఈ రోజు తెలంగాణ ప్రజలకు కనబడుతోంది.

తెలంగాణ రైతులు కొన్ని దశాబ్ధాల తరబడి సాగునీటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఉద్యమం జరగడం లోనే నీళ్లు, నిధులు, నియామకాలు. ఉద్యమ ట్యాగ్‌లైన్‌లోని మొదటి పదమే నీళ్లు. ఆ నీళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మిస్తోంది. కాని మీరు ఏం జేస్తున్నారు. ప్రతి ప్రాజెక్టుకు కూడా అడ్డుపడుతున్నారు. ఏ ప్రాజెక్టు కూడా ముందుకు సాగొద్దని చెప్పి రకరకాల కుట్రలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి, జల సంఘానికి రివర్ బోర్డులకు రోజుకు ఒక లెటర్ రాస్తూ పంచాయితీలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులు అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసింది చంద్రబాబు. ఊసరవెల్లులు కూడా చంద్రబాబు తీరును చూసి సిగ్గుపడతాయి. చంద్రబాబే అన్నాడు... పాలమూరు జిల్లాను నేను దత్తత తీసుకుంటున్నానని, పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తానని. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పాలమూరు కట్టడం లేదని ధర్నాలు చేసినవు. ఎన్నికల మెనిఫెస్టోలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టి తీరుతామని చెప్పిండు. తీరిగి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అక్రమం అని దీన్ని కట్టొద్దని అన్నది చంద్రబాబే.

ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా. కరెంటు విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లో తెలంగాణకు కరెంటు ఇవ్వక పోతే ఇక్కడ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారని చంద్రబాబుకు తెలుసు. చిమ్మ చీకట్లు ఏర్పడి రైతులకు కరెంటు రాక, ఫ్యాక్టరీలు మూతపడి ఇక్కడి ప్రజలు బాధపడాలనే కుటిల తత్వం చంద్రబాబు లోపల ఉంది. తెలంగాణలో కరెంటు లేదు, పరిశ్రమలన్నీ ఆంధ్రప్రదేశ్‌కు రండి అనేటటువంటి కుట్రతోని విభజన చట్టంలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన కరెంటు ఇవ్వకుండా కూడా చంద్రబాబు కుట్ర చేసిన విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు.

కాని ఈ రోజు సీఎం కేసీఆర్‌గారు అద్భుతంగా మీ కుట్రలను చేధించి ఒక సంవత్సరంలోపల తేరుకుని 24గంటల విద్యుత్ అందించారు. ఈ రోజు కేసీఆర్‌గారి నాయకత్వంలో వెలుగుల తెలంగాణను నిర్మించినం. సీఎం కేసీఆర్ గొప్పతనం, ముందుచూపు, విజన్ వల్ల దేశానికి విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబునాయుడు ప్రాయశ్చితం ప్రకటించకుండా మళ్లీ తెలంగాణలో పోటీ చేయడానికి వస్తున్నాడు. తను చేసినటువంటి ద్రోహాల పట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పలేదు. మేం చేసిన పాపాలను భవిష్యత్‌లో చేయమూ, కేంద్రానికి రాసిన లేఖలను ఉపసంహరించుకుంటునాం, ఆరోపణలను విరమించుకుంటున్నామని తెలుగుదేశం కాని, ఆ పార్టీ అధ్యక్షుడు కాని ఒక్క మాటన్నా చెప్పిండా. అది చెప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మీకు ఓట్లడిగే నైతక హక్కు ఎక్కడిది అని మేము, తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సాగునీటి విషయంలో, కరెంటు విషయంలో హైకోర్టు విభజన విషయంలో హైదరాబాద్‌ని ఆఫీసుల విషయంలోఅడుగడుగునా తెలంగాణ ప్రజలను గోస పెట్టినటువంటి మీరు ఇక్కడ ఎన్నికల్లో పాల్గొనడమనేది తెలంగాణ ప్రజలకు తీవ్ర అభ్యంతరకరం. చంద్రబాబు తెలంగాణకు చేసిన ద్రోహాలు, మోసాలు, మీకు గుర్తున్నాయో లేదో మాకు తెలియదు.

మీతో కలిసి అంటకాగాలని మీతో కలిసి పోటీ చేయాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మీ ద్రోహ చరిత్ర తెలుసుకోవాల్సి అవసరం ఉందో లేదో మాకు తెలియదు. కాని మీలాంటి మేక వన్నిన పులుల విషయంలో ప్రజలను అప్రమత్తంగా ఉంచాల్సిన బాధ్యత స్వరాష్ట్ర ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాప్రతినిధిగా మాపై ఉందని మేం భావిస్తున్నాం. అందుకే మీ ద్రోహ చరిత్రను ఆధారాలతో సహా ఈ రోజు బయటపెడుతున్నాం. ముఖ్యమైనటు వంటి 19 అంశాలను మీ ముందు పెడుతున్నాం. వీటికి జవాబు చెప్పి తెలంగాణలో ప్రచారానికి రావాలని డిమాండ్ చేశారు.

ద్రోహం నెంబర్ 1: నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకునే కుట్రలు చేయడం.


రాష్ట్రంలోనే తేల్చారు. ఆ వాటా ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి, కాళేశ్వరం, సీతారామ, భక్త రామదాసు, తుమ్మిళ్ల తదితర ప్రాజెక్టులను అడ్డుకోవాలని, ఇవి అక్రమ ప్రాజెక్టులని మీరు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జల సంఘానికి లేఖల మీద లేఖలు రాస్తూనే ఉన్నారు. మీది కుట్ర కాదా?

ద్రోహం నెంబర్ 2: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడతామని 2014 ఎన్నికల్లో హామీ ఇవ్వలేదా?


పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు అక్రమమని చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. నేటికీ అదే వాదన చేస్తున్నారు. 2014 తెలంగాణ తెలుగుదేశం పార్టీ మానిఫెస్టోలో పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో మహబూబ్ నగర్ లో జరిగిన ఎన్నికల సభలో సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నాటి ప్రధాని అభ్యర్థి, నేటి ప్రధాని నరేంద్రమోడీ గారు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ కట్టలేకపోయింది, మేము కడతాం అని హామీ ఇచ్చారు. కానీ మీరు పాలమూరు ఎత్తిపోతల పథకం అక్రమమనే వాదన మొదలు పెట్టారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులను అడ్డుకోవాలని లేఖల మీద లేఖలు రాస్తున్నారు.

తేదీ 09.07.2015 న  , తేదీ 08.02.2016న పాలమూరు, డిండి ప్రాజెక్టులను అక్రమ ప్రాజెక్టు అని, దాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి ముఖ్య కార్యదర్శి లేఖలు రాశారు. (అనుబందం -1, అనుబందం -2).

చంద్రబాబు గారు స్వయంగా ఆప్పటి కేంద్ర జలవనరుల మంత్రి శ్రీమతి ఉమాభారతి గారికి తేదీ 24.04.2016 నాడు లేఖ రాశారు. (అనుబందం -3)

11.06.2015 న అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ ద్వారా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శికి లేఖ రాశారు ( అనుబంధం – 4).

11.08.2016 న ఆ రాష్ట్ర సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి కేంద్ర జల సంఘం చైర్మన్ గారికి లేఖ రాశారు (అనుబందం –5). ఈ లేఖల్లో కూడా అపెక్స్ కౌన్సిల్ అనుమతి వచ్చేవరకు ప్రాజెక్టుల పనులు ఆపివేయించమని కోరినారు.

ద్రోహం నెంబర్ 3: కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్మడం మీ దుష్ట ఆలోచన కాదా?


తెలంగాణలోని దాదాపు 70 శాతం వరకు భూభాగానికి సాగునీరు, మంచినీరు అందించే బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. దాదాపు 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు. గోదావరి నదిలో తెలంగాణకున్న 954 టిఎంసిల వాటా నీటిని వాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అక్రమ ప్రాజెక్టేనని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి తేది 19.03.2017న కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి, క్రిష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శికి (అనుబందం– 7) లేఖ రాశారు.

ద్రోహం నెంబర్ 4: పాలేరుకు నీళ్లు ఇవ్వడం కూడా పాపమేనా?


ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం  కూసుమంచి , తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ , నేలకొండపల్లి, ముదిగొండ తదితర కరువు మండలాలలో 60 వేల ఎకరాలకు సాగు నీరు అందించే భక్త రామదాసు ప్రాజెక్టు కూడా అక్రమమేనని మీరు ఆరోపించారు. 01.07.2017న ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సి.డబ్ల్యు.సి.కి లేఖ రాసింది(అనుబందం–8)


ద్రోహం నెంబర్ 5: కేసీ కెనాల్ కోసం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని వద్దంటారా?


రాజోలిబండ పథకం చివరి భూములకు నీరందించడానికి , తుంగభద్ర జలాల్లో  మన వాటా 15.90 టిఎంసిల నీటిని సంపూర్ణంగా వినియోగించుకోవడానికి తెలంగాణా ప్రభుత్వం తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాన్ని అమలు చేయడానికి సంకల్పించింది. ఈ ప్రాజెక్టు వలన కె సి కెనాల్ ప్రయోజనాలు దెబ్బతింటాయని, ప్రాజెక్టు పనులని ఆపాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి తేదీ 07.04.2017 న కె.ఆర్.ఎం.బి. సభ్య కార్యదర్శికి లేఖ రాశారు (అనుబందం – 9).

ద్రోహం నెంబర్ 6: కల్వకూర్తి ఎత్తిపోతల పథకంపై కుట్ర చేస్తున్నది నిజం కాదా?


నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి గతంలో కేటాయించిన 25 టిఎంసిలు సరిపోవని భావించిన తెలంగాణ ప్రభుత్వం 40 టిఎంసిలు కేటాయించింది. ఇది అక్రమమనని తేది 07.11.2017న ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి CWC చైర్మన్ కి,KRMB సభ్య కార్యదర్శికి లేఖలు రాశారు (అనుబందం – 10).

ద్రోహం నెంబర్ 7: పోలవరానికి బదులుగా కృష్ణా నీళ్లు ఇవ్వకుండా నాటకాలు ఆడడం లేదా?


పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు లభించిన మరుక్షం నుంచి నాగార్జున సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు 80 టిఎంసిలు కృష్ణా నది నీళ్ల నుంచి ఇవ్వాలని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది.  దీని ప్రకారం తెలంగాణకు 45 టిఎంసిలు, కర్ణాటకకు 21 టిఎంసిలు, మహారాష్ట్రకు 14టిఎంసిలు రావాలి. కర్ణాటక, మహారాష్ట్రలు వారికి చేసిన కేటాయింపులను వాడుకుంటున్నాయి. కానీ తెలంగాణకు రావాల్సిన 45 టిఎంసిల విషయంలో మీరు కొర్రీ పెట్టారు. అభ్యంతరం చెపుతూ కేంద్రానికి లేఖలు రాశారు తేది 31.01.2017న ఒక లేఖ (అనుబందం -11), తేది 08.02,2017న మరొక లేఖ కేంద్రానికి రాశారు(అనుబందం- 12). దీంతో కృష్ణా నీటిలో తెలంగాణ వాటా పెరగడం లేదు. ఫలితంగా మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు నష్టపోతున్నాయి.

ద్రోహం నెంబర్ 8: శ్రీశైలం నుంచి తెలంగాణకు నీరు ఇవ్వొద్దనడం మీ కుతంత్రం కాదా?


పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుకు నీటి లభ్యత తగ్గిపోతుంది కాబట్టి, కల్వకుర్తి ద్వారా శ్రీశైలం నుంచి తెలంగాణ రాష్ట్రం నీటిని వాడుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తున్నది. శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీరు అందుతుంది కాబట్టి, తెలంగాణ రాష్ట్రం నీటిని వాడుకోకుండా చూడాలని కె.ఆర్.ఎం.బి. సభ్య కార్యదర్శికి తేది 09.10.2018న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది (అనుబంధం 13). కల్వకుర్తి, జడ్చర్ల, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి, అచ్చంపేట నియోజకవర్గాలు నాశనమైపోయినా ఫర్వాలేదు కానీ, ఏ అనుమతీ లేకుండా అక్రమంగా నిర్మించిన పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమ ప్రయోజనాలు నెరవేరాలన్నది మీ కుతంత్రం కాదా? శ్రీశైలం రిజర్వాయర్ లో తెలంగాణకు భాగస్వామ్యమే లేకుండా చేయాలన్నది మీ ఎత్తుగడ కాదా?


ద్రోహం నెంబర్ 9: ఎవరి అనుమతితో ఆంధ్రాలో కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు?


తెలంగాణ ప్రభుత్వం తనకున్న నీటి వాటా ప్రకారం ప్రాజెక్టులు నిర్మిస్తుంటే, అవి అక్రమమని గగ్గోలు పెడుతున్న చంద్రబాబు నాయుడు గారు తన రాష్ట్రంలో మాత్రం యధేచ్చగా అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి, గుండ్రేవుల, గాజులదిన్నె పథకం, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం, పులికనుమ ఎత్తిపోతల పథకం, సిద్దాపురం ఎత్తిపోతల పథకం , శివభాష్యం ఎత్తిపోతల పథకం, మున్నేరు పథకం, పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ జలాశయానికి 40 TMC ల  తుంగభద్రా నీటిని తరలించే ఎత్తిపోతల పథకం, గోదావరి – పెన్నా లింక్ పథకం నిర్మిస్తున్నారు. వీటన్నింటికి ఎవరి అనుమతులు పొంది చంద్రబాబు ప్రభుత్వం నిర్మిస్తున్నది? కృష్ణా, గోదావరి బోర్దులకు, తెలంగాణ ప్రభుత్వానికి వీటి డి.పి.ఆర్. కూడా పంపలేదు(అనుబందం-14).


ద్రోహం నెంబర్ 10: పోలవరం కోసం మండలాలు గుంజుకోవడం మొదటి అన్యాయం కాదా?


తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడితే అడ్డుకుంటుందనే దుర్భుద్దితో నరేంద్రమోడీ గారిపై వత్తిడి తెచ్చి ప్రత్యేక ఆర్డినెన్స్ ఇప్పించి,  భద్రాచలం డివిజన్ లోని 7 మండలాలను లాక్కోవడం మీ కుటిలత్వానికి నిదర్శనం కాదా? ఇది తెలంగాణకు తలపెట్టిన తొలి ద్రోహం కాదా?

ద్రోహం నెంబర్ 11: సీలేరు ప్లాంటు పోవడంతో ఏడాదికి రూ.500 కోట్ల నష్టం చేయడం లేదా?


460 మెగావాట్ల లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్లాంటు తెలంగాణ భూభాగంలో ఉంది. పోలవరం మండలాలతో పాటు సీలేరు పవర్ ప్లాంటును కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుర్మార్గంగా గుంజుకున్నది. దీంతో 365 రోజుల పాటు 60 శాతం పిఎల్ఎఫ్ తో విద్యుత్ ఉత్పత్తి చేసే సీలేరు ప్లాంటు తెలంగాణకు కాకుండా పోయింది. ఈ ప్లాంటును గుంజుకుని కూడా కనీసం అక్కడ నుంచి కూడా తెలంగాణకు వాటా ప్రకారం రావాల్సిన కరెంటును ఇవ్వడం లేదు. సీలేరు పవర్ ప్లాంటు తెలంగాణకు కాకుండా పోయినందుకు ఏడాదికి రూ.500 కోట్లు నష్టపోవాల్సి వస్తున్నది. ఇది తెలంగాణకు మీరు చేసిన శాశ్వత నష్టం కాదా?  

ద్రోహం నెంబర్ 12: విద్యుత్ పంపిణీ విషయంలో దుర్మార్గమైన వైఖరి అవలంభించలేదా?


తెలంగాణ రాష్ట్రంలో చిమ్మచీకట్లు అలుముకోవాలని, ప్రజలు కరెంటు కోతలు అల్లాడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచి చంద్రబాబు కుట్రలు చేస్తూనే ఉన్నారు. నేటికీ అవి కొనసాగుతున్నాయి. విభజన బిల్లు చట్టం ప్రకారం తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్ల నుంచి రావాల్సిన విద్యుత్ ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారు. దీంతో తెలంగాణ ఏర్పడిన మొదటి ఏడాది తీవ్ర కరెంటు కోతలు అనుభవించింది. పంటలు ఎండపోయి రైతులు గుండెలవిసేలా విలపించారు. ఈ గుండెకోతకు మీ కసాయితనం కారణం కాదా?

ద్రోహం నెంబర్ 13: పిపిఏలను ఏకపక్షంగా రద్దు చేసి 2,465 మెగావాట్లు ఎగ్గొట్టలేదా?


రెండు రాష్ట్రాల్లో 2014 జూన్ నాటికున్న విద్యుత్ ప్లాంట్ల నుంచి, ఆనాటికి నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే కరెంటులో తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్ కు 46.11 శాతం విద్యుత్తును పంపిణీ చేయాలని విభజన బిల్లులో స్పష్టంగా చెప్పారు. ఎపి జెన్ కో, కృష్ణపట్నం, హిందూజా, హైడల్ ప్లాంట్ల ద్వారా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన 2,465 మెగావాట్ల విద్యుత్ ఇవ్వలేదు. తెలంగాణ డిస్కమ్ లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకున్న పిపిఎలను ఏకపక్షంగా రద్దు చేశారు. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ప్లాంట్ల నుంచి కరెంటు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు (అనుబంధం పవర్ 1).


ద్రోహం నెంబర్ 14: పీపీఏల రద్దుతో రూ.4,557 కోట్ల నష్టం చేసిన కుటిలత్వం మీది కాదా?


తెలంగాణకు ఇవ్వాల్సిన కరెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎగ్గొట్టడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించడమే కాకుండా, రూ.4,557 కోట్ల మేర నష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కరెంటు రాకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం తన అవసరాల కోసం బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనుక చట్ట ప్రకారం తెలంగాణకు కరెంటు ఇస్తే, థర్మల్ పవర్ కు యూనిట్ కు రూ.4 రూపాయలు, హైడల్ పవర్ కు యూనిట్ కు రూ.1.03 చెల్లిస్తే సరిపోయేది. కానీ బహిరంగ మార్కెట్ కు పోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం యూనిట్ కు రూ.5.54 వరకు చెల్లించి కరెంటు కొనాల్సి వచ్చింది(అనుబంధం పవర్ 2). కొత్త రాష్ట్రంగా అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న తెలంగాణ గుండెల్లో ఇది మీరు దింపిన గునపం కాదా?

ద్రోహం నెంబర్ 15: ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకుండా.. టెండర్లలో పాల్గొన్న కుంచితత్వం మీది కాదా?


విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఆంధ్ర ప్లాంట్ల నుంచి రావాల్సిన కరెంటు ఇవ్వమంటే తమ వద్ద కరెంటే లేదన్నారు. కానీ తెలంగాణకు కావాల్సిన కరెంటు కోసం టెండర్లు పిలిస్తే, అందులో ఆంధ్రప్రదేశ్ పాల్గొన్నది. తెలంగాణకు ఒక్కో యూనిట్ కు 5.35 చొప్పున చెల్లిస్తే, కరెంటు సరఫరా చేస్తామని టెండర్ కోట్ చేసింది. చట్టం ప్రకారం నాలుగు రూపాయలకు యూనిట్ ఇవ్వమంటే,  మా దగ్గర కరెంటు లేదన్న ఆంధ్రప్రదేశ్ రూ.5.35 ఇస్తే మాత్రం కరెంటు ఇస్తామన్నది. అంటే కరెంటు ఉండి కూడా, విభజన చట్టంలో చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కరెంటును ఇవ్వకుండా, ఎక్కువ రేటు పెట్టి కొంటే ఇస్తామని ముందుకు వచ్చింది(అనుబంధం పవర్ 3). ఇది మీ కుంచిత మనస్తత్వానికి నిదర్శనం కాదా?

ద్రోహం నెంబర్ 16: ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణపై రుద్ది రూ.1000 కోట్ల భారం మోపలేదా?


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎక్కడి ఉద్యోగులు అక్కడికి పోవాలి. ఆంధ్రలో పనిచేస్తున్న 350 మంది తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రం వెనక్కి  పిలుపించుకుంది. ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చింది. కానీ తెలంగాణలో పనిచేస్తున్న 1,153 మంది ఆంధ్ర ఉద్యోగులను మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాయిన్ చేసుకోవడం లేదు. తాము తమ స్వంత ప్రాంతానికి పోవడానికి ఆంధ్ర ఉద్యోగులు సిద్దంగా ఉన్నప్పటికీ, లిఖిత పూర్వకంగా ఈ విషయాన్ని చెప్పినప్పటికీ అక్కడి ప్రభుత్వం మాత్రం మీరు తెలంగాణలోనే ఉండండి అని చెబుతున్నది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులకు తెలంగాణ విద్యుత్ సంస్థలు నెలకు రూ.15కోట్లకు పైగా జీతాలు చెల్లించాల్సి వస్తున్నది. ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కోట్లు వారి జీతాలకే చెల్లించాల్సి వచ్చింది. ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోవడం వల్ల స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పదోన్నతుల విషయంలో కూడా తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం  జరుగుతున్నది.

ద్రోహం నెంబర్ 17: ఖాళీ భవనాలు ఇవ్వకపోవడం మీ కుంచితత్వం కాదా?


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణ కోసం పదేళ్ల వరకు హైదరాబాద్ లోని భవనాలు వాడుకోవచ్చని విభజన చట్టంలో చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పాలనా యంత్రంగాన్నంతా అమరావతికి తరలించింది. దీంతో హైదరాబాద్ లో ఎపికి కేటాయించిన భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. వాటిలో బల్లులు గుడ్లు పెడుతున్నాయి. పావురాలు కాపురముంటున్నాయి. బూజు పట్టిపోతున్నాయి. అయినా సరే, వాటిని తిరిగి తెలంగాణకు అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. అమరావతిలోనే వారు  అసెంబ్లీని నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ భవనంలో కేటాయించిన ప్రాంతాన్ని మాత్రం తెలంగాణకు ఇవ్వడం లేదు. హైదరాబాద్ లోని ఆస్తుల పంపిణీకి సంబంధించి గవర్నర్ గారు ఏర్పాటు చేసిన మంత్రలు కమిటీలో నేను కూడా సభ్యుడిని. ఆ కమిటీలో సభ్యులుగా ఉన్న ఆంధ్ర మంత్రులను అడిగితే, ఖాళీగా అయినా ఉంచుతాం తప్ప ఒక్క గది కూడా ఇవ్వము అని చెప్పడం మీ మరుగుజ్జు తనానికి నిదర్శనం కాదా?


ద్రోహం నెంబర్ 18: హైదరాబాద్ ఆస్తుల్లో వాటా అడగడం మీ దురాశ కాదా?


నిజాం కాలం నుంచి తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్లో వాటా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తున్నది. కోర్టుల్లో కేసులు వేసింది. నిజాం కాలం నాటి ఆస్తులకు తెలంగాణకే తప్ప, ఆంధ్రప్రదేశ్ కు వాటా ఉండదనే సత్యం మీకు తెలియదా? హైదరాబాద్ ను నేనే నిర్మించానని పదే పదే చెప్పడం తెలంగాణ చరిత్రను పరిహసించడం కాదా?


ద్రోహం నెంబర్ 19: రాష్ట్ర విభజన మాయని గాయమని బాధపడలేదా?


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇక్కడి ప్రజలందరికీ ఆనందం కలిగిస్తే, మీరు బాధ పడలేదా? విభజన మాయని గాయమని అనలేదా? గవర్నర్ ప్రసంగంలోనూ ఇదే విషయం చెప్పించి మీ కసి తీర్చుకోలేదా? ఇది మీకున్న తెలంగాణ వ్యతిరేకతకు నిదర్శనం కాదా?

తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు మీరు చేసిన ద్రోహాల్లో, మీరు పన్నుతున్న కుట్రల్లో కొన్నింటిని మాత్రమే నేనిక్కడ ఆధారాలతో సహా బహిర్గతం చేశాను. తెలంగాణ ప్రగతి నిరోధకుడిగా మారిన మీకు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కు ఉంటుందా? తెలంగాణను బలిపీటం ఎక్కించడానికి మీరు అధికారపీఠం కోరుకోవడం ఎంతటి రాక్షసత్వం?
ఈ లేఖకు సమాధానం చెప్పగలరని కోరుతున్నానని డిమాండ్ చేశారు.

1665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS