భార్య బతికుండగానే... రెండో పెండ్లి చేసుకుంటానని

Tue,June 5, 2018 07:35 AM

Hyderabad cyber crime police arrests cheater

హైదరాబాద్ : భార్య బతికుండగానే... గుండెకు రంధ్రంపడి చనిపోయిందని నమ్మించి... రెండో పెండ్లి చేసుకుంటానని ఓ మహిళను వేధిస్తున్న నాగాపూర్‌కు చెందిన ఓ ఘరానా చీటర్‌ను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మహారాష్ట్ర నాగాపూర్‌కు చెందిన రంజాన్ రియాజ్ అన్సారీ ప్రైవేట్ ఉద్యోగి. తన భార్య గుండె సమస్యతో చనిపోయిందని, కూతురు ఉందని, రెండో వివాహం చేసుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే తన ప్రొఫైల్‌కు లైక్ కొట్టాలంటూ షాదీ.కామ్‌లో రెండేళ్ల క్రితం అప్‌లోడ్ చేశాడు. ఇతని ప్రొఫైల్ చూసిన ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ.. ఆ ప్రొఫైల్‌కు లైక్ కొట్టింది. తనకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారని, భర్త కూడా లేడని.. రెండో వివాహనికి సిద్ధమంటూ ఆమె ఒప్పుకుంది.

దీంతో ఇద్దరు షాదీ.కామ్‌లోనే కొన్ని రోజుల పాటు చాటింగ్ చేసుకొని, ఒకరి వివరాలు మరొకరు తెలుసుకున్నారు. అనంతరం ఫోన్ నెంబర్లు, వాట్సాప్‌లు, ఫేస్‌బుక్ చాటింగ్ లు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకరి ఫొటో మరొకరు మార్చుకున్నారు. తాను ఓ మల్టీనేషనల్ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేయడంతో పాటు ట్రావెల్స్ వ్యాపారాన్ని కూడా ని ర్వహిస్తానంటూ నమ్మించాడు. సదరు మహిళ తమ కుటుంబ సభ్యుల ఫొటోలను కూడా వాట్సాప్‌లో షేర్ చేసింది. ఈ క్రమంలోనే రంజాన్ భార్య అతని సెల్‌ఫోన్‌ను పరిశీలించగా వీరిద్దరి చాట్ మెసేజ్‌లు, ఫొటోలు బయటపడ్డాయి. వెంటనే సదరు మహిళకు ఫోన్‌చేసి తాను రంజాన్ భార్యనని, అతడు చెప్పేవన్ని అబద్ధాలని, నమ్మొద్దని, నమ్మితే మోసపోతావంటూ సూచించింది. దీంతో ఆమె రంజాన్ ఫోన్లకు స్పందించకుండా అతన్ని దూరం చేసే ప్రయత్నం చేయడం మొదలు పెట్టింది.

ఫేస్‌బుక్‌లో నగ్న ఫొటోలు...!
తన ఫోన్‌కు స్పందించకపోవడంతో రంజాన్... ఫేస్‌బుక్‌లో ఆమె పేరుతో నకిలీ ఐడీని క్రియేట్ చేశాడు. అప్పటికే తన వద్ద ఉన్న ఫొటోలను మార్పింగ్ చేసి నగ్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు మహిళ ఫేస్‌బుక్‌కు రిపోర్టు చేయడంతో ఆ ఫొటోలను, ఆ ఐడీని డిలీట్ చేశారు. దీంతో మరో ఐడీని క్రియేట్ చేసి, వారి కుటుంబ సభ్యుల ఫొటోలను కూడా మార్పింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉంటున్న బాధితురాలి సోదరి ఫొటోలను సైతం మార్పింగ్ చేసి ఇంటర్‌నెట్‌లో పెట్టాడు. దాంతో వారి ఫోన్ నెంబర్లను కూడా ఫొటోపై రాసి, ఎవరైనా వీళ్లను సంప్రదించాలంటూ అసభ్య పదజాలాలను ఉపయోగించాడు.

తమను వేధించవద్దంటూ బాధితురాలు రంజాన్‌ను వేడుకుంది. అయితే తనను పెండ్లి చేసుకోవాలని, నాగాపూర్‌కు తీసుకెళ్తానంటూ ఒత్తిడి పెంచాడు. ఇదిలాఉండగా ... హైదరాబాద్‌లో ఉంటున్న బాధితురాలి సోదరి ఫొటోలను తెలిసిన వారు చూసి ఆమె కు సమాచారం ఇచ్చారు. దీంతో షాక్‌కు గురైన బాధితురాలి సోదరి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ చాంద్‌పాషా నేతృత్వంలో ఎస్సై మహిపాల్ కేసు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు జరుగుతున్న క్రమంలోనే రంజాన్ హైదరాబాద్‌కు వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

4673
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles