మ్యాట్రీమోనీ సైబర్ చీటర్ అరెస్ట్

Sat,November 17, 2018 07:25 AM

Matrimony cyber cheater arrest

హైదరాబాద్ : మ్యాట్రీమోనీ సైట్‌లో పరిచయం అయి.. పెండ్లి పేరుతో మోసం చేసిన రాజస్థాన్‌కు చెందిన సైబర్ చీటర్‌ను రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన కంటి నవాల్ కిశోర్ వర్మ అలియాస్ ఇమర్ అజర్ మాలిక్ 13 ఏండ్ల సమయంలోనే ఇంటి నుంచి బయటకు వెళ్లి పలు ప్రాంతాల్లో పనిచేశాడు. 2006లో సూరత్‌కు చెందిన యువతితో పెండ్లయ్యింది. ఆమె 2010లో అనారోగ్య సమస్యతో మృతి చెందింది. ఈ క్రమంలోనే 2011లో బెంగుళూర్‌కు మకాం మార్చాడు. తాను ముస్లింగా మారానంటూ ప్రచారం చేసుకున్నాడు. ఇలా ..ముస్లిం డైవర్స్ మ్యాట్రీమోనీ సైట్లలోకి వెళ్లి మహిళలకు ఎరవేసి మోసం చేస్తుంటాడు. ఇలా .. హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళకు సంబంధించిన ప్రొఫైల్‌ను చూసి, కిశోర్‌వర్మ ఆమెతో మాట్లాడాడు. తాను బెంగుళూర్‌లో ఇంటీరియర్ డిజైనింగ్ కార్యాలయానికి సీఈఓగా పనిచేస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని చెప్పాడు.

దీంతో సదరు మహిళ, తమ కుటుంబ సభ్యులతో బెంగుళూరుకు వెళ్లి, అతనితో మాట్లాడి వచ్చారు. పెండ్లి నిశ్చయమైనట్లు కొన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంతలో సదరు యువకుడు తనకు అత్యవసరంగా రూ. 90 వేలు కావాలని, వారం రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానంటూ సదరు యువతి వద్ద నుంచి.. తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. డబ్బు ఖాతాలో పడిన తరువాత తన మాట తీరును మార్చేసి, తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పాటు సెల్ స్విచ్‌ఆఫ్ చేశాడు. అనుమానం వచ్చిన మహిళ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చే సుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇలా... చాలామందిని నిందితుడు మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మ్యాట్రీమోనీ సైట్‌లోకి వెళ్లి యువతి, యువకులు గుడ్డిగా మోసపోవద్దని పోలీసులు సూచించారు.

1201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles