చుక్కల్లో.. సుచిత్ర

Thu,January 17, 2019 10:24 AM

hyderabad outskirt place suchitra developing rapidly

గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్భాగమైన శివారు ప్రాంతాలు అభివృద్ధి వైపు దూసుకుపోతున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి, సుచిత్ర, పేట్‌బషీరాబాద్ ప్రాంతాలు జెట్ స్పీడ్‌తో అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాయి. ఒకప్పుడు అటుగా వెళ్లాలంటే దట్టమైన చెట్లతో స్థానికులు భయాందోళనకు గురయ్యేవారు. నాడు వేలల్లో దొరికే స్థలాలు నేడు లక్షల్లో పలుకుతుండడం ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా వాణిజ్య వ్యాపార సంస్థలతో పాటు సినిమా థియేటర్లు, రైల్వేస్టేషన్, మెట్రోరైల్, స్కైవేలు రాబోతుండడంతో ఈప్రాంత స్థాలాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది.

వ్యాపార సంస్థల సమూహం


గతంలో ఈ ప్రాంతానికి చెందిన వారంతా సికింద్రాబాద్, కూకట్‌పల్లి, అమీర్‌పేట వంటి ప్రాంతాలకు వెళ్లి అవసరమైన వస్తువులు తెచ్చుకునేవారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మరింత క్రేజ్ పెరిగింది. గడిచిన నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండడంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సెటిలర్లు సైతం ముందుకువస్తున్నారు. దీంతో ఈప్రాంతం ఒక్కసారిగా వ్యాపార, వాణిజ్య సమూహాలకు అడ్డాగా మారింది. కుత్బుల్లాపూర్‌కు చెందిన వారితో పాటు బోయిన్‌పల్లి, అల్వాల్, బొల్లారం ప్రాంతాలకు చెందిన వారు కూడా సుచిత్ర, కొంపల్లి ప్రాంతాలకు వచ్చి షాపింగ్ చేస్తున్నారు. ఇక్కడ అవసరమైన వస్త్ర వ్యాపారంతో పాటు గృహోపకరణాలు, మెట్రో, డీమార్ట్, బిగ్‌జబార్‌తో పాటు వినోదం కోసం సినీప్లానెట్ ఉంది. అంతేకాకుండా త్వరలో సుచిత్ర చౌరస్తాలో 10 స్క్రీన్‌లతో కూడిన మల్టీప్లెక్స్ సినిమా హాల్ నిర్మాణ దశలో ఉంది. ఇక్కడ మరో విషయమేమిటంటే నగరంలో ఉన్న అన్ని రకాల హోటళ్లు అందుబాటులో ఉండడం వల్ల నగరశివారు ప్రజలు ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడుతున్నారు.

స్కైవేలతో రూపు మారనున్న సుచిత్ర చౌరస్తా


ఇదిలా ఉండగా ఇంతకాలం కుత్బుల్లాపూర్‌లోని ఓ చౌరస్తాగా ఉన్న సుచిత్రలో స్కైవేలు ఏర్పాటు చేయాలన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలతో ఈ ప్రాంతంలో భూములకు డిమాండ్ పెరుగుతుంది. స్కైవేలు నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యకు చెక్ పడడంతో పాటు రవాణా సౌకర్యం మెరుగు పడుతుందనే ఉద్ధేశంలో ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఎంత ధరకైనా ప్లాట్లను కొనేందుకు ఔత్సాహికులు మొగ్గు చూపుతున్నారు. గత పది సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక చదరపు గజానికి సుమారు రూ.15 వేల నుంచి 25 వేల వరకున్న ధర నేడు రూ.1 లక్ష నుంచి రూ.1.50 లకు పలుకుతుండడం గమనార్హం. సుచిత్ర నుంచి పేట్‌బషీరాద్, కొంపల్లి వరకు గల 5 కిలో మీటర్ల మేర రోడ్డుకు ఇరువైపుల రాజకీయ నాయకులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈరెండేండ్లలో పెద్ద ఎత్తున స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం కూడా ఈ అభివృద్ధికి ఒక కారణమని పలువురు తెలియజేస్తున్నారు. కాగా రవాణాసౌకర్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు సుచిత్ర చౌరస్తా వరకు లోకల్ ట్రైన్‌ను విస్తరించి రైల్వేస్టేషన్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలుండడంతో ఈ ప్రాంతానికి వచ్చేందుకు ప్రజలు మక్కువ చూపుతున్నారు.

5928
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles