తుది రూపు దిద్దుకున్న ఖైరతాబాద్ గణేషుడు

Wed,September 12, 2018 07:04 AM

khairatabad ganesh designed by artist Rajendran

హైదరాబాద్ : ఆ దివ్య మంగళస్వరూపం చూడటానికి రెండు కండ్లు చాలవు. 64 వసంతాలుగా భక్తజన కోటికి వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న ఖైరతాబాద్ గణేశుడికి దేశంలోనే కాదు విదేశాల్లో సైతం భక్తులు ఉన్నారు. ప్రతి ఏడాది ఓ ప్రత్యేక రూపంలో కనిపించే ఆ మహాదేవుడు ఈ సంవత్సరం సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా సాక్షాత్కరిస్తారు. అరుదైన శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో 150 మంది కళాకారులు వందరోజులపాటు శ్రమించి ఈ భారీ ఉత్సవమూర్తిని తీర్చిదిద్దారు. మంగళవారం శిల్పి రాజేంద్రన్ స్వామివారి కళ్లను రంగులు అద్దడంతో సప్తముఖుడి రూపం సంపూర్ణమైంది.

ఈ ఏడాది 57 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకున్న సప్తముఖుడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆదిశేషుల పడగల నీడలో స్వామివారు ఏడు ముఖాలతో లక్ష్మీ, సరస్వతి సమేతుడిగా దర్శనమిస్తారు. కాగా ఈ ఏడాది మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుటుంబ సమేతంగా స్వామి వారికి తొలిపూజ నిర్వహిస్తారు.

ఏడు ఆదిశేషుల పడగల నీడలో : 64 ఏళ్ల ప్రస్తానంలో ఖైరతాబాద్ గణేశుడు ఈసారి సప్తముఖుడిగా(ఏడు గణేశుడి ముఖాలు) దర్శనమిస్తున్నారు. 57 అడుగుల ఎత్తు, 27 వెడల్పుతో మహా విరాఠ రూపంలో కనిపిస్తారు. 14 చేతులతో అస్త్రశస్ర్తాలతో భక్తులకు రక్షణ కల్పిస్తూనే ఆశీర్వాదం సైతం అందజేస్తారు. కుడివైపు ఉన్న ఏడు చేతుల్లో అంకుశం, చక్రం, కత్తి, సర్పం, బాణం, గద, ఆశీర్వచనం, ఎడమ వైపు పాశం, శంఖు, పద్మం, డమరుకం, విల్లు, డాలు, ఆయనకు ఇష్టమైన లడ్డు నైవేద్యం ఉంటుంది. గత రెండేండ్లుగా స్వామివారి విగ్రహం రూపకల్పనతోనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లడ్డూను అమరుస్తున్నారు. ఈ ఏడాది కూడా మూడడుగుల ఎత్తు, మూడడుగుల పొడవు ఉన్న లడ్డూను అమర్చారు. ఖైరతాబాద్ గణేశుడి చరిత్రలో మొదటిసారి ఏడుడుగుల స్వామివారి వాహనం మూషికం ఆయనకు పాదాభివందనం చేస్తూ కనిపిస్తుంది.

కమనీయం శ్రీనివాసుడి కల్యాణం : సప్తముఖుడి మరో కుడివైపు కలియుగ దైవం శ్రీనివాసుడి కల్యాణం నేత్రానందం కలిగిస్తుంది. శిల్పి రాజేంద్రన్ తన నైపుణ్యంతో పద్మావతి సమేత శ్రీనివాసుడి కల్యాణ ఘట్టాన్ని సాక్షాత్కరింపజేశారు. 13 అడుగుల ఎత్తైన రూపంలో పద్మావతి, శ్రీనివాసుల దివ్యస్వరూపం, ఆ మహోత్సవానికి హాజరైన విధంగా 11 అడుగుల ఎత్తులో శివుడు, బ్రహ్మదేవుడి విగ్రహాలు, పది అడుగుల సముద్రుడు, తొమ్మిది అడుగుల ఎత్తులో పార్వతి, సరస్వతి అమ్మవార్లు, ఎనిమిది అడుగుల ఎత్తున గరుక్మంతుడు, నారదుడు, ఐదు అడుగుల ఎత్తున వినాయకుడు, కుబేరుడు, యాగం చేసే రుషులు (మూడుఅడుగులు), 18 అడుగుల ఎత్తులో అందంగా కల్యాణ మండపం దృశ్యాలు నిజంగా శ్రీనివాసుడి కల్యాణం మన కళ్లే ఎదుట జరిగినట్లు కనిపిస్తుంది.

వినాయకుడి శివలింగార్చన : మరో ఎడుమ వైపు శివపార్వతులు కుటుంబసమేతంగా దర్శనమిస్తారు. తొమ్మిది అడుగుల ఎత్తులో వెండికొండ వద్ద నందీశ్వరుడిపై శివపార్వతులు ఆశీనులై కనిపిస్తారు. వారి మధ్యలో చిన్న కుమారుడు సుబ్రమణ్యేశ్వరుడు కూర్చొని ఉండగా, పెద్దకుమారుడు గణనాథుడు శివలింగానికి పుష్పార్చన చేస్తూ ఉంటారు.

3502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles