గొడవకు దిగి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు!

Thu,September 20, 2018 07:11 AM

man lost his life while disputing with young men in hyderabad

హైదరాబాద్: కొంతమంది యువకులతో ఘర్షణకు దిగి... వారిపై రాళ్లదాడి చేసి.. వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఓ యువకుడు జారిపడి... చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ కళాశాల విద్యార్థి హనుమం తు ఈ నెల 16న రాత్రి 8.30 గంటలకు స్నేహితులతో కలిసి ఏవీ కళాశాల ముందు నుంచి నడుచుకుం టూ లిబర్టీ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో దోమలగూడ హుందాబాగ్‌కు చెందిన కేశవ్ వారితో అసభ్యంగా ప్రవర్తించి... ఘర్షణకు దిగాడు. గమనించిన స్థానికులు ఇరువురికి సర్థి చెప్పి పంపించేశారు. కొద్ది సేపటి తరువాత... వారికి ఎదురువైపు నుంచి వచ్చిన కేశవ్ వారిపై రాళ్లతో దాడి చేశాడు. ఆ దాడిని నిలువరించేందుకు ప్రతిఘటించే క్రమంలో హన్మంతు కూడా రాళ్లు విసిరే ప్రయత్నం చేశాడు. దీన్ని తప్పించుకునే క్రమంలో కేశవ్ కింద పడ్డాడు. దీంతో తల వెనుక భాగంలో తీవ్ర గాయమైంది.

చికిత్స పొందుతూ మృతి
స్థానికులు వెంటనే కేశవ్‌ను చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ కేశవ్‌కు చికిత్స చేసిన వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా అందంటూ అదే రోజు అర్ధరాత్రి డిశ్చార్జ్ చేశారు. కాగా... మరుసటి రోజు కేశవ్‌కు తీవ్ర స్థాయిలో వాంతులు కావడంతో, కుటుంబ సభ్యులు మరోసారి చికిత్స కోసం దవాఖానకు తరలించారు. కేశవ్‌కు చికిత్స ప్రారంభించిన వైద్యులు అతని మెదడులో రక్తం గడ్డ కట్టిందని, గుండెపై కూడా ప్రభావం చూపిందని తెలిపారు. వైద్యులు చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే బాధితుడు కోమాలోకి వెళ్లిపోయాడని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.

ఈ విషయం పై వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు, అదే రోజు కేశవ్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాల్లో రాళ్లు విసురుతున్న దృశ్యాలు, కేశవ్, హనుమంతులు తప్పించుకునే దృశ్యాలు పోలీసులకు లభించాయి. ఈ క్రమంలోనే బాధితుడు కేశవ్ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తిరిగి కుటుంబ సభ్యులు గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం కేశవ్ మృతి చెందాడు. ఇదిలాఉండగా ... దీన్ని హత్య కేసుగా మారుస్తూ, నిందితుడిపై పోలీసులు హత్య (ఐపీసీ 302) కేసు నమోదు చేశారు. ఈ విషయంపై సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత సెక్షన్‌లో మార్పులు చేయాలా? వద్దా? అనే విషయాన్ని పరిశీలిస్తామని వివరించారు.

3440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles