అనుమానమే భార్య హత్యకు ప్రేరణ.. సౌదీ నుంచి వచ్చి చంపి వెళ్లాడు!

Sun,May 27, 2018 10:03 AM

man killed his wife after suspecting her in hyderabad

హైదరాబాద్: వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా ... అనుమానం మాత్రం నీడలా వెంటాడుతూనే ఉంది. ప్రేమించి పెండ్లి చేసుకున్నా... ఆమెపై నిత్యం అనుమానమే... దానికితోడు తల్లి, సోదరులు, ఇతరులు ఫోన్‌లో తెలియజేస్తున్న విషయాలతో అనుమానం ఇంకా ఎక్కువైంది. దీంతో సౌదీ నుంచి నగరానికి వచ్చి...అత్తారింట్లో ఉన్న భార్యను బయటకు తీసుకెళ్లి హత్య చేసి... అనంతరం తిరిగి వెళ్లిపోయాడు. పాతనగరంలో సంచలనం సృష్టించిన హత్య కేసులో డబీర్‌పుర పోలీసులు పురోగతి సాధించారు.

హత్యకు ప్రేరేపించిన వారితోపాటు..అతనికి సహకరించిన కుటుంబ సభ్యులను సైతం అరెస్ట్ చేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ కేసు వివరాలను వెల్లడించారు. డబీర్‌పుర ప్రాంతానికి చెందిన అక్బర్ అలీఖాన్ (30) అలియాస్ హైదర్‌కు కింగ్‌కోఠిలోని పర్ధాగేట్‌కు చెందిన జీబనాజ్‌తో పదేండ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. కొన్ని సంవత్సరాల తర్వాత దంపతుల మధ్య పలుమార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో జీబనాజ్ తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. అక్బర్ అలీఖాన్ ఉద్యోగ నిమిత్తం సౌదికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అక్బర్ తల్లి మెహబూబ్‌ఉన్నీసా .. జీబనాజ్‌పై కొడుకుకు చెడుగా చెప్పడం ప్రారంభించింది.

అలాగే అతని కుటుంబ సభ్యులు సైతం జీబనాజ్‌పై చెడుగా చెప్పసాగారు. దీంతో అక్బర్ మానసికంగా కృంగిపోయాడు. దీంతో అక్బర్‌ఖాన్ ఈ నెల 17న నగరానికి వచ్చాడు. 18న మధ్యాహ్నం 2 గంటల సమయంలో అత్తారింటికి వెళ్లాడు. రంజాన్ మాసం సందర్భంగా పేదలకు జకాత్ చేద్దామని చెప్పి భార్యను బైక్‌పై తీసుకెళ్లాడు. అక్కడి నుంచి నేరుగా డబీర్‌పురలోని తన ఇంటికి వెళ్లి పలు అంశాలపై చర్చించుకున్నారు. అ సమయంలో సహనం కోల్పోయిన అక్బర్‌ఖాన్ సమీపంలోని సుత్తెతో జీబనాజ్ తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహానికి పలు బట్టలు, ఇతర కాగితాల్లో ప్యాక్ బాక్స్‌లా మార్చేశాడు.

తెలిసి ఆటో లో మృతదేహాన్ని డబీర్‌పుర ఏడు గుళ్ల ప్రాంతానికి తరలించాడు. అప్పటికే అక్బర్ తిరిగి దుబాయ్‌కు వెళ్లడానికి.. ఉస్మాన్‌అలీఖాన్, ఖైసర్ అలీఖాన్, ఇమ్రాన్‌అలీఖాన్‌లు విమాన టికెట్‌ను బుక్ చేశారు. డబీర్‌పురలో మృతదేహాన్ని వదిలేసిన అక్బర్ నేరుగా ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని.. తిరిగి అదే ఆటోలో విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి సౌదికి పారిపోయాడు. కాగా.. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన విషయం చెప్పాడు. హత్యకు ప్రేరేపించిన అలీఖాన్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

వారం రోజుల్లో లొంగిపోవాలి : డీసీపీ


వారంరోజుల్లో నిందితుడు అక్బర్‌ఖాన్ పోలీసుల వద్ద లొంగిపోవాలని.. లేని పక్షంలో అరబ్ ఎమిరేట్స్ అధికారులతో సంప్రదించి అక్బర్‌ఖాన్‌ను తిరిగి ఇండియాకు తరలించడానికి ప్రయత్నిస్తామని డీసీపీ తెలిపారు. ఈ కేసులో సహకరించడానికి కేంద్ర హోంశాఖ అధికారులను సైతం సంప్రదించనున్నట్లు తెలిపారు. ఈ సమవేశంలో అదనపు డీసీపీ గౌస్ మోహినుద్దీన్, మీర్‌చౌక్ ఏసీపీ ఆనంద్, డబీర్‌పుర ఇన్‌స్పెక్టర్ వెంకన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.

3669
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles