కాలుష్య కోరల్లో పారిశ్రామికవాడలు

Sun,May 19, 2019 11:52 AM

industrial sectors in hyderabad trapped with pollution

- పటాన్‌చెరు, కాటేదాన్, కూకట్‌పల్లిలో పీసీబీ అధ్యయనం
- పరిస్థితి మెరుగైనా మారని ర్యాంకు
- తాజాగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన అధికారులు

హైదరాబాద్: పటాన్‌చెరు.. కూకట్‌పల్లి.. కాటేదాన్‌లు తెలంగాణలోనే అత్యంత కలుషిత ప్రాంతాలు. ఇక్కడ నమోదయ్యే కాలుష్యం ప్రజారోగ్యానికి హనికరం. కానీ ఈ మూడు పారిశ్రామికవాడల్లో కాలుష్య తీవ్రతలు తగ్గడం లేదు. పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. వివరాల్లోకి వెళితే.. దేశంలో అత్యధిక కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో అధ్యయనం చేసి, ఆయా వివరాలతో కూడిన జాబితాను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) 2009 -10 ప్రాంతంలో విడుదల చేసింది.

కాంప్రహెన్సివ్ ఎన్విరాన్‌మెంటల్ పొల్యూషన్ ఇండెక్స్‌ను రూపొందించి అత్యధిక కాలుష్య ప్రభావిత పారిశ్రామికవాడలను గుర్తించింది. పటాన్‌చెరు, బొల్లారం పారిశ్రామికవాడ క్రిటికల్లీ పొల్యూటెడ్ ఏరియాగా, కూకట్‌పల్లి, కాటేదాన్‌లు కాలుష్య కోరల్లో ఉన్నట్లుగా తేల్చింది. ఈ పారిశ్రామికవాడల్లో కాలుష్యాన్ని అదుపుచేయడానికి చర్యలు తీసుకోవాలంటూ, ఇందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీపీసీబీ సూచించింది. ఈమేరకు తెలంగాణ బోర్డు అధికారులు యాక్షన్ ప్లాన్‌ను రూపొందించారు.

క్రిటికల్లీ పొల్యూటెడ్ ఏరియాగా పటాన్‌చెరు..


పటాన్‌చెరు పారిశ్రామికవాడను 70. 07 స్కోర్‌తో క్రిటికల్లీ పొల్యూటెడ్ ఏరియాగా ప్రకటించింది. పటాన్‌చెరులో మొత్తం 74 పరిశ్రమలుండగా, వాటిలో 21 రెడ్ కేటగిరి, 34 ఆరంజ్, 18 గ్రీన్ కేటగిరికి చెందినవి ఉన్నాయి. ఐడీఏ బొల్లారంలో మొత్తం 123 పరిశ్రమలుండగా, 59 రెడ్, 41 ఆరంజ్, 23 గ్రీన్ కేటగిరి పరిశ్రమలున్నాయి. క్రిటికల్లీ పొల్యూటెడ్ ఏరియాగా సీపీసీబీ ప్రకటించడంతో పాటు, దీంతో ఇక్కడ పరిశ్రమలను స్థాపించాలంటే ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ పొందాలని మారటోరియాన్ని విధించింది. ఇక్కడున్న 27 పరిశ్రమల నుంచి అత్యదికంగా కాలుష్యం వెలువడు తున్నట్లుగా పీసీబీ అధికారులు గుర్తించారు.

ప్రణాళికలు..


- పటాన్‌చెరు, బాచుపల్లి, ఇక్రిశాట్, బొల్లారంలో గాలి నాణ్యతా పర్యవేక్షణ కేంద్రాల ఏర్పాటు
- దుమ్ము ధూళికణాలు చేరకుండా బొల్లారంలో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయడం. సీసీరోడ్లు వేయడం.
- పటాన్‌చెరు ఎన్విరోటెక్ లిమిటెడ్ ద్వారా 7500 కిలోలీటర్ల రసాయన వ్యర్థజలాలను ప్రతి రోజు శుద్ధి.
- ఖాజీపల్లిలో ట్రీట్‌మెంట్, స్టోరేజీ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీ ఏర్పాటు
- నక్కవాగుమీద 22 ప్రాంతాల్లో నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహించడం.
- ఆసానికుంట, కిష్టారెడ్డిపేట చెరువు, బాచుగూడెం చెరువు, ఇసుకవాగు, పోచారం బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో సర్ఫేజ్ వాటర్ మానిటరింగ్.

కాలుష్య కోరల్లో కాటేదాన్..


కాటేదాన్ పారిశ్రామికవాడలో నమోదైన కాలుష్య తీవ్రతలను బట్టి ఈ ఇండస్ట్రియల్ క్లస్టర్‌కు 57.73 స్కోర్ నమోదయ్యింది. 70 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే క్రిటికల్లీ పొల్యూటెడ్ క్లస్టర్‌గా, 60 -70 మధ్య ఉంటే సివర్లీ పొల్యూటెడ్ క్లస్టర్‌గా పరిగణిస్తారు. కాటేదాన్‌లో గతంలో మొత్తం 375 పరిశ్రమలుండగా, వాటిలో రెడ్‌కేటగిరివి 78, ఆరంజ్ కేటగిరివి 30, గ్రీన్ కేటగిరికి చెందినవి 267 పరిశ్రమలుండగా ప్రస్తుతానికి 2 రెడ్ కేటగిరి, 11 ఆరంజ్ కేటగిరి, 193 గ్రీన్ కేటగిరి పరిశ్రలున్నాయి. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అధికారులు పర్యవేక్షణ జరుపుతున్నారు.

కూకట్‌పల్లి కూడా అంతే..


కూకట్‌పల్లి పారిశ్రామికవాడ 1990లో ఏర్పాటు కాగా, 15 ఎకరాల్లో విస్తరించి ఉన్న పారిశ్రామికవాడలో 71 ప్లాట్లు ఉన్నాయి. ఇక్కడ రెడ్ కేటగిరికి చెందినవి 15, ఆరంజ్ కేటగిరికి చెందినవి 21, గ్రీన్ కేటగిరికి చెందినవి 5 పరిశ్రమలున్నాయి. అయితే ఇక్కడ వాయు కాలుష్యం అధికంగా ఉంటున్నది. బాయిలర్లు, ఆర్గానిక్ సాల్వెంట్లను వాడటం వల్ల వెలువడే కాలుష్యమే అధికంగా ఉంటున్నది.

ప్రణాళికలు...


- కూకట్‌పల్లి, బాలానగర్‌లలో వాయు కాలుష్య నమెదుకేంద్రాల ద్వారా పరిశీలన.
- రసాయన వ్యర్థజలాలను పటాన్‌చెరు, జీడిమెట్లల్లోని ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు తరలించడం.
- రాత్రి గస్తీ బృందాలను ఏర్పాటు చేసి, అక్రమ డంపింగ్‌లకు అడ్డుకట్టవేయడం.
- భూగర్భ జలాల్లోని కాలుష్యాన్ని తెలుసుకునేందుకు 3 ప్రాంతాల్లో నీటి నాణ్యతా పరీక్షల నిర్వహణ
- రంగదాముని లేక్, చిన్న మైసమ్మ చెరువు, కూకట్‌పల్లి లేక్‌లలో సర్ఫేజ్‌వాటర్‌కు నీటి నాణ్యతా పరీక్షలను నిర్వహించడం.

889
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles