ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి మరో అవకాశం

Sat,November 9, 2019 06:36 AM

హైదరాబాద్ : లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ఈనెల 30న అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక మేళాలు ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. డిసెంబర్ 31, 2016నాటికి స్వీకరించిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను మరోసారి పరిశీలించి ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా పరిష్కరించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపధ్యంలో శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లోకేశ్‌కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించారు.


నగర ముఖ్య ప్రణాళికాధికారి దేవేందర్‌రెడ్డి, టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావుసహా టౌన్‌ప్లానింగ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, షార్ట్‌ఫాల్స్ నోటీసులు అందుకున్న దరఖాస్తుదారులు ఈనెల 30న తమ సర్కిల్ కార్యాలయాల్లో ఏర్పాటుచేసే మేళాకు హాజరై సంబంధిత పత్రాలన్నీ అక్కడి అధికారులకు అందజేయాలన్నారు. ఇప్పటికే 2516మంది షార్ట్‌ఫాల్స్‌కు సంబంధించిన పత్రాలను సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే ప్రొసీడింగ్స్ జారీ చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది 31వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా షార్ట్‌ఫాల్స్ అందించి ప్రొసీడింగ్స్ పొందే అవకాశముందని తెలిపారు. మొత్తం 85291ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు రాగా, అందులో 28935దరఖాస్తులకు ప్రొసీడింగ్స్ జారీచేసినట్లు, 20425 దరఖాస్తులను అర్హతలేని కారణంగా తిరస్కరించినట్లు కమిషనర్ చెప్పారు. 25726 దరఖాస్తులకు షార్ట్‌ఫాల్స్ నోటీసులు జారీచేయగా, ఈ మేళాల సందర్భంగా అన్ని ధ్రువపత్రాలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తిచేశారు.

పెండింగ్ కేసులకు వారంలోగా కౌంటర్లు

జీహెచ్‌ఎంసీకి సంబంధించి హైకోర్టులో ఉన్న కేసులకు, కంటెంప్ట్ కేసులకు వచ్చే వారంరోజుల్లోగా కౌంటర్లు దాఖలుచేయాలని ఈ సందర్భంగా కమిషనర్ టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ప్రజావాణిలో అంది వచ్చే ఫిర్యాదులపై కూడా వెంటనే స్పందించి ఫిర్యాదుదారుకు లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని స్పష్టంచేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలన్న ఆదేశాలకు సైతం వెంటనే తగు చర్యలు తీసుకొని నివేదికలు సమర్పించాలన్నారు. కోర్టు కేసులపై వెంటనే స్పందించడం, కోర్టు ఆదేశాలను అమలుచేయడం పూర్తిగా అధికారుల బాధ్యతని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

683
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles