ప్రేమలో గెలిచాడు.. జీవితంలో ఓడాడు

Sat,January 12, 2019 06:41 AM

man commits suicide after his wife leaves him in hyderabad

హైదరాబాద్: ప్రేమించాడు... తల్లిదండ్రులు ఒప్పుకోకున్నా ఎదురించి పెండ్లి చేసుకున్నాడు... వివాహం జరిగిన నాలుగేండ్ల వరకు వీరి సంసారం సాఫీగా జరిగింది. ఇటీవల ఏర్పడిన మనస్పర్థలతో భార్య.. కొడుకు, భర్తను వదిలివెళ్లిపోయింది. దీన్ని తట్టుకోలేక భర్త... కొడుకును పడుకోబెట్టి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కడప జిల్లా, పులివెందుల తొండూరు మండలం, గోటూరుకు చెందిన ఎర్రగొండు మల్లికార్జున్‌రెడ్డి కుమారుడు చరణ్‌తేజ్‌రెడ్డి(28) నాలుగేండ్ల క్రితం నగర శివారు కుత్బుల్లాపూర్‌కు వలస వచ్చి వాజ్‌పాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఆటో నడుపుతుండేవాడు. ఈ క్రమంలో అదే సంవత్సరం పులివెందుల ప్రాంతానికి చెందిన పావనీరెడ్డిని ప్రేమించాడు. వీరి ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోకున్నా.. పెండ్లి చేసుకున్నారు. వీరి సంసారం నాలుగేండ్లు సంతోషంగా సాగింది. వీరికి ధనుశ్‌రెడ్డి(13 నెలలు) జన్మించాడు.

కాగా.. మూడు రోజుల క్రితం దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇరువురు ఘర్షణ పడ్డారు. దీంతో పావనీరెడ్డి కొడుకును భర్త వద్దనే వదిలి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన చరణ్‌తేజ్ రెడ్డి బాధపడుతుండేవాడు. గురువారం రాత్రి కొడుకును పడుకోబెట్టి.. ఇంట్లోని రేకుల రాడ్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం బాబు ధనుశ్‌రెడ్డి ఏడుస్తుండగా.. పక్కింటి వారు తలుపులు కొట్టగా తీయలేదు. కిటికీలోంచి చూడగా చరణ్‌తేజ్‌రెడ్డి ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని కిందకు దించి దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అనాథగా బాలుడు
ఇదిలా ఉండగా... తల్లి ఇంట్లోంచి వెళ్లిపోవడంతో తండ్రి అండగా ఉంటాడనుకున్నారు. అయితే తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో వారి కొడుకు 13 నెలల ధనుశ్‌రెడ్డి అనాథగా మారాడు. తండ్రి మృతదేహం వద్ద అటు.. ఇటు తిరుగుతున్నప్పటికీ తల్లిదండ్రులు లేరనే విషయం ఆ పసి వయస్సుకు తెలియదు. ఆ బాలుడిని చూసి ఇరుగు పొరుగువారు కన్నీళ్ల పర్యంతమయ్యారు.

4277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles