అన్ని విషయాలు 11వ తేదీన చెబుతాను!

Sat,December 8, 2018 04:38 PM

ktr Press Meet at Telangana Bhavan

హైదరాబాద్: ఎన్నికల్లో పాల్గొన్న తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఆర్‌ఎస్ భవన్‌లో కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ నిర్వహించినందుకు అధికారులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అనుకున్నదానికంటే పాజిటివ్‌గా పోలింగ్ సరళి ఉంది. పోలింగ్‌లో మహిళలు, వయోవృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓటింగ్ శాతం పెరగడం అభివృద్ధికి మద్దతిచ్చినట్టయింది. దాదాపు 100 సీట్లతో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాబోతోంది.

90రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో అద్భుతంగా పనిచేసిన లక్షలాది టీఆర్‌ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు. ఓటర్లు పెద్దసంఖ్యలో పోలింగ్‌కు తరలిరావడం నిశబ్ద విప్లవానికి ప్రతీక. కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకు అందరూ అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్‌లో హేమాహేమీలు, సీఎం అభ్యర్థులుగా ప్రకటించుకున్న వారి కలలు కల్లలు అవుతాయి. ఈనెల 11న విజయోత్సవాలు జరుపుకుందాం. కాంగ్రెస్, టీడీపీ పొత్తు అపవిత్రమైన రాజకీయాలకు పరాకాష్ట. ఓడిపోయేవాళ్లు కుంటిసాకులు వెతుక్కుంటారు. కూటమి నేతలు వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్కచోట కూడా రీపోలింగ్ అవసరం లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

కూటమిని, ప్రతిపక్షాల గారడీలను ప్రజలు పట్టించుకోలేదు. ఈవీఎంల పనితీరుపై మాకు ఎలాంటి సందేహాలు లేవు. ఈవీఎంల విధానంలోనే కాంగ్రెస్ రెండు సార్లు గెలిచింది, మరి ఆ ఫలితాలను ఏమంటారు? అని ప్రశ్నించారు. కౌంటింగ్ జరిగే సమయంలో కార్యకర్తలు జర హుషార్ ఉండాలి. లగడపాటి ఏమన్నాడో ఆయనకే అర్థం కాలేదు. అన్ని విషయాలు 11వ తేదీన చెబుతాను.చంద్రబాబుతో పొత్తువల్ల ప్రజాకూటమికి నష్టం వాటిల్లింది. తెలంగాణ ఏర్పాటుతో లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు తర్వాత లగడపాటికి సర్వేల నుంచి కూడా సన్యాసమే. ఓటర్ల జాబితాలో జరిగిన పొరపాట్లు సరిదిద్దాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తామని వివరించారు.

6003
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles